నగరంలో పెరుగుతున్న పావురాలతో వ్యాధుల ముప్పు..! | Infections With Pigeons in Hyderabad | Sakshi
Sakshi News home page

రోగాల రాయబారులు

Published Fri, Oct 11 2019 12:34 PM | Last Updated on Mon, Oct 14 2019 11:12 AM

Infections With Pigeons in Hyderabad - Sakshi

సాక్షి,సిటీబ్యూరో: శాంతికి చిహ్నమై..భాగ్యనగర సంస్కృతిలో భాగమైన కపోతాలు... ప్రజారోగ్యానికి ప్రాణాంతకంగా పరిణమిస్తున్నాయా..? ఆహ్లాదం కోసమో లేక పుణ్యం వస్తుందన్న విశ్వాసంతో నగరవాసులు పెంచుకునే పావురాలు జనానికి తీవ్రమైన శ్వాసకోస వ్యాధులను వ్యాపింపజేస్తున్నాయా..? ప్రస్తుతం కేరళను వణికిస్తున్న ప్రాణాంతక ‘నిఫా’ వైరస్‌ తరహా ఉపద్రవం భవిష్యత్తులో పావురాల వల్ల వచ్చే ప్రమాదం పొంచి ఉందా...? ఈ ప్రశ్నలన్నింటికీ అవుననే సమాధానమిస్తున్నారు వైద్యనిపుణులు, పరిశోధకులు. పావురాల సంఖ్య పెరిగితే భవిష్యత్‌లో రాజధాని గ్రేటర్‌ హైదరాబాద్‌ రోగాల అడ్డాగా మారడం తథ్యమని హెచ్చరిస్తున్నారు. పావురాల విసర్జితాలతో తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థతోపాటు అమెరికా విడుదల చేసిన తాజా అధ్యయన నివేదిక హెచ్చరించిందని సెలవిస్తున్నారు. పావురాల విసర్జితాల నుంచి ఇన్‌ఫెక్షన్లు, వైరస్‌లు వ్యాప్తి చెందుతున్నాయని, వాటి వల్ల డజనుకుపైగా అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని తాజా అధ్యయన నివేదిక హెచ్చరిస్తోంది. ఈ ఇన్‌ఫెక్షన్లతో చర్మం, నోరు, ఊపిరితిత్తులు, ఉదరకోశం దెబ్బతింటున్నాయని స్పష్టం చేస్తున్నారు. 

ఏటా పెరుగుతున్న పావురాల సంఖ్య ...
గ్రేటర్‌ హైదరాబాద్‌లో పావురాల సంఖ్యను కచ్చితంగా ఎంత ఉందో ప్రభుత్వం వద్ద ఎలాంటి సమాచారం లేనప్పటికీ దాదాపు 6 లక్షలకు పైగా ఉండొచ్చని నిపుణుల అంచనా. పావురాలతో ఎదురయ్యే ప్రమాదాలపై ప్రాఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం పక్షి శాస్త్ర విభాగాధిపతి డాక్టర్‌ వాసుదేవరావు బృందం హైదరాబాద్‌లో తొలిసారి అధ్యయనం చేపట్టింది. నగరంలో శరవేగంగా పెరుగుతున్న పావురాలను కట్టడి చేసేందుకు చర్యలు ప్రారంభించకపోతే త్వరలోనే ప్రజలు తీవ్రమైన శ్వాస సంబంధ వ్యాధుల బారినపడే ప్రమాదం ఉందని వాసుదేవరావు హెచ్చరిస్తున్నారు. దాదాపు మూడేళ్లుగా ఆయన ఆధ్వర్యంలోని బృందం అధ్యయనం చేస్తోంది. ఈ అధ్యయనంలోని ప్రాథమిక అంశాలను 2017లో ‘సాక్షి’ తొలిసారి ప్రజల ముందుకు తెస్తోంది. గత రెండేళ్లలో పావురాల సంఖ్య లక్ష వరకు పెరిగిందని, వాటి సంఖ్యను వెంటనే నియంత్రించేందుకు ప్రజలను చైతన్యం చేయాల్సిన అవసరం ఉందని వాసుదేవరావు సూచిస్తున్నారు. లేనిపక్షవలో నిఫా వైరస్‌ కలకలంతో కేరళవాసులు ఎలా భయపడుతున్నారో హైదరాబాద్‌వాసులు సైతం పావురాలను చూసి వణికిపోవాల్సిన పరిస్థితి రావొచ్చని ఆయన హెచ్చరిస్తున్నారు. వీలైనంత త్వరలో తమ అధ్యయనాన్ని ముగించి ప్రభుత్వానికి నివేదిక అందించనున్నట్లు తెలిపారు. అధ్యయనం తుది అంకంలో ఆయన వైద్య ఆరోగ్యశాఖ సాయంతో ప్రత్యేక వివరాలను సేకరించనున్నారు.

ప్రాణహాని ఇలా...  
పావురాల విసర్జితాలు ఎండిపోయి పొడిలామారి గాలిలో చేరుతున్నాయి. పావురాల రెక్కల ద్వారా కూడా ఇవి వేగంగా వ్యాపిస్తున్నాయి. వాటిని ఎక్కువగా పీల్చే వారు శ్వాస సంబంధ వ్యాధులకు గురవుతున్నారు. దీనిని సాధారణ సమస్యగా నిర్లక్ష్యం చేస్తే క్రమంగా మగతగా అనిపించడం, తలనొప్పి రావడం, కొద్దిరోజులకే అది పక్షవాతానికి దారితీసి, చివరకు మృత్యువుకు కారణమవుతుందని  నివేదికలు పేర్కొంటున్నాయి. ఇప్పుడు హైదరాబాద్‌లోని ఆసుపత్రుల్లో ఈ తరహా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని వాసుదేవరావు పేర్కొన్నారు. అయితే అందుకు పావురాలు కారణమన్న విషయాన్ని ప్రజలు ఇంకా గుర్తించడం లేదన్నారు. నగరంలో మరో రెండు, మూడేళ్లలో పావురాల సంఖ్య 10 లక్షలు దాటే పరిస్థితి ఉన్నందున ఇప్పుడు మేల్కొనకుంటే నగరం రోగాల అడ్డాగా మారే  ప్రమాదం పొంచి ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇవీ వాస్తవాలు...
శ్వాస సంబంధ వ్యాధులతో ఆస్పత్రులపాలయ్యే రోగుల్లో సగం మందికి ఆ సమస్యలు రావడానికి పావురాలు కారణమవుతున్నట్లు గతంలో ఢిల్లీలో గుర్తించారు.
హైదరాబాద్‌ నగరంలో రెండేళ్ల క్రితం పావురాలకు బహిరంగంగా దాణా వేసే ప్రాంతాలు 490 ఉండగా ఇప్పు డు వాటి సంఖ్య 560కి చేరుకుంది.
భారీ అపార్ట్‌మెంట్లు, గేటెడ్‌ కమ్యూనిటీ నిర్మాణదారులు కొనుగోలుదారులను ఆకట్టుకునేందుకు పావురాలకు దాణా వేసే ప్రదేశాలను ఏర్పాటు చేస్తున్నారు. పావురాలకు దాణా వేస్తే పుణ్యం వస్తుందన్న ఉద్దేశంతో చాలా మంది ప్రజలు వాటికి ఆహారం అందిస్తున్నారు.

విదేశాల్లో నిషేధం...  
సెంట్రల్‌ లండన్‌లో పావురాలకు బహిరంగ ప్రదేశాల్లో దాణా వేయడాన్ని నిషేధించారు. 2003లోనే అక్కడి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే సెంట్రల్‌ లండన్‌ పరిధిలోకి వచ్చే కొన్ని ప్రాంతాల్లో బహిరంగ ప్రదేశాల్లో దాణా వేస్తున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ గుర్తించి తాజాగా ఆయా ప్రాంతాల్లో నిషేధాన్ని విధించడంతోపాటు నియంత్రణ చర్యల అమలు చేస్తోంది.  ఎవరైనా ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పావురాలకు దాణా వేస్తే 500 పౌండ్ల జరిమానా విధించనున్నట్లు హెచ్చరించింది. సింగపూర్‌ తదితర నగరాల్లోనూ జరిమానాలు, హెచ్చరికలతో ప్రజలను కట్టడి చేస్తున్నారు. దాణా వేస్తున్నందునే పావురాల సంఖ్య భారీగా పెరిగి ప్రజారోగ్యం దెబ్బతింటోందని గుర్తించిన పలు అభివృద్ధి చెందిన దేశాలు సైతం తమ ప్రధాన నగరాల్లోని బహిరంగ ప్రదేశాల్లో పావురాలకు దాణా వేయడంపై నిషేధం విధిస్తున్నాయి. కానీ హైదరాబాద్‌లో మాత్రం పావురాలకు విచ్చలవిడిగా దాణా వేస్తున్నా పట్టించుకునే వారు కరువయ్యారని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement