ఆ నవల మిగిల్చిన అనుభవం పులుపు...
తీపి: తీపి అనగానే నాకు వెంటనే గుర్తొచ్చేది పోతన ‘భాగవతం’. ‘బాలరసాలసాల నవపల్లవ కోమల కావ్యకన్యకన్ గూళలకిచ్చి ’... పోతన ప్రతి పద్యంలో ఒక లయ ఒక రుచి. చదవడం కూడా సులువు. తీపి అంటే నిస్సంకోచంగా పోతన భాగవతమే.
పులుపు: నాకు సంబంధించినంత వరకు నా రచన ‘అనైతికం’. దీన్ని చాలా ఎక్స్‌పెక్ట్ చేసి రాశాను. స్త్రీవాదానికి సంబంధించినంత వరకు మంచి పీస్ అనుకున్నాను. కానీ అది స్త్రీవాదులని ముద్ర వేసుకున్నవాళ్లకే ఎక్కువ నచ్చలేదు. అది పాఠకులకు కూడా అంతగా ఎక్కలేదు కమర్షియల్‌గా. బట్ వన్ ఆఫ్ ది గుడ్ బుక్స్ యాజ్ ఫర్ యాజ్ మై వర్క్స్ ఆర్ కన్‌సర్న్డ్. ఈ పుస్తకం నాకు అనుభవం మిగిల్చిన పులుపుగా చెప్పుకోవచ్చు.
వగరు: రామాయణ విషవృక్షం. నా వరకు నాకు రామాయణమంటే చాలా తాదాత్మ్యతతో కూడిన పుస్తకం. వాస్తవికత, ప్రస్తుతానికున్న సమాజానికి అది కరెక్టా కాదా ఇవన్నీ కాదు.. వాల్మీకి వర్ణనలు, అందులోని శిల్పం, శైలి, క్యారెక్టరైజేషన్.. దాన్ని కూడా రంధ్రాన్వేషణ చేసే రచయిత్రి... ఆ రచన.. నిజంగా వగరే!
ఉప్పు: దీనికి ఒక పుస్తకం అని కాకుండా సమాజం మారాలి... సమాజం మారాలి అంటూ సాగే పుస్తకాలన్నీ ఉప్పే. మారాల్సింది సమాజం కాదు మనుషులు. మనుషులు మారాలంటే ఓ వ్యక్తిత్వం, ఓ సిన్సియారిటీ, బిలాంగింగ్‌నెస్, జీవితంపట్ల ఒక అవగాహన... ఇవన్నీ ఉంటే సమాజం దానంతటదే మారుతుంది. అలా కాకుండా తమ కష్టాలన్నిటికీ సమాజాన్ని నిందిస్తూ, తమ రచనలన్నిట్లో సమాజాన్ని తిట్టే పుస్తకాలు అవసరమేమో కానీ పాఠకులను ఎందుకొచ్చిందిరా భగవంతుడా అని అనుకునే స్టేజ్‌కి తీసుకెళ్లే అలాంటి రచనలన్నీ నాకు ఉప్పు కిందే లెక్క.
కారం: త్రిపురనేని గోపీచంద్ ‘అసమర్థుని జీవయాత్ర’, ‘మెరుపుల మరకలు’, కొడవటిగంటి ‘చదువు, రంగనాయకమ్మ ‘బలిపీఠం’... ఇవన్నీ కారం కిందే లెక్క. ఇవన్నీ చదువుతుంటే ఇదంతా నిజం కదా అనిపిస్తుంది కానీ ఒరకమైన మంట కూడా ఉంటుంది. తొందరగా జీర్ణమవ్వవు. అలాగని అవి లేకపోతే చప్పగా ఉంటుంది.
చేదు: ఇటీవల ఒక రచయిత రాస్తున్నాడు... తన స్నేహితుల్లో ఉండే వ్యసనాలు, చెడు గుణాలను వాళ్ల పేర్లు పెట్టి రాస్తున్నాడు. వాళ్లలో కొంతమంది చచ్చిపోయారు కూడా. ఆ రచయిత, ఆ పుస్తకం పేరు చెప్పడం కూడా చేదు.
ముక్తాయింపు: ఏ భాషలోనూ లేని సొగసు తెలుగుది. నాకు తెలిసినంతలో తెలుగులో తప్ప మరే భాషలోనూ ‘పద్యం’ లేదు. నలభై పైగా అక్షరాలతో, ఇరవై పైగా వత్తుల సపోర్ట్‌తో, పదిగుణింతాల కలయికతో, మూడొందల పైగా కాంబినేషన్లతో, గణాల, యతుల, ప్రాసల, విభక్తుల, చందస్సుల అల్లికతో, సమాసాలకారంతో, సంధుల తీపితో.. అందుకే ఓయమ్మో.. తెలుగంత గిలిగింత తనువంత పులకింత జగమంతా వెతికినా కనపడదు. అదొక ఉగాది పచ్చడి!
- యండమూరి వీరేంద్రనాథ్
సేకరణ: రమా సరస్వతి