సజీవ పాత్రల చేవ్రాలు ‘నాగేటి చాలు’ | Subscribed lively characters | Sakshi
Sakshi News home page

సజీవ పాత్రల చేవ్రాలు ‘నాగేటి చాలు’

Published Fri, Jan 9 2015 11:24 PM | Last Updated on Sat, Sep 2 2017 7:27 PM

సజీవ పాత్రల చేవ్రాలు ‘నాగేటి చాలు’

సజీవ పాత్రల చేవ్రాలు ‘నాగేటి చాలు’

మంచి పుస్తకం
 
మంచి కథ ఒక్కటి చాలు, ఒక రచయిత ప్రతిభా కౌశలాన్ని పాఠకుడి ముందుంచటానికి. వల్లూరి శివప్రసాద్ కథా సంపుటి ‘నాగేటి చాలు’ను తిరగేయండి. మొత్తం 22 కధలుంటే ప్రతి కథలోనూ అలాంటి ప్రతిభా కౌశలం చూస్తారు. శివప్రసాద్ కథలన్నీ వర్తమాన సమస్యలను స్వీకరిస్తాయి. ముఖ్యంగా రైతు సమస్యలని. పాత్రలన్నీ చాలా సహజంగా గంటూరు జిల్లా రైతు భాషను మాట్లాడతాయి. ఎక్కడా భావోద్వేగాల్ని అసహజంగా పలికించవు. ‘నాగేటి చాలు’లోని చలమయ్య అయినా, ‘పురుగు’ కథలోని అమరయ్య అయినా, ‘గిట్టుబాటు’ కథలోని కోటేశ్వరరావు అయినా ,‘పగ’ కథలోని ముత్తయ్య అయినా వీరందరిదీ మట్టిభాష. ఈ కథల్లోని విషాదం, బీభత్సం మన గుండేల్ని తాకుతుంది. అలాగే ‘గుండెలోతు’ ‘వానప్రస్థం’ కథల్లో వయసు పైబడిన తల్లిదండ్రుల సంఘర్షణను ఆయన కళ్ళకు కట్టిస్తారు.

మైనారిటీ వర్గాలకు చెందిన కథలు రెండు ఉన్నాయి. రెండూ కంటతడి పెట్టించేవే. ‘దొరకోటు’లో ముసలి పాలేరు ‘ఆదాం’ది చిన్న కోరిక. పొలానికి కాపలా కాసే సమయంలో చలి నుంచి అతనికి కొంత ఊరట కావాలి. ఏ ధర్మప్రభువైనా ఒక కోటు యివ్వకపోతాడా అన్న చిన్న కోరిక అతనిది. క్రిస్టియన్ మిషనరీ వాళ్ళు అతనికో దొరలు వాడిన కోటును దానంగా యిస్తారు. ఆ ప్రభువే యిచ్చాడని పొంగిపోతాడు. చివరికి జ్వరానికి తట్టుకోలేకపోతున్న మనవడి వైద్యం కోసం ఆ కోటును అమ్మేస్తాడు. సరే ఇలాంటి వితరణ సంస్థల్లో వుండే రాజకీయాల్ని ప్రశ్నిస్తాడు రచయిత. అది సెకండరీ. ఆదాం దోరకోటుతో ఊళ్ళో తిరిగినప్పుడు అతన్ని ఎకసెక్కమాడిన వాళ్ళు, సానుభూతి చూపించిన వాళ్ళు, నయానా భయానా బెదిరించిన వాళ్ళూ అందరూ రైతులే. రైతుల్లో వుండే మరో కోణాన్ని చూపిస్తాడు యిక్కడ రచయిత. ఆదాం లాంటి వాళ్ళ జీవితాల్లోని దుర్భరతను మనమూ చూస్తాం. ఆదాంను ఒక పట్టాన మర్చిపోలేం. ఇక రెండవ కథ ఎండమావి. ముస్లిం జీవితాల పేదరికం ఎంత భయంకరంగా వుంటుందో చూపే కథ. వృద్ధాప్య పింఛను ఇస్తున్నారని తెలిసిన అరవైయేళ్ళ బూబమ్మ దాని కోసం ప్రయత్నిస్తుంది. అనేక చీత్కారాలను దాటుకుని ఫోటోదిగడం కోసం డబ్బు కూడపెట్టుకుని చివరకు ఫోటో దిగుతుంది. ఆమె తపన మనలో టెన్షన్ పుట్టించి ఎట్లయినా ఆ ముసలి బూబమ్మకు పింఛను దక్కాలి అని భావిస్తుండగానే ఊరి రాజకీయాల లాలూచీతో ఆ ముసల్దాని దరఖాస్తు ఫారాన్ని చించేస్తాడు మునసబు. ఆ మునసబుని కొట్టాలనిపించేంత కోపం పాఠకుడికి కలుగుతుంది. ఈ రెండు కథల్లోనూ పాత్ర చిత్రణ, సన్నివేశ కల్పన సంభాషణలు వేటికవే సాటి. ఈ రచయితకు రైతులంటే గౌరవముంది. రిటైరయిపోయిన తల్లిదండ్రులంటే జాలి వుంది. ఆడవాళ్ళను స్వంతంగా ఆలోచించనివ్వరన్న ఆక్రోశం వుంది. వ్యవసాయాన్ని నాశనం చేసిన పాలకులంటే తీవ్రమయిన కోపం వుంది. అందుకే సందిగ్ధావస్థలో, సంక్షోభిత దశలో వున్న ఒక సమాజపు ప్రతీకలు ‘నాగేటి చాలు’ కధలన్నీ.

 - సి.ఎస్.రాంబాబు 94904 01005
 నాగేటి చాలు- వల్లూరి శివప్రసాద్;
 వెల: రూ.140; ప్రతులకు- విశాలాంధ్ర
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement