పాపం.. పోలీసు కావాలనుకుంది
మోగా: పంజాబ్లోని మోగాలో కదులుతున్న బస్సులోంచి తోసేసి 14 ఏళ్లబాలికను దారుణంగా హత్య చేసిన ఘటనలో లండకే గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. గ్రామస్తులు, గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న ఆ బాలిక స్నేహితులు, తోటి విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు.
తన భవిష్యత్తు గురించి ఆమె చాలా కలలు కంది. తన కలల సాకారం కోసం బాగా చదువుకోవాలనుకుంది. ఆమె క్లాసులో చాలా తెలివైన విద్యార్థిని.బలహీనవర్గాలు, అణచివేతకు గురవుతున్న వారి హక్కుల కోసం పోరాడాలనుకుంది. అందుకే పోలీసశాఖలో చేరాలనుకుంది. ఏదో ఒక రోజు తను కచ్చితంగా పోలీసు ఆఫీసర్ అవుతానని తన స్నేహితులతో తరచూ చెప్పేది. ఇదీ ఆ బాలిక బంధువు సందీప్ సింగ్, బాల్య స్నేహితురాలు సోమ రాణి ఆవేదన. తన స్నేహితురాలి జ్ఞాపకాలను మీడియాతో పంచుకున్న వారు ఆమెకు శుభ్రంగా ఉండడమన్నా, మంచి దుస్తులు వేసుకోవడం అన్నా చాలా ఇష్టమని తెలిపారు. పక్కవాళ్ళకు సాయంచేయడంలో ఎపుడూ ముందుండేదన్నారు.
పోలీసు అవ్వాలనుకున్న ఆ బాలిక, తాను ఈ చిన్న వయసులో ప్రపంచానికి దూరమవుతానని... తన మరణం కారణంగా ఈరోజు ఇంతమంది పోలీసులు తన గ్రామంలో మోహరిస్తారని ఊహించి ఉండి ఉండదంటూ కన్నీటి పర్యంతమయ్యారు గ్రామానికి దర్శన్ సింగ్. తనను ఎపుడూ బాబా అని పిలిచేదని, ఆమె కలల్ని దుర్మార్గులు ఛిద్రం చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కాగా గురుద్వారాకు వెళ్తున్నతల్లీ కూతుళ్లను వేధించి, కదులుతున్న బస్సులోంచి తోసేసి 14 ఏళ్ల వయసున్న బాలిక హత్య చేసిన ఘటన ప్రకంపనలు సృష్టించిన సంగతి తెలిసిందే.