
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలను లబ్ధిదారులకు అందిస్తున్న తీరుపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్నప్పుడు పథకాల పంపిణీ ఎలా ఉండాలి? నిబంధనల అమలు ఎలా ఉంది? అనే కోణంలో పరిశీలన మొదలుపెట్టింది. దళితబంధు, రైతుబంధు, బీసీ బంధులాంటి పథకాలకు సంబంధించి ప్రస్తుత సమయంలో లబ్ధిదారులకు సాయం అందించే అంశంపై కాంగ్రెస్ పార్టీ ఇటీవల ఎన్నికల సంఘం దృష్టికి తీసుకు వచ్చిన సంగతి తెలిసిందే.
ఈ పథకాల కింద ఎంపిక చేసిన లబ్ధిదారులకు నోటిఫికేషన్ వచ్చే నాటికి లబ్ధి చేకూర్చాలని, ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత పంపిణీ చేస్తే ఓటర్లు ప్రభావితమయ్యే అవకాశం ఉంటుందని టీపీసీసీ ఎన్నికల సంఘానికి వివరించింది. దీంతో స్పందించిన ఎన్నికల సంఘం.. సంబంధిత శాఖలను వివరణ కోరింది. తక్షణమే స్పందించి పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని ఉన్నతాధికారులను ఆదేశించింది.
నివేదికలు సిద్ధం
సంక్షేమ పథకాల అమలుపై ఎన్నికల సంఘం నివేదిక కోరడంతో సంబంధిత శాఖలు వివరణ ఇచ్చేందుకు ఉపక్రమించాయి. పథకాల వారీగా శాఖలు ఇప్పటికే సమాచారాన్ని సిద్ధం చేసుకున్నాయి. దళితబంధు పథకం నియోజకవర్గం యూనిట్‌గా అమలు చేస్తున్న క్రమంలో హుజూరాబాద్ నియోజకవర్గం మినహా మిగతా 118 నియోజకవర్గాల్లో లబ్ధిదారుల ఎంపిక జాబితాలు, నిర్వహించిన అవగాహన కార్యక్రమాలపై పూర్తిస్థాయి సమాచారంతో ఎస్సీ కార్పొరేషన్ సిద్ధమైంది.
కాగా, రెండోవిడత దళితబంధు పథకం కింద నియోజకవర్గానికి ఐదు వందల మంది లబ్ధిదారులకు సాయం ఇచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్‌కు అనుమతి ఇచ్చింది. దీంతో క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యేల ద్వారా పలు సిఫార్సులు రావడంతో వాటిని పరిశీలించి అర్హులను ఎంపిక చేసినట్లు తెలిసింది. ఈ పథకం కింద మొదటి విడతలో కూడా ఎంతమందికి లబ్ధి చేకూర్చారన్నది కూడా ఎన్నికల సంఘానికి వివరించనుంది.
అదేవిధంగా రైతుబంధు పథకం కింద గత ఐదేళ్లుగా పంపిణీ చేసిన మొత్తంతో పాటు ప్రస్తుతం ఉన్న లబ్ధిదారులు, వారికి ఇవ్వాల్సిన నిధులు తదితర సమాచారాన్ని సైతం వ్యవసాయ శాఖ సిద్ధం చేసింది. దీంతోపాటు వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అమలు చేస్తున్న బీసీబంధు పథకం కింద అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఎంపిక చేసిన లబ్ధిదారుల జాబితాలను సమర్పించేందుకు సిద్ధమైంది. ఈ పథకం కింద ఎంతమందికి ఆర్థిక సాయం అందించారనే అంశాలను కూడా నివేదిక రూపంలో తయారుచేసి పెట్టుకుంది. సంబంధిత శాఖల ఉన్నతాధికారులు ఈ వివరాలను ఒకటి రెండు రోజుల్లో ఎన్నికల సంఘానికి సమర్పించనున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment