ఊహా ప్రపంచాలు.. కొత్త కథలతో స్టార్‌ హీరోల ప్రయోగాలు | Stories in Imaginary Worlds: Tollywood Movies | Sakshi
Sakshi News home page

Tollywood: ఊహా ప్రపంచానికి ఊ కొడుతున్న స్టార్‌ హీరోలు

Published Wed, Jan 31 2024 4:26 AM | Last Updated on Wed, Jan 31 2024 12:48 PM

Stories in Imaginary Worlds: Tollywood Movies - Sakshi

మంచి ఊహలు ఎప్పుడూ బాగుంటాయి. నేరుగా చూడలేని ప్రపంచాలను ఊహించుకున్నప్పుడు ఓ ఆనందం దక్కుతుంది. ఇక కొత్త ప్రపంచాలను సిల్వర్‌ స్క్రీన్‌పై చూసినప్పుడు కనువిందుగా ఉంటుంది. అలా ఊహా ప్రపంచం నేపథ్యంలోని కథలకు కొందరు స్టార్స్‌ ఊ అన్నారు. కొత్త ప్రపంచంలోకి ప్రేక్షకులను రా రమ్మంటున్న ఆ చిత్రాల గురించి తెలుసుకుందాం...

పది సెట్స్‌లో విశ్వంభర 
‘జగదేకవీరుడు అతిలోక సుందరి’ (1990), ‘అంజి’ (2004) వంటివి చిరంజీవి కెరీర్‌లోని సోషియో ఫ్యాంటసీ ఫిల్మ్స్‌. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ఈ జానర్‌ను టచ్‌ చేశారు చిరంజీవి. ఈ కోవలో ‘విశ్వంభర’ అనే సినిమా చేస్తున్నారు. దర్శకుడిగా తొలి సినిమా ‘బింబిసార’ను సోషియో ఫ్యాంటసీ జానర్‌లో తీసిన వశిష్ఠ ఈ సినిమాకు దర్శకుడు. ఈ సినిమా మేజర్‌ షూటింగ్‌ అంతా ఓ కల్పిత ప్రాంతంలో జరుగుతుందట.

చిత్రీకరణకు తగ్గట్లుగా పదికి పైగా సెట్స్‌ తయారు చేయిస్తున్నారట. ఆల్రెడీ ఈ సినిమా చిత్రీకరణ మొదలైంది. ఫిబ్రవరిలో ఈ సినిమా సెట్స్‌లో జాయిన్‌ అవుతారట చిరంజీవి. ఈ చిత్రంలో హనుమంతుని భక్తుడు దొరబాబు పాత్రలో చిరంజీవి కనిపిస్తారని, త్రిష హీరోయిన్‌గా నటిస్తారనే టాక్‌ వినిపిస్తోంది. ఓ చైల్డ్‌ ఎపిసోడ్‌ కూడా ఉంటుందట. యూవీ క్రియేషన్స్‌ పతాకంపై వంశీ, ప్రమోద్, విక్రమ్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం 2025 సంక్రాంతికి విడుదల కానుంది. జనవరి 10న ఈ చిత్రం రిలీజ్‌ డేట్‌ అనే టాక్‌ ప్రచారంలోకి వచ్చింది.

కల్కి లోకం 
భారతీయ ఇతిహాసాల ఆధారంగా సైంటిఫిక్‌ అంశాల మేళవింపుతో రూపొందుతున్న సైన్స్‌ ఫిక్షన్‌ అండ్‌ ఫ్యూచరిస్ట్‌ ఫిల్మ్‌ ‘కల్కి 2898 ఏడీ’. ఈ సినిమా కథలో ఇతిహాసాల ప్రస్తావన ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి కాబట్టి ఫ్యాంటసీ ఎలిమెంట్స్‌ ఉంటాయని ఊహించవచ్చు. ఓ నాలుగు వందల సంవత్సరాల తర్వాత ఇండియా ఎలా ఉంటుందో ఈ సినిమాలో చూపిస్తాం అన్నట్లుగా ఈ చిత్రదర్శకుడు నాగ్‌ అశ్విన్‌ ఇటీవల సందర్భంలో పేర్కొన్నారు.

ప్రభాస్‌ హీరోగా దీపికా పదుకోన్‌  హీరోయిన్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో అమితాబ్‌ బచ్చన్, కమల్‌హాసన్, దిశా పటానీ కీ రోల్స్‌లో కనిపిస్తారు. అశ్వనీదత్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం మే 9న రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ సంగతి ఇలా ఉంచితే... ‘సలార్‌’ తర్వాత హీరో ప్రభాస్, దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ కాంబినేషన్‌లో ‘రావణం’ అనే మైథలాజికల్‌ ఫిల్మ్‌ రానుందని, ఈ సినిమాను ‘దిల్‌’ రాజు నిర్మిస్తారనే వార్తలు గతంలో వచ్చిన సంగతి తెలిసిందే. ఇది కూడా ఊహాజనిత ప్రపంచంలో జరిగే చిత్రం అని టాక్‌. 

ట్రాక్‌ మారింది 
‘జులాయి’, ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’, ‘అల.. వైకుంఠపురములో’... హీరో అల్లు అర్జున్‌– దర్శకుడు త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలు ఇవి. కమర్షియల్‌ అంశాలతో రూపొందిన ఈ సినిమాలు మంచి విజయాలు సాధించాయి. ఈ మూడు సినిమాల తర్వాత అల్లు అర్జున్‌–త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో నాలుగో సినిమా గురించిన ప్రకటన వెల్లడైంది. కానీ ట్రాక్‌ మారింది. రెగ్యులర్‌ కమర్షియల్‌ ఫార్మాట్‌లో ఈ చిత్రం ఉండదట. ఇది పూర్తి స్థాయి సోషియో ఫ్యాంటసీ ఫిల్మ్‌ అని, మహాభారతం రిఫరెన్స్‌ ఈ సినిమాలో ఉంటుందనే టాక్‌ తెరపైకి వచ్చింది. అల్లు అరవింద్, సూర్యదేవర రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మించనున్నారు. కాగా ఈ సినిమా ్రపారంభం కావడానికి కాస్త సమయం పట్టేలా ఉందని తెలిసింది. 

కంగువ ప్రపంచం 
‘కంగువ’ టీజర్‌ చూస్తున్నప్పుడు ఏదో కొత్త ప్రపంచంలోకి వెళ్తున్నట్లుగా ప్రేక్షకులకు అనిపిస్తుంటుంది. సూర్య హీరోగా నటించిన చిత్రం ఇది. పూర్తి స్థాయి ఫ్యాంటసీ ఫిల్మ్‌ కాకపోయినప్పటికీ ‘కంగువ’లో ఆడియన్స్‌ ఆశ్చర్యపోయే, అబ్బురపరచే విజువల్స్‌ చాలానే ఉన్నాయన్నది కోలీవుడ్‌ టాక్‌. కథ రీత్యా కాస్త సైంటిఫిక్‌ టచ్‌ ఉన్న ఈ సినిమాలో సూర్య పదికి పైగా గెటప్స్‌లో కనిపిస్తారని సమాచారం. దిశా పటానీ, బాబీ డియోల్, యోగిబాబు కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాకు శివ దర్శకుడు. కేఈ జ్ఞానవేల్‌ రాజాతో కలిసి ఈ సినిమాను యూవీ క్రియేషన్స్‌ నిర్మించింది. రెండు భాగాలుగా ఈ సినిమా విడుదల కానుందట. తొలి భాగం ఈ ఏడాదిలోనే రిలీజ్‌ కానుంది.  

కేరాఫ్‌ భైరవకోన 
గరుడ పురాణంలో మిస్‌ అయిన ఓ నాలుగు పేజీల కథే ‘భైరవకోన’ అట. మరి.. ఈ గరుడ పురాణం పూర్తి వివరాలు, ఈ నాలుగు పేజీల మిస్టరీ ఏంటో తెలుసుకోవాలంటే ఫిబ్రవరి 16న థియేటర్స్‌లో విడుదలయ్యే ‘ఊరు పేరు భైరవకోన’ సినిమా చూడాలి. సందీప్‌ కిషన్‌ హీరోగా వీఐ ఆనంద్‌ దర్శకత్వంలో రూపొందిన సోషియో ఫ్యాంటసీ అడ్వెంచరస్‌ ఫిల్మ్‌ ఇది. అనిల్‌ సుంకర సమర్పణలో రాజేశ్‌ దండా నిర్మించిన ఈ చిత్రంలో వర్షా బొల్లమ్మ, కావ్యా థాపర్‌ హీరోయిన్లుగా నటించారు. 

అఘోరా శంకర్‌ 
యంగ్‌ హీరోల్లో ఒకరైన విశ్వక్‌ సేన్‌ చేస్తున్న తాజా చిత్రాల్లో ‘గామి’ ఒకటి. ఇందులో శంకర్‌ అనే అఘోరా పాత్రలో విశ్వక్‌ కనిపిస్తారు. కథ రీత్యా శంకర్‌కు మానవ స్పర్శ తెలియదు. కానీ ఆ స్పర్శను అనుభూతి చెందాలన్నది అతని ఆకాంక్ష. ఈ క్రమంలో ఏం జరగుతుంది? అనేదే ‘గామి’ కథ అట. ఈ సినిమాలో అఘోరా ట్రాక్‌ మాత్రమే కాకుండా మరో స్టోరీ ట్రాక్‌ కూడా ఉందని చిత్ర యూనిట్‌ చెబుతోంది. భారీ స్థాయిలో వీఎఫ్‌ఎక్స్‌ వర్క్స్‌ జరుగుతున్న ఈ చిత్రాన్ని దాదాపు నాలుగు సంవత్సరాలుగా తీస్తున్నారు. ఈ  సినిమాలో ఫ్యాంటసీ ఎలిమెంట్స్‌ ఉంటాయని ఊహించవచ్చు. విద్యాధర కాగిత దర్శకత్వంలో కార్తీక్‌ శబరీష్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 

జై హనుమాన్‌ 
ఈ సంక్రాంతికి ‘హను–మాన్‌’ సూపర్‌హిట్‌. అంజనాద్రి అనే ఊహాజనితప్రాంతం నేపథ్యంలో ప్రశాంత్‌ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో తేజ సజ్జా హీరో. కె. నిరంజన్‌రెడ్డి నిర్మించారు. కాగా ‘హను–మాన్‌’ సినిమాకు సీక్వెల్‌గా ‘జై హనుమాన్‌’ తీస్తున్నారు ప్రశాంత్‌ వర్మ. స్క్రిప్ట్‌ వర్క్‌ మొదలైంది. ‘జై హను–మాన్‌’ సినిమాలో ఫ్యాంటసీ ఎలిమెంట్స్‌ ఉండేట్లు కనిపిస్తున్నాయి. ఈ సినిమాలో నటించే నటీనటులపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది.  

అఖిల్‌ నెక్ట్స్‌ సినిమా గురించిన ఓ వార్త అక్కినేని ఫ్యాన్స్‌లో ఆసక్తిని కలిగిస్తోంది. అఖిల్‌ హీరోగా యూవీ క్రియేషన్స్, హోంబలే ఫిలింస్‌ కలిసి ఓ సోషియో ఫ్యాంటసీ సినిమాను నిర్మించనున్నాయట. ప్రస్తుతం ప్రీప్రోడక్షన్‌ వర్క్స్‌ జరుగుతున్నాయని తెలిసింది. ఈ సినిమాతో అనిల్‌ అనే కొత్త దర్శకుడు పరిచయం అవుతారని భోగట్టా. ఈ మూవీపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది.

ఇలా ఫ్యాంటసీ బ్యాక్‌డ్రాప్‌లో మరికొన్ని సినిమాలు రానున్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement