ప్రతీకాత్మక చిత్రం
పిల్లలు పుట్టని ఆపరేషన్ అనగానే మన దేశంలో గుర్తొచ్చేది స్త్రీలే. మొదటి కాన్పులోనో రెండో కాన్పులోనో ఆపరేషన్ ప్లాన్ చేసే భర్తలు ఉంటారు భార్యకు. ‘మీరు చేయించుకోండ’ని భార్య అనలేని పరిస్థితి ఇంకా దేశంలో ఉంది. ‘జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే’ (2019–2021) నివేదిక ప్రకారం వందమంది వివాహితలలో 38 మంది ఆపరేషన్ చేయించుకుంటున్నారు.
పురుషులలో నూటికి ముగ్గురే వేసెక్టమీకి వెళుతున్నారు. కుటుంబ నియంత్రణకు సంబంధించి స్త్రీలు ఎదుర్కొంటున్న ఒత్తిడిని ఈ సర్వే మరోసారి విశదపరిచింది. ఇవాళ దేశంలోని 15–49 వయసు మధ్య ఉన్న వివాహితులలో 99 శాతం మందికి కుటుంబ నియంత్రణకు సంబంధించిన ఏదో ఒక పద్ధతి గురించి తెలుసనేది ఒక అంచనా.
అయినప్పటికీ తాత్కాలిక నియంత్రణ కాకుండా శాశ్వత నియంత్రణ విషయానికి వచ్చేసరికి మన దేశంలో ఆ బాధ్యత స్త్రీదేనన్న అవగాహన స్థిరపడిపోయింది. ‘ఫెడరేషన్ ఆఫ్ గైనకలాజికల్ సొసైటీస్ ఆఫ్ ఇండియా’ అధ్యయనంగానీ తాజాగా వెలువడ్డ ‘జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే’ (2019–2021)గాని ఇదే విషయాన్ని చెబుతున్నాయి. దేశంలోని మగవారు ‘వేసెక్టమీ’ పట్ల చాలా వైముఖ్యంగానే ఉన్నట్టు ఈ నివేదిక చెబుతోంది.
ప్రచారం వల్ల
కుటుంబ నియంత్రణ గురించి ప్రభుత్వంగాని, స్వచ్ఛంద సంస్థలుగాని చేసే ప్రచారం ఎప్పుడూ స్త్రీ కేంద్రితంగానే ఉంటుంది. ఆపరేషన్ గురించి, పిల్స్ గురించి, లేదా స్త్రీకి అమర్చే గర్భనిరోధక సాధనాల గురించి ఎక్కువ ప్రచారం ఉంటుంది.
పెళ్లయి సంతానం పుట్టడం మొదలయ్యాక ఏ కాన్పులో ఆపరేషన్ చేయించాలో భర్తో అత్తామామలో నిర్ణయిస్తూ ఉంటారు. భార్యకు కూడా కుటుంబ నియంత్రణ సమ్మతమే అయినా ఆపరేషన్ భర్తకు జరగడం గురించి ఆమె అభిప్రాయం చెప్పే స్వేచ్ఛ ఉండదు.
అసలు ఆ ఆలోచనే లేని స్త్రీలు చాలామంది ఉన్నారు. ‘వేసెక్టమీ చేయించుకుంటే పురుషుడిలో లైంగిక శక్తి బలహీన పడుతుందని... మునుపటి ఉత్సాహం ఉండదని... శారీరక కష్టం చేసే వృత్తులలో ఉన్నవారైతే బరువులెత్తలేరని ఇలాంటి అపోహలు ఉన్నాయి.
ఈ అపోహలు దూరం చేయాల్సిన పని తగినంతగా జరగడం లేదు. పురుషులతోపాటు స్త్రీలు కూడా వీటిని నమ్మడం వల్ల ఇంటికి సంపాదించుకుని తేవాల్సిన మగవాడు ఎక్కడ బలహీన పడతాడోనని తామే ఆపరేషన్లకు సిద్ధం అవుతున్నారు’అంటున్నారు (గైనకలాజికల్) ఫెడరేషన్ అధ్యక్షురాలు డాక్టర్ శాంత కుమారి. ‘నిజానికి స్త్రీల ఆపరేషన్ కన్నా పురుషులు చేయించుకునే వేసెక్టమీ సులువైనవి, సురక్షితమైనది’ అంటారు ఆమె. కాని వేసెక్టమీ వైపు చూసే పురుషులు లేరు.
పిల్స్ వత్తిడి
శాశ్వత నియంత్రణకు వెళ్లే ముందు సంతానానికి సంతానానికి మధ్య తాత్కాలిక నియంత్రణ విషయంలో కూడా స్త్రీల మీదే ఒత్తిడి ఉంటోంది. మన దేశంలో కేవలం 10 శాతం మంది పురుషులే కండోమ్స్ వాడటానికి ఇష్టపడుతున్నారు. 90 శాతం మంది స్త్రీలు పిల్స్ వాడటం గురించి, గర్భనిరోధక సాధనాలు అమర్చుకోవడం గురించి ‘ప్రోత్సహిస్తున్నారు’.
దీర్ఘకాలం పిల్స్ వాడటం వల్ల స్త్రీల ఆరోగ్యంపై ప్రభావం పడుతుందని తెలిసినా. ‘పల్లెల్లో పురుషులు లైంగిక విషయాల గురించి బహిరంగంగా మాట్లాడటానికి ఇష్టపడరు. ఆరోగ్య కార్యకర్తలు స్త్రీలే కావడం వల్ల వీరి మాటామంతి స్త్రీలతోనే సాగుతోంది. పురుషులను ఆరోగ్య కార్యకర్తలుగా నియమించి మగవారిలో కుటుంబ నియంత్ర ఆపరేషన్‌ల పట్ల ప్రచారం కలిగిస్తే మార్పు రావడం సాధ్యం’ అని సర్వేలో పాలుపంచుకున్న నిపుణులు అంటున్నారు.
కుటుంబ బాధ్యత స్త్రీ పురుషులదైనప్పుడు కుటుంబ నియంత్రణ బాధ్యత స్త్రీ పురుషులదే. కాని అది స్త్రీదిగానే ఎంచేంత కాలం స్త్రీకి ఈ భారం తప్పదు. పురుషులు మేల్కోవాలి.
3 శాతమే పురుషులు
2019–2021 కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం వంద మంది వివాహితలలో 38.9 శాతం మంది ట్యూబెక్టమీ చేయించుకుంటున్నారు. గత సర్వేతో పోలిస్తే ఇది రెండు శాతం ఎక్కువ. కాని ఆశ్చర్యకరమైన పరిశీలన ఏమిటంటే గత సర్వేలోనూ ఈ సర్వేలోనూ కేవలం 3 శాతానికే పురుషుల శాతం వేసెక్టమీకి పరిమితమైంది. అంటే పురుషులు ఇది ఏ మాత్రం తమకు సంబంధించిన వ్యవహారంగా చూడటం లేదు.
ఈ సర్వేలో భాగంగా అడిగిన ప్రశ్నకు ఉత్తర ప్రదేశ్, బిహార్, తెలంగాణ రాష్ట్రాలలో 50 శాతం మంది మగవారు ‘అది ఆడవాళ్లు చేయించుకోవాల్సిన ఆపరేషన్’గా జవాబు ఇస్తే మధ్యప్రదేశ్‌లో ప్రతి ముగ్గురు పురుషుల్లో ఒకరు ‘కుటుంబ నియంత్రణ ఆడవాళ్లదే’ అన్నారు.
చదవండి: Normal Delivery: నార్మల్ డెలివరీ టిప్స్!
Comments
Please login to add a commentAdd a comment