పుస్తకం
బ్రిటిష్ ఇలస్ట్రేటర్ జోహన్న బస్ఫోర్డ్ పుస్తకం ‘సీక్రెట్ గార్డెన్’ పది లక్షలకు పైగా కాపీలు అమ్ముడై సంచలనం సృష్టిస్తోంది. ఫ్రాన్సులో అయితే బెస్ట్ సెల్లింగ్ వంటల పుస్తకాలను సైతం పక్కకు నెట్టేసి దూసుకువెళుతోంది. ఇప్పటికే 14 భాషల్లోకి ఈ పుస్తకం తర్జుమా అయింది.
తన పుస్తకం ఇంత హిట్ అవుతుందని జోహన్న కూడా ఊహించలేదు. రెండు సంవత్సరాల క్రితం రిలాక్స్ కోసం బొమ్మలు వేయడం ప్రారంభించింది. అలా ‘బొమ్మలేయడం’ తనకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిపెడుతుందని జోహన్న ఊహించి ఉండదు. ‘సీక్రెట్ గార్డెన్’ అనే ఈ కలరింగ్ బుక్‌లో 60 ఇలస్ట్రేషన్ల వరకు ఉన్నాయి. బొమ్మలకు రంగులు వేయడానికి చిన్నవాళ్లతో పోటీ పడి మరీ పెద్దవాళ్లు ఈ పుస్తకాన్ని కొంటున్నారు.
ప్రయోజనం ఏమిటి? మానసిక విశ్లేషకులు చెప్పేదాని ప్రకారం ఇలస్ట్రేషన్లకు రంగులు వేయడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా: ఏకాగ్రత పెరుగుతుంది మనసు ప్రశాంతంగా ఉంటుంది. సృజనశక్తి పెరుగుతుంది. ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది.