
ఢిల్లీ, సాక్షి: జైలులో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నుంచి మరో సందేశం వచ్చింది. ఎప్పటిలాగే ఆయన సతీమణి సునీత కేజ్రీవాల్ ఆ సందేశాన్ని వినిపించారు. అయితే ఈ సారి ఓ ఆసక్తికర అంశం ఉంది. అదేంటంటే..
సీఎం అరవింద్ కేజ్రీవాల్ సందేశాన్ని ఆయన సతీమణి సునీత కేజ్రీవాల్ వినిపిస్తూ ఓ వీడియోను విడుదల చేశారు. ఇందులో ఆమె వెనుక గోడకు అంబేడ్కర్, భగత్ సింగ్ చిత్రపటాలతో పాటు సీఎం కేజ్రీవాల్ ఫోటో కూడా ఉంది. అయితే కటకటాల వెనుక సీఎం ఉన్నట్లు ఆ ఫొటోను ఏర్పాటు చేశారు.
"నేను జైలులో ఉండటం వల్ల ఢిల్లీ ప్రజలు ఏ విధంగానూ బాధపడకూడదు. ప్రతి ఎమ్మెల్యే ప్రతి రోజు వారి ప్రాంతానికి వెళ్లి ప్రజల సమస్యలను చర్చించి వాటిని పరిష్కరించాలి" అని కేజ్రీవాల్ తన లేఖలో పేర్కొన్నట్లు సునీత కేజ్రీవాల్ వీడియోలో చదివి వినిపించారు. "ప్రజల ప్రభుత్వపరమైన సమస్యలే కాకుండా ఇతర సమస్యలను కూడా మనం పరిష్కరించాలి. ఢిల్లీలోని రెండు కోట్ల మంది ప్రజలు నా కుటుంబం. నా వల్ల ఎవరూ బాధపడకూడదు. వారందరికీ దేవుడి ఆశీస్సులు ఉంటాయి. జై హింద్" అని కేజ్రీవాల్ అన్నట్లుగా సునీత పేర్కొన్నారు.