ఫేస్బుక్ సంచలన నిర్ణయం!
వాషింగ్టన్: ఫేస్బుక్ ఓపెన్ చేస్తే చాలు అవసరం లేని విషయాలు ఎన్నో మనకు దర్శనమిస్తుంటాయి. ముఖ్యంగా మీడియా సంస్థల ద్వారా వచ్చే కొన్ని పోస్టులు యూజర్ల విలువైన కాలాన్ని హరించేస్తుంటాయి. అంతేకాదు 'ట్రెండింగ్ టాపిక్స్' విషయంలో ఫేస్బుక్ అనుసరిస్తున్న వైఖరి కొన్ని రాజకీయ అంశాలకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తుందన్న విమర్శలు కూడా వచ్చాయి. దీంతో దీన్ని సరిదిద్దుకునే పనిలో పడింది ఫేస్బుక్. ఇక వినియోగదారుల అభిరుచి మేరకు మాత్రమే వారికి పోస్టులు చేరేలా నిర్ణయం తీసుకున్నట్లు ఫేస్బుక్ వైస్ ప్రెసిడెంట్ ఆడమ్ మొస్సేరి వెల్లడించారు.
ఇందుకోసం ఫేస్బుక్ వినియోగదారులు లాగిన్ కాగానే కనిపించే 'న్యూస్ ఫీడ్' అనే ఆప్షన్ ఉపయోగపడుతుంది. దీనిలో కేవలం వినియోగదారుల అభిరుచికి అనుగుణంగా ఉన్న వార్తలు మాత్రమే కనిపిస్తాయి. దీంతో.. స్నేహితులు, కుటుంబసభ్యుల పోస్టులకు ప్రాధాన్యత ఏర్పడుతుందని ఫేస్బుక్ వర్గాలు వెల్లడించాయి. ఈ నిర్ణయంతో ఫేస్బుక్ ఎలాంటి వివక్షతలకు తావు లేని తటస్థ వేదిక అని యూజర్లకు మరోసారి భరోసా ఇచ్చినట్లు ఆడమ్ తెలిపారు.
ప్రపంచంలో ఏది చదవాలో యూజర్లకు చెప్పే బిజినెస్లో తాము లేమని.. కేవలం వ్యక్తులను, వారి భావాలను కలిపే బిజినెస్లో మాత్రమే తాము ఉన్నామని ఆడమ్ అన్నారు. గతంలొ నిర్వహించిన సర్వేల్లో తమ యూజర్లలో 66 శాతం మందికి ఫేస్బుక్ న్యూస్ ప్లాట్ఫాంగా పనికొస్తుందని తేలింది. అయితే తాజా నిర్ణయంతో ఫేస్బుక్ ద్వారా ట్రాఫిక్ను పెంచుకునే మీడియా సంస్థలపై ప్రభావం పడనుంది.