సోలో బ్రతుకే సో 'బెటరు' | More than 6 percent of Andhra Pradesh population is single | Sakshi
Sakshi News home page

సోలో బ్రతుకే సో 'బెటరు'

Published Thu, Feb 2 2023 6:22 AM | Last Updated on Thu, Feb 2 2023 11:10 AM

More than 6 percent of Andhra Pradesh population is single - Sakshi

ప్రపంచవ్యాప్తంగా ఏక్‌ నిరంజన్ల సంఖ్య ఏటా పెరుగుతోంది. మన రాష్ట్రంలోనూ ఇదే ట్రెండ్‌ కనిపిస్తోంది. రాష్ట్ర జనాభాలో 6 శాతానికి పైగా ఒంటరులే ఉన్నట్టు తేలింది. రాష్ట్రంలో మొత్తంగా 31,20,499 మంది ఒంటరి జీవితం సాగిస్తున్నట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2019లో వలంటీర్ల ద్వారా నిర్వహించిన కుటుంబ సర్వేలో రాష్ట్రంలో 1.66 కోట్ల కుటుంబాలు ఉన్నట్టు నిర్ధారణ కాగా.. అందులో 31.20 లక్షల మంది ఏక్‌ నిరంజన్లేనని తేలింది. 

సాక్షి, అమరావతి: తాత నాయనమ్మ.. అమ్మానాన్న.. అన్నా చెల్లెళ్లు.. బాబాయ్‌ చిన్నమ్మ కలిసి ఉండే ఉమ్మడి కుటుంబాలకు సుమారు 30–35 ఏళ్ల క్రితమే కాలం చెల్లింది. అమ్మానాన్న.. అన్నదమ్ములు.. అక్క చెల్లెమ్మలు వరకే పరిమితమైన కుటుంబాలకు పూర్తిగా అలవాటు పడిపోయాం. వాళ్లలో ఎవరికైనా పెళ్లయిందంటే.. వెంటనే వేరు కాపురం పెట్టే పరిస్థితికి వచ్చేశాం.

ఇప్పుడు ఆ రోజులు కూడా మారిపోతున్నాయి. ప్రస్తుతం ఒంటరిగా నివాసం ఉండాలనుకునే వారి సంఖ్య పెరుగుతోంది. ఆడ, మగ అనే తేడా లేకుండా కొందరు పెళ్లి చేసుకోకుండా ఒంటరి జీవనం సాగిస్తుంటే.. భార్య లేదా భర్తను కోల్పోయి ఒంటరిగా మిగిలిపోతున్నారు.. కొందరైతే పిల్లలున్నా విదేశాలు లేదా దూరప్రాంతాల్లో ఉండటం వల్ల ఒంటరి జీవనం సాగిస్తున్నారు.  

అమెరికాలో సగం మందికి పైనే ఒంటరి జీవులు 
వ్యక్తిగత ఆదాయాల పరంగా.. దేశ ఆర్థిక పరిస్థితి పరంగా ప్రపంచంలోనే అత్యంత సంపన్న దేశంగా వెలుగొందుతున్న అమెరికాలో అయితే 18 ఏళ్లు వయసు దాటిన వారిలో ఎక్కువ మంది ఒంటరి జీవులుగానే మిగిలిపోతున్నట్టు తేలింది. తల్లిదండ్రులతో కలిసి జీవించే వారికంటే తల్లిదండ్రులు లేదా ఇతరులెవరితో సంబంధం లేకుండా జీవనం సాగించే వారి సంఖ్య ఆ దేశంలో ఎక్కువగా ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి.

ఆ దేశ 2021 నాటి జనాభా గణాంక అంచనాల ప్రకారం 3.39 కోట్ల మంది తల్లిదండ్రులతోనో లేదంటే ఇతరులతో కలిసి జీవిస్తుంటే.. 3.75 కోట్ల మంది ఒంటరిగా జీవనం సాగిస్తున్నారు. 1965లో అమెరికాలో 15 శాతం మంది మాత్రమే 18 ఏళ్ల తర్వాత తల్లిదండ్రులతో సంబంధం లేకుండా ఒంటరిగా జీవనం సాగించే పరిస్థితి ఉండగా.. ఆ తర్వాత కాలంలో ఏటా ఆ సంఖ్య పెరుగుతూ వచ్చింది. 2013–16 మధ్యకాలంలో తల్లిదండ్రులతో కలిసి జీవించే వారి కంటే ఒంటరి జీవనం సాగించే వారే ఎక్కువ అయ్యారని గణాంకాలు పేర్కొంటున్నాయి.  

రాష్ట్రంలో 6 శాతానికి పైగా ఒంటరులే 
మన రాష్ట్రంలో 31,20,499 మంది ఒంటరిగా జీవనం సాగిస్తున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. 2019లో రాష్ట్ర ప్రభుత్వం వలంటీర్ల ద్వారా నిర్వహించిన కుటుంబాల సర్వేలో రాష్ట్రంలో 1.66 కోట్ల కుటుంబాలు ఉన్నట్టు నిర్ధారణ అయింది. అందులో 31.20 లక్షల మంది ఒకే వ్యక్తి ఒక కుటుంబంగా ఉంటూ ఒంటరి జీవితం సాగిస్తున్నట్టు తేలింది. రాష్ట్రంలో 5.21 కోట్ల జనాభా ఉంటుందని అంచనా వేయగా.. వారిలో ఒంటరి జీవనం సాగించే వారి సంఖ్య 6 శాతానికి పైగా ఉన్నట్టు స్పష్టమవుతోంది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement