ప్రధాని మోదీకి వినతి పత్రం ఇస్తున్న సీఎం రేవంత్. చిత్రంలో మంత్రి పొన్నం ప్రభాకర్
ప్రధాని మోదీకి సీఎం రేవంత్ కోర్కెల చిట్టా
బేగంపేట ఎయిర్‌పోర్టులో 11 అంశాలతో కూడిన వినతిపత్రం అందజేత
ఎన్టీపీసీలో 2,400 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి కేంద్రం సహకరించాలి
మెట్రో విస్తరణకు, మూసీ ప్రక్షాళనకు చేయూతనివ్వండి
తుమ్మిడిహెట్టి ఎత్తిపోతల ప్రాజెక్టుకు మహారాష్ట్రను ఒప్పించండి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో తన రెండురోజుల పర్యటన ముగించుకుని ఒడిశాకు వెళ్తున్న ప్రధాన మంత్రి నరేంద్రమోదీకి సీఎం రేవంత్‌రెడ్డి తన విన్నపాల చిట్టా అందజే శారు. సోమ, మంగళవారాల్లో రాష్ట్రంలో వేలకోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయడంతో పాటు బీజేపీ ఆధ్వర్యంలో జరిగిన బహిరంగ సభల్లో పాల్గొన్న ప్రధాని మంగళవారం ఒడిశాకు బయలుదేరారు. సీఎం రేవంత్ బేగంపేట విమానాశ్రయంలో మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి ఆయనకు వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మొత్తం 11 అంశాలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు.
► ఎన్టీపీసీకి 4,000 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి సామర్థ్యం ఉంది. అయితే గత ప్రభుత్వం 1,600 మెగావాట్లు మాత్రమే సా ధించింది. మిగిలిన 2,400 మెగావాట్ల ఉత్పత్తికి కేంద్రం సహ కరించాలి. రాష్ట్రం తరఫున అన్ని అనుమతులు ఇస్తాం.
► హైదరాబాద్‌లో మెట్రో విస్తరణకు, మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధికి (ప్రక్షాళనకు) సహకరించాలి.
► తుమ్మిడిహెట్టి ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. భూసేకరణ, నీటి వాటాల విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించేలా ప్రధాని జోక్యం చేసుకోవాలి.
► హైదరాబాద్–శ్రీశైలం జాతీయ రహదారిపై అమ్రాబాద్ అటవీ ప్రాంతం మీదుగా ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి సహకరించాలి. 2022–23లోనే కేంద్ర ప్రభుత్వం డీపీఆర్ తయారీకి రూ.3 కోట్లు మంజూరు చేసింది. రూ.7,700 కోట్లు ఖర్చయ్యే ఈ ప్రాజెక్టును మంజూరు చేయాలి.
► రాష్ట్రంలో ఇంటింటికీ నల్లా నీరు నూటికి నూరు శాతం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం అందించాలి. దాదాపు పది లక్షల కుటుంబాలకు ఇప్పటికీ నల్లాల ద్వారా నీటి సరఫరా జరగడం లేదు. సమీపంలోని నీటి వనరుల ద్వారా గ్రామాలకు రక్షిత మంచినీటిని సరఫరా చేసేందుకు జల జీవన్ మిషన్ నిధులు కేటాయించాలి.
► ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి హైదరాబాద్ కంటోన్మెంట్ ఏరియాలో 178 ఎకరాలు, 10 టీఎంసీల కేశవాపురం రిజర్వాయర్ నిర్మాణానికి పొన్నాల గ్రామ సమీపంలోని 1,350 ఎకరాల మిలటరీ డెయిరీ ఫామ్ ల్యాండ్స్ (తోఫెఖానా) రాష్ట్రానికి బదిలీ చేయాలి. లీజు గడువు ముగిసిన శామీర్‌పేటలో ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్ భూములను (1,038 ఎకరాలు) తిరిగి అప్పగించాలి.
► నేషనల్ హెల్త్ మిషన్ కార్యక్రమం రాష్ట్రంలో విజయవంతంగా అమలు చేస్తున్నాం. 5,259 ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలను ప్రభుత్వం నిర్వహిస్తో్తంది. 2023–24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర వాటాగా రాష్ట్రానికి రావాల్సిన రూ.347.54 కోట్లను విడుదల చేయాలి.
► భారత్ మాల పరియోజన జాతీయ రహదారుల అభివృద్ధిలో భాగంగా కల్వకుర్తి–కొల్లాపూర్, గౌరెల్లి–వలిగొండ, తొర్రూర్ – నెహ్రూనగర్, నెహ్రూనగర్–కొత్తగూడెం, జగిత్యాల–కరీంనగర్ ఫోర్‌లేన్, జడ్చర్ల–మరికల్ ఫోర్‌లేన్, మరికల్ – డియసాగర్ టెండర్ల ప్రక్రియకు అనుమతులివ్వాలి.
► ఇండియా సెమీ కండకర్ల మిషన్‌లో భాగంగా తెలంగాణలో సెమీ కండక్టర్ల తయారీ పరిశ్రమల ఏర్పాటుకు కేంద్రం సహకరించాలి.
అత్యవసరంగా 29 ఐపీఎస్ పోస్టులను కేటాయించాలి
కేంద్ర హోంశాఖ 2016లో తెలంగాణకు 76 ఐపీఎస్ కేడర్ పోస్టులను మంజూరు చేసింది. ప్రస్తుతం పెరిగిన జిల్లాలు, పోలీస్ కమిషనరేట్ల సంఖ్యకు అనుగుణంగా ఐపీఎస్ క్యాడర్‌ను సమీక్షించాలి. అత్యవసరంగా 29 పోస్టులను కేటాయించాలి.
ఐఐఎం కూడా ఏర్పాటు చేయండి
ఐఐటీ, నల్సార్, సెంట్రల్ వర్సిటీతో పాటు ఎన్నో పేరొందిన పరిశోధన, ఉన్నత విద్యా సంస్థలు హైదరాబాద్‌లో ఉన్నాయి. కేంద్రం ఐఐఎంను కూడా ఏర్పాటు చేస్తే అవసరమైన స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వం కేటాయిస్తుంది.
మాకే ఓటేయండి..
మంగళవారం బేగంపేట విమానాశ్రయంలో ఓ సరదా సన్నివేశం చోటు చేసు కుంది. ప్రధాని నరేంద్ర మోదీ ఏకంగా కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయిన రేవంత్‌రెడ్డిని బీజేపీకి ఓటేయాలంటూ కోరారు. మంగళవారం ప్రధానికి వీడ్కోలు పలికే సమయంలో క్లిక్‌మనిపించిన ఈ ఫొటోలో మోదీ, రేవంత్‌రెడ్డితో పాటు మంత్రి పొన్నం, నాగర్‌కర్నూల్ ఎంపీ పి.రాములు ఉన్నారు. ఇటీవల బీజేపీలో చేరిన రాములు.. సీఎం రేవంత్ తన పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని ఓటరేనని ఈ సందర్భంగా మోదీకి చెప్పారు. అందుకు రేవంత్ కూడా అవునంటూ బదులిచ్చారు. వెంటనే స్పందించిన మోదీ ‘అయితే ఇంకేంటి.. ఈసారి మా కే ఓటేయండి..’ అంటూ సరదాగా వ్యాఖ్యానించినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలోనే మోదీ సహా ఫొటోలో కనిపిస్తున్న నేతలు ఒక్కసారిగా ఘొల్లున నవ్వారు. – సాక్షి, హైదరాబాద్
Comments
Please login to add a commentAdd a comment