state population
-
సంతాన సాఫల్య తంత్రం
చైనాకు మించిన జనసంఖ్యతో భారత దేశం పేదరికానికి పెద్ద పీటగా మారినందుకు బాధపడుతున్న సమయంలో మాన్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారు మరింత మందిని కనండని ప్రజలకు పిలుపునివ్వడం కలయా, వైష్ణవ మాయయా అనిపిస్తున్నది. గతంలో ఒకసారి అస్పష్టంగా ఈ ప్రకటన చేసిన చంద్రబాబు ఇప్పుడు దీనికొక ప్రణాళికను జోడించారు. ఇద్దరికంటే ఎక్కువ సంతానం గలవారికే స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పిస్తామని చెప్పారు. ఆ మేరకు చట్టం చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు వెల్లడి అవుతున్నది. తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ కూడా ఎక్కువమందిని కనాలేమో అన్నారు గానీ ఈ ఇద్దరు సీఎంల ఆలోచనల్లో స్పష్టమైన తేడా ఉంది.ముందు ముందు దేశ జనాభాలో యువత శాతం తగ్గిపోయి ముసలివారు అధికమవుతారని, ఆ ప్రమాదాన్ని తొలగించడానికి ఎక్కువ మంది పిల్లలను కనాలని చంద్రబాబు అంటున్నారు. మేమిద్దరం, మాకు ఇద్దరు అనే నినాదాన్ని ఆచరణలో పెట్టి కుటుంబ నియంత్రణను గట్టిగా పాటించినందువల్ల దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా పరిమిత మయిందని, అందువల్ల 2026 తర్వాత జరిగే నియోజకవర్గాల పునర్విభజనలో పార్లమెంటులో మన స్థానాలు తగ్గిపోతాయని,కేంద్రం నుంచి వచ్చే నిధులు కూడా మరింతగా కుంచించుకు పోతున్నాయనే కారణాల మీద ఎక్కువమంది బిడ్డలను కనాలే మోనని స్టాలిన్ అన్నారు. ఇందుకు తమిళనాట దీవెనగా ఉన్న 16 రకాల భాగ్యాల ప్రస్తావన తెచ్చి ఒక్కొక్కరూ అంతమందిని కనవలసి వస్తుందేమోనని ఆయన అభిప్రాయపడ్డారు. చంద్రబాబు ఈ విషయంలో వల్లమాలిన ఆత్రం ప్రదర్శించడం మాత్రం ఆశ్చర్యం కలిగిస్తున్నది.కుటుంబ నియంత్రణను జాతీయ విధానంగా చేపట్టి 1950 లోనే అమలు ప్రారంభించిన దేశం ఇండియా. అయినా జనాభాలో ప్రథమ స్థానంలో ఉంటూ వచ్చిన చైనాను ఈ మధ్యనే దాటి పోయాము. ప్రస్తుతం భారత జనాభా 145 కోట్లమంది. ఇందులో 25 సంవత్సరాల లోపు వయసువారు 40 శాతం మంది. 40 ఏళ్ల లోపు జనం 74 శాతం. ఈ పరిస్థితి 2061 వరకు కొనసాగుతుందని నిపుణులు చెబుతున్నారు. పనిచేసే వయసులోని జనం ఇంత ఎక్కు వగా ఉండటం ఒక వరం. వీరందరికీ పని కల్పించగలిగితే సంపద పెరిగి ఇండియా త్వరితంగా అభివృద్ధి చెందిన దేశం కాగలుగుతుంది. కానీ పాలకులు ఇందులో ఘోరంగా విఫలమవుతున్నారు. కుటుంబ నియంత్రణ పాటింపువల్ల జనాభా తగ్గిపోవడం, ఉత్తరాదికంటే అధిక తలసరి ఆదాయం కలిగి ఉండటం దక్షిణాది రాష్ట్రాలకు పెనుశాపమయ్యింది. అయిదు దక్షిణాది రాష్ట్రాల (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ ) ఉమ్మడి జనాభా 24 కోట్లు. ఒక్క ఉత్తరప్రదేశ్ జనాభాయే ఇప్పుడు దాదాపు 25 కోట్లని అంచనా. 2026 తర్వాత జరిగే నియోజక వర్గాల పునర్వి భజనలో అప్పటికి ఉండే జనాభా ప్రకారం దక్షిణాది రాష్ట్రాలు ఇప్పుడున్న వాటిలో 20 పార్లమెంటు స్థానాలు కోల్పోవచ్చు; ఉత్త రాది రాష్ట్రాలు అదనంగా 31 స్థానాలు పొందవచ్చు. ఒక్క ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికే 11 పార్లమెంటు స్థానాలు వచ్చి చేరుతాయని అంచనా. దాంతో ఇపుడున్న 80 స్థానాలు 91కి పెరుగుతాయి. తమిళనాడు 8 స్థానాలను కోల్పోవచ్చు. ప్రస్తుతం దానికున్న 39 స్థానాలు 31కి కుదించుకుపోతాయి. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌లో ఉండిన 42 పార్లమెంటు స్థానాలు 34కి తగ్గిపోతాయంటున్నారు. బిహార్ పది, రాజస్థాన్ ఆరు స్థానాలను, మధ్య ప్రదేశ్ నాలుగింటిని, గుజరాత్, హరియాణా, జార్ఖండ్, ఢిల్లీ, చత్తీస్‌గఢ్ ఒక్కో పార్లమెంటు స్థానాన్ని అదనంగా పొందవచ్చని భావిస్తున్నారు. పునర్విభజన వాయిదా ఒక పరిష్కారంఈ మార్పు కారణంగా కేంద్ర పాలకులు ఎన్నికల్లో అధిక స్థానాలను గెలుచుకోవడానికి దక్షిణాది రాష్ట్రాలను నిర్లక్ష్యం చేసి నిధులను ఉత్తరాది రాష్ట్రాలకే మరింత ఎక్కువగా కేటాయిస్తారు. పర్యవసానంగా దక్షిణాది ఇంతవరకు సాధించిన అభివృద్ధిని కోల్పోయే ప్రమాదం పొంచి ఉన్నది. జనాభా నియంత్రణను చిత్త శుద్ధితో పాటించినందువల్ల ఇలా నష్టపోవలసి వస్తున్నది కాబట్టి ఎక్కువమందిని కనక తప్పదా అని తమిళనాడు ముఖ్యమంత్రి అన్నారు. ఈ సమస్యకు పరిష్కారాలు లేకపోలేదు. లోక్‌సభ సభ్యుల సంఖ్య ఇప్పుడు 543. ఇది 1971 జనాభా లెక్కల ప్రకారం నిర్ణయించినది. కుటుంబ నియంత్రణ పాటింపు దెబ్బ తినకుండా చూసుకొనేందుకు, దానిని ప్రోత్సాహించడం కోసం ఈ సంఖ్యను 30 ఏళ్ల పాటు యధాతథంగా కొనసాగించాలని భావించి 42వ రాజ్యాంగ సవరణ తెచ్చారు. అలా ఆ సంఖ్యను అక్కడే ఆపి ఉంచారు. ఈ నియోజకవర్గాల పునర్విభజనను 2026 తర్వాత జరిగే జనాభా లెక్కల అనంతర కాలానికి వాయిదా వేస్తూ 2000 సంవత్సరంలో మళ్ళీ నిర్ణయం తీసుకొన్నారు. అదే విధంగా మరి కొన్ని సంవత్సరాలపాటు యధాతథ స్థితిని కొనసాగిస్తూ 2026లో ఏర్పాటు చేసుకోవచ్చు. లేదా జనసంఖ్యను బట్టి ప్రజా ప్రాతినిధ్య నియోజకవర్గాల పునర్విభజనను పార్లమెంటుకు బదులు రాష్ట్రాల శాసనసభలకు బదలాయించవచ్చు. కొంపలేం మునగవు. లోక్‌సభ స్థానాలను కాపాడుకోవడం కోసం, వాటిని పెంచు కోవడానికి ఎక్కువ మందిని కనాలనడం ఎంతమాత్రం హర్షించ వలసినది కాదు. అసలే వనరులు తక్కువగా ఉన్న దేశంలో జనాభాను పెంచుకోడం ఆత్మహత్యా సదృశమే. దేశ జనాభాలో 60 శాతం మంది సగటున రోజుకి 250 రూపాయలతో జీవిస్తున్నారు. జీవన హక్కు అంటే అన్ని సౌకర్యాలతో గౌరవప్రదంగా బతికే హక్కు అని సుప్రీంకోర్టు స్పష్టంగా నిర్వచించింది. దేశంలో 50 శాతానికి మించిన జనాభా కనీస సౌకర్యాలకు దూరంగా బతుకుతున్నారు. ఇటువంటి నేపథ్యంలో ఇద్దరు కంటే ఎక్కువమందిని కనాలని చంద్ర బాబునాయుడు అనడం పరమ హాస్యాస్పదంగా ఉన్నది. పరిమిత సంతానమే మేలుఏ రోజు పని ఉంటుందో ఏ రోజు ఉండదో తెలియని స్థితిలోని ప్రజలను, అందీ అందని ప్రభుత్వ సంక్షేమ పథకాల కోసం అర్రులు చాచేవారిని కనండి కనండి అంటూ అదిలించడం మానవీయం కాదు. దేశంలో ఐదేళ్ల లోపు బాలల్లో 44 శాతం మంది వయసుకు తగిన బరువు లేమితో బాధపడుతున్నారు. బాలల్లో 72 శాతం మంది, వివాహిత మహిళల్లో 52 శాతం మంది రక్త హీనతతో తీసుకుంటున్నారు. గర్భవతులకు పోషకాహారం లోపిస్తే పుట్టే పిల్లలు రోగాల బారిన పడతారు. 2013 నుంచి స్థూల దేశీయ ఉత్పత్తి 50 శాతం పెరిగినప్పటికీ ప్రపంచమంతటిలో గల పోషకాహార లోపమున్న పిల్లల్లో మూడింట ఒక పాలు కంటే ఎక్కువ మంది ఇండియాలోనే ఉన్నారనీ, ఇందుకు విపరీతమైన ఆర్థిక వ్యత్యాసాలే కారణమనీ నిపుణులు నిగ్గు తేల్చారు. శారీరకంగా చితికిపోయినా ఉదయం నుంచి సాయంత్రం వరకు గుక్కెడు గంజి కోసం రెక్కలు ముక్కలు చేసుకుంటున్న అత్యధిక శాతం మహిళలు ఎక్కువ మంది బిడ్డలను కనడమంటే చావుకి త్వరితంగా దగ్గరవ్వడమే. పిల్లలు లేనివారికీ ఇద్దరే బిడ్డలు కలవారికీ స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే అర్హత లేకుండా చేయడం ప్రజాస్వామ్య పునాదులను బలహీనపరచడమే. పరిమిత సంతాన సూత్రం ప్రజలకు మంచి చేసింది. బతుకు భారాన్ని తగ్గించి ఎండిన పెదాలను తడిపింది. దక్షిణాది సాధించుకున్న ఈ సౌభాగ్యాన్ని నాశనం చేయా లనే దుర్బుద్ధి హానికరం. ఒకవైపు పిల్లల విద్యను, వైద్యాన్ని నానాటికీ ప్రియం చేస్తూ ఇంకా ప్రసవించండని అనడం దుర్మార్గమే. చంద్ర బాబునాయుడుకి ఈ ఆలోచన ఎందుకు కలిగిందో గాని అది ప్రజలపట్ల ద్రోహ చింతనే. ఈ దురాలోచనను ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి మానుకోవడం మంచి చేస్తుంది. ఎప్పుడో వచ్చే విపత్తు కోసం ఇప్పుడే శోక గంగలో దూకమనడం విజనూ కాదు, విజ్ఞతా అనిపించుకోదు.జి. శ్రీరామమూర్తి వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
సోలో బ్రతుకే సో 'బెటరు'
ప్రపంచవ్యాప్తంగా ఏక్ నిరంజన్ల సంఖ్య ఏటా పెరుగుతోంది. మన రాష్ట్రంలోనూ ఇదే ట్రెండ్ కనిపిస్తోంది. రాష్ట్ర జనాభాలో 6 శాతానికి పైగా ఒంటరులే ఉన్నట్టు తేలింది. రాష్ట్రంలో మొత్తంగా 31,20,499 మంది ఒంటరి జీవితం సాగిస్తున్నట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2019లో వలంటీర్ల ద్వారా నిర్వహించిన కుటుంబ సర్వేలో రాష్ట్రంలో 1.66 కోట్ల కుటుంబాలు ఉన్నట్టు నిర్ధారణ కాగా.. అందులో 31.20 లక్షల మంది ఏక్ నిరంజన్లేనని తేలింది. సాక్షి, అమరావతి: తాత నాయనమ్మ.. అమ్మానాన్న.. అన్నా చెల్లెళ్లు.. బాబాయ్ చిన్నమ్మ కలిసి ఉండే ఉమ్మడి కుటుంబాలకు సుమారు 30–35 ఏళ్ల క్రితమే కాలం చెల్లింది. అమ్మానాన్న.. అన్నదమ్ములు.. అక్క చెల్లెమ్మలు వరకే పరిమితమైన కుటుంబాలకు పూర్తిగా అలవాటు పడిపోయాం. వాళ్లలో ఎవరికైనా పెళ్లయిందంటే.. వెంటనే వేరు కాపురం పెట్టే పరిస్థితికి వచ్చేశాం. ఇప్పుడు ఆ రోజులు కూడా మారిపోతున్నాయి. ప్రస్తుతం ఒంటరిగా నివాసం ఉండాలనుకునే వారి సంఖ్య పెరుగుతోంది. ఆడ, మగ అనే తేడా లేకుండా కొందరు పెళ్లి చేసుకోకుండా ఒంటరి జీవనం సాగిస్తుంటే.. భార్య లేదా భర్తను కోల్పోయి ఒంటరిగా మిగిలిపోతున్నారు.. కొందరైతే పిల్లలున్నా విదేశాలు లేదా దూరప్రాంతాల్లో ఉండటం వల్ల ఒంటరి జీవనం సాగిస్తున్నారు. అమెరికాలో సగం మందికి పైనే ఒంటరి జీవులు వ్యక్తిగత ఆదాయాల పరంగా.. దేశ ఆర్థిక పరిస్థితి పరంగా ప్రపంచంలోనే అత్యంత సంపన్న దేశంగా వెలుగొందుతున్న అమెరికాలో అయితే 18 ఏళ్లు వయసు దాటిన వారిలో ఎక్కువ మంది ఒంటరి జీవులుగానే మిగిలిపోతున్నట్టు తేలింది. తల్లిదండ్రులతో కలిసి జీవించే వారికంటే తల్లిదండ్రులు లేదా ఇతరులెవరితో సంబంధం లేకుండా జీవనం సాగించే వారి సంఖ్య ఆ దేశంలో ఎక్కువగా ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఆ దేశ 2021 నాటి జనాభా గణాంక అంచనాల ప్రకారం 3.39 కోట్ల మంది తల్లిదండ్రులతోనో లేదంటే ఇతరులతో కలిసి జీవిస్తుంటే.. 3.75 కోట్ల మంది ఒంటరిగా జీవనం సాగిస్తున్నారు. 1965లో అమెరికాలో 15 శాతం మంది మాత్రమే 18 ఏళ్ల తర్వాత తల్లిదండ్రులతో సంబంధం లేకుండా ఒంటరిగా జీవనం సాగించే పరిస్థితి ఉండగా.. ఆ తర్వాత కాలంలో ఏటా ఆ సంఖ్య పెరుగుతూ వచ్చింది. 2013–16 మధ్యకాలంలో తల్లిదండ్రులతో కలిసి జీవించే వారి కంటే ఒంటరి జీవనం సాగించే వారే ఎక్కువ అయ్యారని గణాంకాలు పేర్కొంటున్నాయి. రాష్ట్రంలో 6 శాతానికి పైగా ఒంటరులే మన రాష్ట్రంలో 31,20,499 మంది ఒంటరిగా జీవనం సాగిస్తున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. 2019లో రాష్ట్ర ప్రభుత్వం వలంటీర్ల ద్వారా నిర్వహించిన కుటుంబాల సర్వేలో రాష్ట్రంలో 1.66 కోట్ల కుటుంబాలు ఉన్నట్టు నిర్ధారణ అయింది. అందులో 31.20 లక్షల మంది ఒకే వ్యక్తి ఒక కుటుంబంగా ఉంటూ ఒంటరి జీవితం సాగిస్తున్నట్టు తేలింది. రాష్ట్రంలో 5.21 కోట్ల జనాభా ఉంటుందని అంచనా వేయగా.. వారిలో ఒంటరి జీవనం సాగించే వారి సంఖ్య 6 శాతానికి పైగా ఉన్నట్టు స్పష్టమవుతోంది. -
ఏపీలో మరో 13 స్మార్ట్ సిటీల అభివృద్ధిపై దృష్టి
సాక్షి, అమరావతి: కేంద్ర ప్రభుత్వం చేపట్టిన స్మార్ట్ సిటీ కార్యక్రమానికి అనుబంధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా మరిన్ని స్మార్ట్ సిటీలను అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం శ్రీకాకుళం, విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, మచిలీపట్నం గుంటూరు, ఒంగోలు, కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు, నెల్లూరులతో కలిపి మొత్తం 13 పట్టణాలను ఎంపిక చేసుకుంది. వచ్చే పదేళ్లలో ఈ పట్టణాలను స్మార్ట్ సిటీలుగా మార్చాలని నిర్ణయించింది. మొదటి దశలో ఆరు పట్టణాలను అభివృద్ధి చేయనుంది. ఇందు కోసం సుమారుగా రూ. 5,183 కోట్లు అవసరమవుతాయని అంచనా వేసింది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే విశాఖ, కాకినాడ, అమరావతి, తిరుపతిలను స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో చేర్చి అభివృద్ధి చేస్తున్న సంగతి తెలిసిందే. మొత్తంగా రాష్ట్రంలో 17 పట్టణాలు స్మార్ట్‌గా మారనున్నాయి. మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి.. రాష్ట్రంలో పెరుగుతున్న పట్టణ జనాభాకు అనుగుణంగా మౌలిక వసతుల కల్పనపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. ప్రస్తుతం రాష్ట్ర జనాభాలో 30 శాతం పట్టణాల్లో నివసిస్తుండగా పదేళ్లలో ఇది 50 శాతానికి చేరుకుంటుందని అంచనా వేస్తోంది. దీనికి అనుగుణంగా పట్టణాల్లో మౌలిక వసతుల కల్పనకు వచ్చే పదేళ్లలో రూ. 3.55 లక్షల కోట్లు అవసరమవుతాయని ప్రాథమికంగా అంచనా వేసింది. ఇందులో ఒక్క పట్టణ రవాణా రంగంలోనే రూ. 89,034 కోట్లు అవసరమవుతాయని లెక్కకట్టింది. విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా ఈ ప్రాజెక్టులను చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. మెట్రో రైలు, రహదారులు, పోర్టుల అభివృద్ధి వంటి రంగాల్లో బీవోటీ, పీపీపీ విధానాల్లో విదేశీ పెట్టుబడులకు ఆహా్వనం పలుకుతోంది. ఈ మధ్య రాష్ట్ర పర్యటనకు వచి్చన కొరియా, ఫ్రాన్స్ పారిశ్రామికవేత్తల బృందాలకు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి, ఉన్నతాధికారులు మౌలిక వసతుల కల్పనలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించారు. విశాఖ మెట్రో రైలు, బకింగ్‌హాం కెనాల్ పునరుద్ధరణ, అభివృద్ధి, వ్యర్థాల నిర్వహణలో పెట్టుబడులు పెట్టడానికి ఈ రెండు దేశాల ప్రతినిధులు ఆసక్తి వ్యక్తం చేశారు. వచ్చే పదేళ్లలో రాష్ట్ర జీడీపీలో 75 శాతం పట్టణాల నుంచే వస్తుందని అంచనా వేస్తున్నట్లు బుగ్గన పేర్కొంటున్నారు. స్మార్ట్ సిటీల అభివృద్ధి ఇలా... 1రాష్ట్రం మొదటి దశలో చేపట్టేవి శ్రీకాకుళం, ఏలూరు, ఒంగోలు, కర్నూలు, అనంతపురం, నెల్లూరు 2రెండో దశలో చేపట్టేవి విజయనగరం, రాజమండ్రి, విజయవాడ, మచిలీపట్నం గుంటూరు, కడప, చిత్తూరు కేంద్రం అభివృద్ధి చేస్తున్న స్మార్ట్ సిటీలు విశాఖ, కాకినాడ, అమరావతి, తిరుపతి -
వనంలో వసంతమేదీ..!
* ఎనిమిది జిల్లాల్లో ఆదివాసీల ఓట్లే కీలకం * అయినా వారి అభివృద్ధిపై శీతకన్ను * వైఎస్ హయాంలో గిరిజన వికాసం * 2009లో 19 మంది ఎస్టీలకు టికెట్లిచ్చిన వైఎస్ రాష్ట్ర జనాభాలో తొమ్మిది శాతం ఉండి 8 జిల్లాల్లో నేతల తలరాతలను మార్చగల శక్తి ఉన్నప్పటికీ ఆదివాసీల జీవితాలు ఇంకా చీకట్లలోనే మగ్గిపోతున్నాయి. ప్రభుత్వాలు మారుతున్నా వారి బతుకుల్లో మాత్రం వెలుగులు రావడం లేదు. ‘ఓట్ల’వేళ వారిని దగ్గర తీసుకున్నట్టు నటించే నాయకులు తర్వాత వారి గురించి క్షణకాలమైనా ఆలోచించడం లేదు. వైఎస్ హయాంలో వారి సంక్షేమానికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నా ఆ తర్వాతి వచ్చిన ప్రభుత్వాలు మళ్లీ వారిపై శీతకన్నేశాయి. గడ్డం రాజిరెడ్డి, నిజామాబాద్: శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఖమ్మం, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల్లో ఐదో షెడ్యూల్ కింద 2005లో గిరిజన ప్రాంతాలను గుర్తించినా, రాజకీయంగా చట్టసభల్లో వారికి తగిన ప్రాధాన్యం లభించడం లేదు. ఎస్టీలకు రిజర్వు చేసిన ఆదిలాబాద్ జిల్లాలోని బోధ్, ఆసిఫాబాద్, ఖానాపూర్ అసెంబ్లీ స్థానాలతోపాటు ముధోల్, నిర్మల్, సిర్పూర్, ఆదిలాబాద్ నియోజకవర్గాల్లో ఆదివాసీ, గిరిజనుల ప్రభావం ఎక్కువ. వరంగల్ జిల్లాలోని డోర్నకల్, మహబూబాబాద్, ములుగు నియోజకవర్గాలు ఎస్టీలకు కేటాయించినా వర్ధన్నపేట, భూపాలపల్లి, నర్సంపేటలోనూ వారే కీలకంగా మారారు. ఖమ్మం జిల్లాలోని పినపాక, ఇల్లందు, వైరా, అశ్వరావుపేట, భద్రాచలం స్థానాలను ఎస్టీలకు కేటాయించారు. సత్తుపల్లి, మధిర, ఖమ్మం, పాలేరులోనూ గిరిజనులు ప్రభావం చూపనున్నారు. నల్గొండ జిల్లాలోని దేవరకొండ, మునుగోడు, మిర్యాలగూడలోనూ ఆదివాసీలు అధిక సంఖ్యలో ఉన్నారు. జనాభాలో 9శాతం.. అభివృద్ధిలో నామమాత్రం 1971లో రాష్ట్ర జనాభాలో 13,24,368 మందితో 3.68 శాతంగా ఉన్న ఆదివాసీ, గిరిజనులు... 2011 నాటికి 59,18,073కు పెరిగా రు. రాష్ర్ట జనాభాతో పోలిస్తే ఇది 9 శాతం. 2005-06 బడ్జెట్లో గిరిజన సంక్షేమం కోసం రూ.309.63 కోట్లు, 2012-13 బడ్జెట్లో రూ.1552 కోట్లు కేటాయించినా గిరిజనుల బతుకులు మాత్రం మారడం లేదు. ఆదివాసీలపై వివక్షను రూపుమాపేందుకు వైఎస్ రాజశేఖరరెడ్డి 2004లో 15మందికి, 2009లో 19మందికి పార్టీ టికెట్లు ఇచ్చి చట్టసభలకు పంపేందుకు కృషి చేశారు. తల రాతలు మార్చే శక్తిగా.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఎనిమిది గిరిజన జిల్లాల్లో 31,485.34 చదరపు కిలోమీటర్ల పరిధిలోని 5,968 గ్రామాల్లో ఆదివాసీ, గిరిజనులు విస్తరించి ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. అత్యధికంగా ఖమ్మం జిల్లా జనాభాలో 26.47 శాతం మంది గిరిజనులున్నారు. ఆ తర్వాత ఆదిలాబాద్‌లో 16.74, విశాఖపట్నంలో 14.55, వరంగల్‌లో 14.10, నల్లగొండలో 10.55, విజయనగరంలో 9.55, నిజామాబాద్‌లో 9 శాతం మంది ఆదివాసీ, గిరిజనులున్నారు. వీరి ఓట్లు కీలకం కానుండడంతో వారిని ప్రసన్నం చేసుకోవడానికి రాజకీయ నాయకులు ప్రదక్షణలు చేస్తున్నారు. హామీలు గుప్పిస్తున్నారు. వైఎస్ హయాంలో.. - గిరిజనుల సంక్షేమం కోసం 2006 డిసెంబర్ 13న అటవీహక్కుల చట్టాన్ని ప్రకటించిన వైఎస్ రాజశేఖరరెడ్డి 1 జనవరి 2007 నుంచి దానిని అమల్లోకి తెచ్చారు. దానికి సరిగ్గా ఏడాది తర్వాత ప్రత్యేక చట్టం తెచ్చిన వైఎస్సార్ దీనికింద 11.27లక్షల ఎకరాలను గుర్తించారు. మొత్తంగా ఆయన హయాంలో 4.44 లక్షల ఎకరాలను 1.28లక్షల గిరిజన, ఆదివాసీ కుటుంబాలకు పంపిణీ చేశారు. - దారిద్య్రరేఖకు దిగువన ఉన్న గిరిజన కుటుంబాలను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అందజేసిన గ్రాంటుకు సమానంగా ఆర్థిక సహాయ పథకం కింద ఏటా రూ. 29 కోట్లను గ్రాంట్ ఇన్ ఎయిడ్‌గా కేటాయిస్తూ 2005 సెప్టెంబర్ 21న వైఎస్ జీవో విడుదల చేశారు. - రాష్ట్రంలోని కొండకోనలపైన, మారుమూల, లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న 2,351 గిరిజన ఆవాసాలను గుర్తించిన వైఎస్సార్ ఆటవీహక్కుల చట్టం, 2006 కింద త్వరితగతిన వాటిని అభివృద్ధి చేశారు. - ప్రభుత్వశాఖలు తమ ప్రణాళిక బడ్జెట్ నుంచి గిరిజన ఉప ప్రణాళిక (టీఎస్పీ)కు అందజేస్తున్న 6 శాతం నిధులను 6.6 శాతానికి పెంచుతూ 2005 నవంబర్ 7న జీవోఎంఎస్ 17 ద్వారా ఉత్తర్వులు జారీ చేశారు. - పోస్టుమెట్రిక్ ఉపకార వేతనాలను 2005-06 ఆర్థిక సంవత్సరంలో సవరించారు. ఈ మేరకు 2005 ఫిబ్రవరి 10న ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ఆ ఒక్క సంవత్సరమే 1,40,466 మంది విద్యార్థులు లబ్ధి చేకూరింది. జన తెలంగాణ వైఎస్ నమూనా ఆదర్శం వైఎస్ రాజశేఖరరెడ్డి అనుసరించి, ఆచరించిన అభివృద్ధి నమూనా తెలంగాణ నవ నిర్మాణానికి అవసరం. 2004 నుంచి 2009 వరకు రాష్ట్రంలో అన్ని వర్గాల వారి సంక్షేమానికి వైఎస్ కృషి చేశారు. మహిళలకు, యువతకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. రైతులకు అన్ని విషయాల్లో అండగా నిలవాలి. పండించిన పంటకు సరైన ధర లభించేలా చూడాలి. సమర్థవంతంగా పాలనను అందించగలిగే విజన్ ఉన్న నాయకుడినే తెలంగాణ సమాజం ఎన్నుకోవాలి. కొన్ని మార్పులతో వైఎస్ నమూనాను అమలు చేస్తే రాష్ట్రం సగర్వంగా తలెత్తుకుని నిలబడగలుగుతుంది. - బి. అనూష, 8వ తరగతి, ఆదర్శ పాఠశాల, చిన్నకోడూరు, మెదక్ జిల్లా. వలసలు లేని పాలన రావాలి వలసలు లేని, రైతు ఆత్మహత్యలు లేని పాలన రావాలి. రైతుల పంటలను ప్రభుత్వమే గిట్టుబాటు ధర చెల్లించి కొనుగోలు చేయాలి. పేదలందరికీ భూమిని పంచాలి. ప్రతి పల్లెకు రక్షిత జలాలను అందించాలి. కామన్‌స్కూలు విధానాన్ని ప్రవేశపెట్టాలి. అన్ని వర్గాలకు సమాన అవకాశాలు కల్పించి సామాజిక తెలంగాణ సాధించాలి. యువత రాజకీయాల్లోకి ప్రవేశించి అవినీతి రహిత పాలన అందించాలి. తెలంగాణ అమరవీరుల పేరిట స్మారక చిహ్నాలను ఏర్పాటు చేయాలి. ఉద్యోగ ఖాళీలన్నీ భర్తీ చేయాలి. - జంగం శ్రీశైలం, కామారెడ్డి, నిజామాబాద్ జిల్లా