The book
-
యోగ... ఆధ్యాత్మిక... ఆరోగ్యానికి ఈ మూడూ
పుస్తకం ప్రముఖ ఆధ్యాత్మిక, యోగ గురువు స్వామి మైత్రేయ ‘యోగక్షేమం’, ‘ఆనందోబ్రహ్మ- ప్రజ్ఞానం బ్రహ్మ’, ‘ఆయుష్మాన్ భవ’ అంటూ మేలిముత్యాల్లాంటి మూడు మంచి పుస్తకాలను అందించారు. వాటిలో... మానసిక చపలత్వాన్ని అధిగమించి, ఆత్మపరంగా జీవించడానికి దోహదపడేదే యోగ, యోగసాధనే ఆనంద దాయకం అని బోధించే పుస్తకం ‘యోగక్షేమం’ ప్రతివిషయంలోనూ మనకు సమస్యలు, బాధలు, దుఃఖాలే కనిపిస్తుంటాయి. అలా కాకుండా ఏ పని చేస్తున్నామో ఆ పనిలోనే ఆ క్షణంలో సంపూర్ణంగా, నూటికి నూరుపాళ్లు ఉంటే అప్పుడు బ్రహ్మతత్వం అర్థం అవుతుంది అని వివరించే పుస్తకం ‘ఆనందోబ్రహ్మ- ప్రజ్ఞానం బ్రహ్మ’. ఆహారమనేది నోటిద్వారా తీసుకునేది మాత్రమే కాదు... జ్ఞానసముపార్జన ద్వారా ఇంద్రియాల ద్వారా స్వీకరించే ప్రతిదీ ఆహారమే. నోటిద్వారా మంచి ఆహారాన్ని తీసుకోవాలి. ఆలోచనలలో, మాటలలో, చేతలలో కూడా మంచిని చేయాలి అని వివరించే పుస్తకమే ‘ఆయుష్మాన్ భవ’. ఇందులో ఆహార నియమాలతోబాటు ఆలోచనలలో, మాటలలో, చేతలలో పాటించవలసిన విధివిధానాలను, కొన్ని యోగాసనాలను సచిత్రంగా అందించారు. యోగక్షేమం పుటలు:168; వెల రూ. 150 ఆనందోబ్రహ్మ పుటలు: 158; వెల రూ. 100 ఆయుష్మాన్ భవ పుటలు: 224; వెల రూ. 180 ప్రతులకు: శ్రీమతి కేబీ లక్ష్మి, 17-141, శ్రీ నిలయం, రామాలయానికి ముందు సందు, కమలానగర్ డెడ్‌లైన్, రోడ్‌నంబర్ 3, దిల్సుఖ్నగర్ బస్‌డిపో తర్వాత, చైతన్యపురి ఎక్స్ రోడ్ వద్ద, ఇండియన్ బ్యాంక్ సందు, హైదరాబాద్- 5000060. ఫోన్: - డీవీఆర్ -
నాద రేఖలు పుస్తకావిష్కరణ
నాంపల్లి (హైదరాబాద్): శాస్త్రీయ సంగీతానికి మంచి రోజులు వచ్చాయని విశ్రాంత ఐఏఎస్ అధికారి పీవీఆర్కే ప్రసాద్ అన్నారు. సోమవారం రాత్రి నాంపల్లిలోని తెలుగు విశ్వవిద్యాలయం ఎన్టీఆర్ కళామందిరంలో ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ విజేత శంకర్ నారాయణ రేఖా చిత్రాలు, సంగీతాచార్య డాక్టర్ వెజైర్సు బాలసుబ్రహ్మణ్యం పరిచయ వాక్యాలతో రూపొందించిన 'నాద రేఖలు' (సంగీత విధ్వాంసుల రేఖా చిత్రాలు) పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. పీవీఆర్కే ప్రసాద్ పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఈ పుస్తకం 'రిఫరెన్స్'లా అందరికీ ఉపయోగకరంగా ఉంటుందన్నారు. అజ్ఞాత వాగ్గేయకారుల వివరాలను ఈ పుస్తకంలో పొందుపరిచినట్లు ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో సినీనటులు తనికెళ్ల భరణి, పారిశ్రామికవేత్త వరప్రసాదరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఆ నవల మిగిల్చిన అనుభవం పులుపు...
