న్యూఢిల్లీ: ఆప్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో ఢిల్లీలోని ప్రతి కుటుంబానికి నెలకు రూ.25 వేల వరకు ఆదా అవుతోందని ఆ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. మరోసారి తమకు అధికారమిస్తే అదనంగా రూ.10 వేలు ఆదా అయ్యేలా కొత్తగా పథకాలను తీసుకువస్తామని ప్రకటించారు. శుక్రవారం ఆయన ‘బచత్ పాత్ర’ప్రచారం ప్రారంభించి మాట్లాడారు. ఆప్ ప్రభుత్వ సంక్షేమ పథకాలతో ఎంత మేరకు లబ్ధి కలుగుతుందో తెలుసుకునేందుకు తమ వలంటీర్లు ఇంటింటికీ వచ్చి ‘బచత్ పాత్ర’గురించి వివరిస్తారన్నారు.
కొత్త పథకాల్లో ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం, మహిళా సమ్మాన్ యోజన, సంజీవని యోజన వంటివి ఉన్నాయని కేజ్రీవాల్ వివరించారు. ‘సామాన్యంగా బడ్జెట్‌తో ద్రవ్యోల్బణం, సామాన్యులపై ఏ మేరకు ప్రభావం చూపుతుంది వంటి అంశాలను తెలుపుతుంది. కానీ, ఢిల్లీ ఆప్ ప్రభుత్వం సంక్షేమ పథకాలతో ప్రతి కుటుంబానికి అయ్యే ఆదాపైనే దృష్టి పెడుతుంది’అని అన్నారు. బీజేపీ ప్రభుత్వం మాత్రం సన్నిహితులైన వాణిజ్యవేత్తలకు ఎలాంటి ప్రయోజనాలను కల్పించాలని యోచిస్తోందని ఆరోపించారు. ముంబైలోని ధారావిలో మురికివాడల వాసుల భూమిని ఇప్పటికే తమ సంబంధీకులకు కట్టబెట్టిందని, ఢిల్లీలో కూడా భూముల్ని ఆక్రమించుకోవాలని లక్ష్యంగా పెట్టుకుందని విమర్శించారు.
70లో 60 సీట్లు మావే: ఆప్ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని ఆ పార్టీ చీఫ్ కేజ్రీవాల్ ధీమా వ్యక్తం చేశారు. వచ్చే 5న జరిగే ఎన్నికల్లో
అసెంబ్లీలోని 70 స్థానాలకు 60 సీట్లను చేజిక్కించుకుంటుందని ఆయన చెప్పారు. బీజేపీ ఇప్పటికే ఓటమిని అంగీకరించిందని వ్యాఖ్యానించారు. ఢిల్లీలోని లక్ష్మీనగర్‌లో జరిగిన జనసభలో ఆయన మాట్లాడారు.
Comments
Please login to add a commentAdd a comment