నీలి ఆకాశంపై జమీల్యా మేఘం
జ్ఞాపకం/ పుస్తకం
ఈ శీతాకాలం చలి పెరిగిపోయింది. ఊళ్లో అందరూ వింతగా చెప్పుకుంటున్నారు. గ్రామాల్లో అన్నీ విడ్డూరాలే. కాని ఈసారి చలి కొంచెం ఎక్కువగానే అనిపిస్తోంది. చెరువులో అలలు ఎండవల్ల మెరుస్తున్నాయి. కొబ్బరి చెట్ల ఆకులు సుతారంగా కదులుతున్నాయి. ఆకాశం ముదురు నీలం రంగులో ఉంది. అక్కడక్కడ తెల్లని మేఘాల తునకలు నెమ్మదిగా ప్రయాణం చేస్తున్నాయి. ఒక మేఘం తన రూపాన్ని మార్చుకుంటూ ఒకోసారి ఒకోవిధంగా కనిపిస్తోంది. ఈసారి తలకు తెల్లని స్కార్ఫ్ కట్టుకొని ఉన్న ఓ అమ్మాయి ముఖంలా ఉంది. ఆ రూపాన్ని ఎక్కడైనా చూశానా? అవును. చూశాను. మనసు పరిపరివిధాల మదన పడుతుంటే గుర్తొచ్చింది. జమీల్యా! జమీల్యా కూడా ఇలాగే ఉంటుంది. కురులు లేవకుండా తలంతా స్కార్ఫ్ కట్టేసుకొని. తలెత్తి మళ్లీ చూశాను. ముఖంపై బొట్టుకూడా లేదు. తెల్లని చందమామలా మెరిసిపోతోంది- అచ్చు జమీల్యాలా. ఎన్నాళ్లయింది ఆ పుస్తకం చదివి. జమీల్యాతో చెట్టాపట్టాలేసుకొని తిరిగి. మళ్లీ చదవాలి. ఇప్పుడే ఈ క్షణమే.
వెంటనే గణపవరంపార్టీ ఆఫీసుకెళ్లాను. ఎవరూ లేరు. ముందుహాలు గొళ్లెం పెట్టి ఉంది. తీసుకొని లోపలికి వెళితే షెల్ఫ్‌లో కొన్ని పుస్తకాలు. అప్పటి సాహిత్యం ఓ నాలుగు పుస్తకాలు దొరికాయి. నీలం అట్ట ‘జమీల్యా’ కూడా దొరికింది. పేజీ తిప్పితే గుండె ఝల్లుమంది. అది నేనిచ్చిన పుస్తకమే. ’80లో కొన్నది. అంటే 35 సంవత్సరాలు గడిచిపోయాయి. అప్పుడు చదివిన పుస్తకం ఇప్పటికీ లీలగా గుర్తు ఉంది. ఆ కథలో ఏదో తియ్యటి బాధ.
రెండో ప్రపంచ యుద్ధకాలం. అప్పటి సోవియెట్ రిపబ్లిక్‌లో భాగమైన కిర్గిస్తాన్‌లోని ముస్లిం తెగల నేపథ్యం. కథ చెప్పే అతను ఓ పెయింటర్. అప్పుడే యవ్వనంలోకి అడుగు పెడుతున్న కుర్రాడు. ఇతనికి వదిన వరస అయిన అమ్మాయి ‘జమీల్యా’. ఆమె భర్త యుద్ధంలోకి పోయాడు. మిగిలినవాళ్లు, ముసలివాళ్లు, కొంచెం వయసు వచ్చిన కుర్రాళ్లు సమష్టి వ్యవసాయ క్షేత్రంలో పని చేస్తూ యుద్ధంలో ఉన్న సైనికుల కోసం లేవీ ధాన్యాన్ని పంపిస్తుంటారు. ధాన్యం తోలే పని ఈ కథకుని పైనా, వదిన జమీల్యాపైనా పడుతుంది. స్తెప్ మైదానాలు, పక్కనే ఎత్తై నీలిరంగు పర్వతాలు, స్వచ్ఛమైన నీళ్లతో గలగల పారుతున్న నదులు, తలూపుతున్న పోపలార్ చెట్లూ, అప్పుడప్పుడు వచ్చే వర్షపు జల్లులు, రాత్రులు మెరిసే నక్షత్రాలు... ఈ ప్రకృతిలో కలసిపోతూ శ్రమను మరిచిపోతూ గుర్రపుబగ్గీలు తోలుకుంటూ కాలం గడుపుతున్న వీళ్లతో మరో గాయపడ్డ అపరిచిత సైనికుడు ‘దనియార్’ చేరతాడు. అతని మంచి వ్యక్తిత్వం, మధురమైన కంఠస్వరంకు జమీల్యా ఆకర్షింపబడుతుంది. వాళ్లిద్దరి ప్రేమ ఫ్యాంటసీలో మునిగి తేలుతాడు కథకుడు. వాళ్ల ప్రేమను సమర్థిస్తాడు. వాళ్లెక్కడికో సుదూర తీరాలకు వెళ్లిపోతారు. వాళ్ల స్మృతులలో బతుకుతాడు కథకుడు.
కథ గురించి ఇలా చెబితే బాగుంటుందా? దానిని చదవాల్సిందే. అనుభవించే పలవరించాల్సిందే. ఆ మధురానుభూతుల్లో తేలిపోవాల్సిందే. ‘చెంగిజ్ ఐతమాతోవ్’ రాసిన కథ ఇది. అతడు వెనుకబడిన కిర్గిజ్ తెగలో పుట్టి ఇంజనీరింగ్ చదివి తరువాత రచయిత అయ్యి చివరకు ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ నాయకత్వ స్థానానికి కూడా ఎదిగాడు. ‘జమీల్యా’ సినిమాగా కూడా వచ్చింది. యూట్యూబ్‌లో చూడండి. జమీల్యా గౌరవార్థం గతంలో రష్యా పోస్టల్ స్టాంప్ కూడా ప్రచురించింది. ఎంత బాగుందో చూడండి. ఓ కథలో పాత్ర ఎంత ప్రభావం చూపగలదో తెలియాలంటే మీరు జమీల్యా చదవాల్సిందే.
- కుమార్ కూనపరాజు, 99899 99599