తీపి: తీపి అనగానే నాకు వెంటనే గుర్తొచ్చేది పోతన ‘భాగవతం’. ‘బాలరసాలసాల నవపల్లవ కోమల కావ్యకన్యకన్ గూళలకిచ్చి ’... పోతన ప్రతి పద్యంలో ఒక లయ ఒక రుచి. చదవడం కూడా సులువు. తీపి అంటే నిస్సంకోచంగా పోతన భాగవతమే. పులుపు: నాకు సంబంధించినంత వరకు నా రచన ‘అనైతికం’. దీన్ని చాలా ఎక్స్పెక్ట్ చేసి రాశాను. స్త్రీవాదానికి సంబంధించినంత వరకు మంచి పీస్ అనుకున్నాను. కానీ అది స్త్రీవాదులని ముద్ర వేసుకున్నవాళ్లకే ఎక్కువ నచ్చలేదు. అది పాఠకులకు కూడా అంతగా ఎక్కలేదు కమర్షియల్‌గా. బట్ వన్ ఆఫ్ ది గుడ్ బుక్స్ యాజ్ ఫర్ యాజ్ మై వర్క్స్ ఆర్ కన్సర్న్డ్. ఈ పుస్తకం నాకు అనుభవం మిగిల్చిన పులుపుగా చెప్పుకోవచ్చు. వగరు: రామాయణ విషవృక్షం. నా వరకు నాకు రామాయణమంటే చాలా తాదాత్మ్యతతో కూడిన పుస్తకం. వాస్తవికత, ప్రస్తుతానికున్న సమాజానికి అది కరెక్టా కాదా ఇవన్నీ కాదు.. వాల్మీకి వర్ణనలు, అందులోని శిల్పం, శైలి, క్యారెక్టరైజేషన్.. దాన్ని కూడా రంధ్రాన్వేషణ చేసే రచయిత్రి... ఆ రచన.. నిజంగా వగరే! ఉప్పు: దీనికి ఒక పుస్తకం అని కాకుండా సమాజం మారాలి... సమాజం మారాలి అంటూ సాగే పుస్తకాలన్నీ ఉప్పే. మారాల్సింది సమాజం కాదు మనుషులు. మనుషులు మారాలంటే ఓ వ్యక్తిత్వం, ఓ సిన్సియారిటీ, బిలాంగింగ్‌నెస్, జీవితంపట్ల ఒక అవగాహన... ఇవన్నీ ఉంటే సమాజం దానంతటదే మారుతుంది. అలా కాకుండా తమ కష్టాలన్నిటికీ సమాజాన్ని నిందిస్తూ, తమ రచనలన్నిట్లో సమాజాన్ని తిట్టే పుస్తకాలు అవసరమేమో కానీ పాఠకులను ఎందుకొచ్చిందిరా భగవంతుడా అని అనుకునే స్టేజ్‌కి తీసుకెళ్లే అలాంటి రచనలన్నీ నాకు ఉప్పు కిందే లెక్క. కారం: త్రిపురనేని గోపీచంద్ ‘అసమర్థుని జీవయాత్ర’, ‘మెరుపుల మరకలు’, కొడవటిగంటి ‘చదువు, రంగనాయకమ్మ ‘బలిపీఠం’... ఇవన్నీ కారం కిందే లెక్క. ఇవన్నీ చదువుతుంటే ఇదంతా నిజం కదా అనిపిస్తుంది కానీ ఒరకమైన మంట కూడా ఉంటుంది. తొందరగా జీర్ణమవ్వవు. అలాగని అవి లేకపోతే చప్పగా ఉంటుంది. చేదు: ఇటీవల ఒక రచయిత రాస్తున్నాడు... తన స్నేహితుల్లో ఉండే వ్యసనాలు, చెడు గుణాలను వాళ్ల పేర్లు పెట్టి రాస్తున్నాడు. వాళ్లలో కొంతమంది చచ్చిపోయారు కూడా. ఆ రచయిత, ఆ పుస్తకం పేరు చెప్పడం కూడా చేదు. ముక్తాయింపు: ఏ భాషలోనూ లేని సొగసు తెలుగుది. నాకు తెలిసినంతలో తెలుగులో తప్ప మరే భాషలోనూ ‘పద్యం’ లేదు. నలభై పైగా అక్షరాలతో, ఇరవై పైగా వత్తుల సపోర్ట్‌తో, పదిగుణింతాల కలయికతో, మూడొందల పైగా కాంబినేషన్లతో, గణాల, యతుల, ప్రాసల, విభక్తుల, చందస్సుల అల్లికతో, సమాసాలకారంతో, సంధుల తీపితో.. అందుకే ఓయమ్మో.. తెలుగంత గిలిగింత తనువంత పులకింత జగమంతా వెతికినా కనపడదు. అదొక ఉగాది పచ్చడి! - యండమూరి వీరేంద్రనాథ్ సేకరణ: రమా సరస్వతి -
సంచలన పుస్తకానికి... సలామ్!
పుస్తకం బ్రిటిష్ ఇలస్ట్రేటర్ జోహన్న బస్ఫోర్డ్ పుస్తకం ‘సీక్రెట్ గార్డెన్’ పది లక్షలకు పైగా కాపీలు అమ్ముడై సంచలనం సృష్టిస్తోంది. ఫ్రాన్సులో అయితే బెస్ట్ సెల్లింగ్ వంటల పుస్తకాలను సైతం పక్కకు నెట్టేసి దూసుకువెళుతోంది. ఇప్పటికే 14 భాషల్లోకి ఈ పుస్తకం తర్జుమా అయింది. తన పుస్తకం ఇంత హిట్ అవుతుందని జోహన్న కూడా ఊహించలేదు. రెండు సంవత్సరాల క్రితం రిలాక్స్ కోసం బొమ్మలు వేయడం ప్రారంభించింది. అలా ‘బొమ్మలేయడం’ తనకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిపెడుతుందని జోహన్న ఊహించి ఉండదు. ‘సీక్రెట్ గార్డెన్’ అనే ఈ కలరింగ్ బుక్‌లో 60 ఇలస్ట్రేషన్ల వరకు ఉన్నాయి. బొమ్మలకు రంగులు వేయడానికి చిన్నవాళ్లతో పోటీ పడి మరీ పెద్దవాళ్లు ఈ పుస్తకాన్ని కొంటున్నారు. ప్రయోజనం ఏమిటి? మానసిక విశ్లేషకులు చెప్పేదాని ప్రకారం ఇలస్ట్రేషన్‌లకు రంగులు వేయడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా: ఏకాగ్రత పెరుగుతుంది మనసు ప్రశాంతంగా ఉంటుంది. సృజనశక్తి పెరుగుతుంది. ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. -
సజీవ పాత్రల చేవ్రాలు ‘నాగేటి చాలు’
మంచి పుస్తకం మంచి కథ ఒక్కటి చాలు, ఒక రచయిత ప్రతిభా కౌశలాన్ని పాఠకుడి ముందుంచటానికి. వల్లూరి శివప్రసాద్ కథా సంపుటి ‘నాగేటి చాలు’ను తిరగేయండి. మొత్తం 22 కధలుంటే ప్రతి కథలోనూ అలాంటి ప్రతిభా కౌశలం చూస్తారు. శివప్రసాద్ కథలన్నీ వర్తమాన సమస్యలను స్వీకరిస్తాయి. ముఖ్యంగా రైతు సమస్యలని. పాత్రలన్నీ చాలా సహజంగా గంటూరు జిల్లా రైతు భాషను మాట్లాడతాయి. ఎక్కడా భావోద్వేగాల్ని అసహజంగా పలికించవు. ‘నాగేటి చాలు’లోని చలమయ్య అయినా, ‘పురుగు’ కథలోని అమరయ్య అయినా, ‘గిట్టుబాటు’ కథలోని కోటేశ్వరరావు అయినా ,‘పగ’ కథలోని ముత్తయ్య అయినా వీరందరిదీ మట్టిభాష. ఈ కథల్లోని విషాదం, బీభత్సం మన గుండేల్ని తాకుతుంది. అలాగే ‘గుండెలోతు’ ‘వానప్రస్థం’ కథల్లో వయసు పైబడిన తల్లిదండ్రుల సంఘర్షణను ఆయన కళ్ళకు కట్టిస్తారు. మైనారిటీ వర్గాలకు చెందిన కథలు రెండు ఉన్నాయి. రెండూ కంటతడి పెట్టించేవే. ‘దొరకోటు’లో ముసలి పాలేరు ‘ఆదాం’ది చిన్న కోరిక. పొలానికి కాపలా కాసే సమయంలో చలి నుంచి అతనికి కొంత ఊరట కావాలి. ఏ ధర్మప్రభువైనా ఒక కోటు యివ్వకపోతాడా అన్న చిన్న కోరిక అతనిది. క్రిస్టియన్ మిషనరీ వాళ్ళు అతనికో దొరలు వాడిన కోటును దానంగా యిస్తారు. ఆ ప్రభువే యిచ్చాడని పొంగిపోతాడు. చివరికి జ్వరానికి తట్టుకోలేకపోతున్న మనవడి వైద్యం కోసం ఆ కోటును అమ్మేస్తాడు. సరే ఇలాంటి వితరణ సంస్థల్లో వుండే రాజకీయాల్ని ప్రశ్నిస్తాడు రచయిత. అది సెకండరీ. ఆదాం దోరకోటుతో ఊళ్ళో తిరిగినప్పుడు అతన్ని ఎకసెక్కమాడిన వాళ్ళు, సానుభూతి చూపించిన వాళ్ళు, నయానా భయానా బెదిరించిన వాళ్ళూ అందరూ రైతులే. రైతుల్లో వుండే మరో కోణాన్ని చూపిస్తాడు యిక్కడ రచయిత. ఆదాం లాంటి వాళ్ళ జీవితాల్లోని దుర్భరతను మనమూ చూస్తాం. ఆదాంను ఒక పట్టాన మర్చిపోలేం. ఇక రెండవ కథ ఎండమావి. ముస్లిం జీవితాల పేదరికం ఎంత భయంకరంగా వుంటుందో చూపే కథ. వృద్ధాప్య పింఛను ఇస్తున్నారని తెలిసిన అరవైయేళ్ళ బూబమ్మ దాని కోసం ప్రయత్నిస్తుంది. అనేక చీత్కారాలను దాటుకుని ఫోటోదిగడం కోసం డబ్బు కూడపెట్టుకుని చివరకు ఫోటో దిగుతుంది. ఆమె తపన మనలో టెన్షన్ పుట్టించి ఎట్లయినా ఆ ముసలి బూబమ్మకు పింఛను దక్కాలి అని భావిస్తుండగానే ఊరి రాజకీయాల లాలూచీతో ఆ ముసల్దాని దరఖాస్తు ఫారాన్ని చించేస్తాడు మునసబు. ఆ మునసబుని కొట్టాలనిపించేంత కోపం పాఠకుడికి కలుగుతుంది. ఈ రెండు కథల్లోనూ పాత్ర చిత్రణ, సన్నివేశ కల్పన సంభాషణలు వేటికవే సాటి. ఈ రచయితకు రైతులంటే గౌరవముంది. రిటైరయిపోయిన తల్లిదండ్రులంటే జాలి వుంది. ఆడవాళ్ళను స్వంతంగా ఆలోచించనివ్వరన్న ఆక్రోశం వుంది. వ్యవసాయాన్ని నాశనం చేసిన పాలకులంటే తీవ్రమయిన కోపం వుంది. అందుకే సందిగ్ధావస్థలో, సంక్షోభిత దశలో వున్న ఒక సమాజపు ప్రతీకలు ‘నాగేటి చాలు’ కధలన్నీ. - సి.ఎస్.రాంబాబు 94904 01005 నాగేటి చాలు- వల్లూరి శివప్రసాద్; వెల: రూ.140; ప్రతులకు- విశాలాంధ్ర -
నీలి ఆకాశంపై జమీల్యా మేఘం
జ్ఞాపకం/ పుస్తకం ఈ శీతాకాలం చలి పెరిగిపోయింది. ఊళ్లో అందరూ వింతగా చెప్పుకుంటున్నారు. గ్రామాల్లో అన్నీ విడ్డూరాలే. కాని ఈసారి చలి కొంచెం ఎక్కువగానే అనిపిస్తోంది. చెరువులో అలలు ఎండవల్ల మెరుస్తున్నాయి. కొబ్బరి చెట్ల ఆకులు సుతారంగా కదులుతున్నాయి. ఆకాశం ముదురు నీలం రంగులో ఉంది. అక్కడక్కడ తెల్లని మేఘాల తునకలు నెమ్మదిగా ప్రయాణం చేస్తున్నాయి. ఒక మేఘం తన రూపాన్ని మార్చుకుంటూ ఒకోసారి ఒకోవిధంగా కనిపిస్తోంది. ఈసారి తలకు తెల్లని స్కార్ఫ్ కట్టుకొని ఉన్న ఓ అమ్మాయి ముఖంలా ఉంది. ఆ రూపాన్ని ఎక్కడైనా చూశానా? అవును. చూశాను. మనసు పరిపరివిధాల మదన పడుతుంటే గుర్తొచ్చింది. జమీల్యా! జమీల్యా కూడా ఇలాగే ఉంటుంది. కురులు లేవకుండా తలంతా స్కార్ఫ్ కట్టేసుకొని. తలెత్తి మళ్లీ చూశాను. ముఖంపై బొట్టుకూడా లేదు. తెల్లని చందమామలా మెరిసిపోతోంది- అచ్చు జమీల్యాలా. ఎన్నాళ్లయింది ఆ పుస్తకం చదివి. జమీల్యాతో చెట్టాపట్టాలేసుకొని తిరిగి. మళ్లీ చదవాలి. ఇప్పుడే ఈ క్షణమే. వెంటనే గణపవరంపార్టీ ఆఫీసుకెళ్లాను. ఎవరూ లేరు. ముందుహాలు గొళ్లెం పెట్టి ఉంది. తీసుకొని లోపలికి వెళితే షెల్ఫ్‌లో కొన్ని పుస్తకాలు. అప్పటి సాహిత్యం ఓ నాలుగు పుస్తకాలు దొరికాయి. నీలం అట్ట ‘జమీల్యా’ కూడా దొరికింది. పేజీ తిప్పితే గుండె ఝల్లుమంది. అది నేనిచ్చిన పుస్తకమే. ’80లో కొన్నది. అంటే 35 సంవత్సరాలు గడిచిపోయాయి. అప్పుడు చదివిన పుస్తకం ఇప్పటికీ లీలగా గుర్తు ఉంది. ఆ కథలో ఏదో తియ్యటి బాధ. రెండో ప్రపంచ యుద్ధకాలం. అప్పటి సోవియెట్ రిపబ్లిక్లో భాగమైన కిర్గిస్తాన్‌లోని ముస్లిం తెగల నేపథ్యం. కథ చెప్పే అతను ఓ పెయింటర్. అప్పుడే యవ్వనంలోకి అడుగు పెడుతున్న కుర్రాడు. ఇతనికి వదిన వరస అయిన అమ్మాయి ‘జమీల్యా’. ఆమె భర్త యుద్ధంలోకి పోయాడు. మిగిలినవాళ్లు, ముసలివాళ్లు, కొంచెం వయసు వచ్చిన కుర్రాళ్లు సమష్టి వ్యవసాయ క్షేత్రంలో పని చేస్తూ యుద్ధంలో ఉన్న సైనికుల కోసం లేవీ ధాన్యాన్ని పంపిస్తుంటారు. ధాన్యం తోలే పని ఈ కథకుని పైనా, వదిన జమీల్యాపైనా పడుతుంది. స్తెప్ మైదానాలు, పక్కనే ఎత్తై నీలిరంగు పర్వతాలు, స్వచ్ఛమైన నీళ్లతో గలగల పారుతున్న నదులు, తలూపుతున్న పోపలార్ చెట్లూ, అప్పుడప్పుడు వచ్చే వర్షపు జల్లులు, రాత్రులు మెరిసే నక్షత్రాలు... ఈ ప్రకృతిలో కలసిపోతూ శ్రమను మరిచిపోతూ గుర్రపుబగ్గీలు తోలుకుంటూ కాలం గడుపుతున్న వీళ్లతో మరో గాయపడ్డ అపరిచిత సైనికుడు ‘దనియార్’ చేరతాడు. అతని మంచి వ్యక్తిత్వం, మధురమైన కంఠస్వరంకు జమీల్యా ఆకర్షింపబడుతుంది. వాళ్లిద్దరి ప్రేమ ఫ్యాంటసీలో మునిగి తేలుతాడు కథకుడు. వాళ్ల ప్రేమను సమర్థిస్తాడు. వాళ్లెక్కడికో సుదూర తీరాలకు వెళ్లిపోతారు. వాళ్ల స్మృతులలో బతుకుతాడు కథకుడు. కథ గురించి ఇలా చెబితే బాగుంటుందా? దానిని చదవాల్సిందే. అనుభవించే పలవరించాల్సిందే. ఆ మధురానుభూతుల్లో తేలిపోవాల్సిందే. ‘చెంగిజ్ ఐతమాతోవ్’ రాసిన కథ ఇది. అతడు వెనుకబడిన కిర్గిజ్ తెగలో పుట్టి ఇంజనీరింగ్ చదివి తరువాత రచయిత అయ్యి చివరకు ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ నాయకత్వ స్థానానికి కూడా ఎదిగాడు. ‘జమీల్యా’ సినిమాగా కూడా వచ్చింది. యూట్యూబ్‌లో చూడండి. జమీల్యా గౌరవార్థం గతంలో రష్యా పోస్టల్ స్టాంప్ కూడా ప్రచురించింది. ఎంత బాగుందో చూడండి. ఓ కథలో పాత్ర ఎంత ప్రభావం చూపగలదో తెలియాలంటే మీరు జమీల్యా చదవాల్సిందే. - కుమార్ కూనపరాజు, 99899 99599