వనంలో వసంతమేదీ..!
* ఎనిమిది జిల్లాల్లో ఆదివాసీల ఓట్లే కీలకం
* అయినా వారి అభివృద్ధిపై శీతకన్ను
* వైఎస్ హయాంలో గిరిజన వికాసం
* 2009లో 19 మంది ఎస్టీలకు టికెట్లిచ్చిన వైఎస్
రాష్ట్ర జనాభాలో తొమ్మిది శాతం ఉండి 8 జిల్లాల్లో నేతల తలరాతలను మార్చగల శక్తి ఉన్నప్పటికీ ఆదివాసీల జీవితాలు ఇంకా చీకట్లలోనే మగ్గిపోతున్నాయి. ప్రభుత్వాలు మారుతున్నా వారి బతుకుల్లో మాత్రం వెలుగులు రావడం లేదు. ‘ఓట్ల’వేళ వారిని దగ్గర తీసుకున్నట్టు నటించే నాయకులు తర్వాత వారి గురించి క్షణకాలమైనా ఆలోచించడం లేదు. వైఎస్ హయాంలో వారి సంక్షేమానికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నా ఆ తర్వాతి వచ్చిన ప్రభుత్వాలు మళ్లీ వారిపై శీతకన్నేశాయి.
గడ్డం రాజిరెడ్డి, నిజామాబాద్: శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఖమ్మం, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల్లో ఐదో షెడ్యూల్ కింద 2005లో గిరిజన ప్రాంతాలను గుర్తించినా, రాజకీయంగా చట్టసభల్లో వారికి తగిన ప్రాధాన్యం లభించడం లేదు. ఎస్టీలకు రిజర్వు చేసిన ఆదిలాబాద్ జిల్లాలోని బోధ్, ఆసిఫాబాద్, ఖానాపూర్ అసెంబ్లీ స్థానాలతోపాటు ముధోల్, నిర్మల్, సిర్పూర్, ఆదిలాబాద్ నియోజకవర్గాల్లో ఆదివాసీ, గిరిజనుల ప్రభావం ఎక్కువ. వరంగల్ జిల్లాలోని డోర్నకల్, మహబూబాబాద్, ములుగు నియోజకవర్గాలు ఎస్టీలకు కేటాయించినా వర్ధన్నపేట, భూపాలపల్లి, నర్సంపేటలోనూ వారే కీలకంగా మారారు. ఖమ్మం జిల్లాలోని పినపాక, ఇల్లందు, వైరా, అశ్వరావుపేట, భద్రాచలం స్థానాలను ఎస్టీలకు కేటాయించారు. సత్తుపల్లి, మధిర, ఖమ్మం, పాలేరులోనూ గిరిజనులు ప్రభావం చూపనున్నారు. నల్గొండ జిల్లాలోని దేవరకొండ, మునుగోడు, మిర్యాలగూడలోనూ ఆదివాసీలు అధిక సంఖ్యలో ఉన్నారు.
జనాభాలో 9శాతం.. అభివృద్ధిలో నామమాత్రం
1971లో రాష్ట్ర జనాభాలో 13,24,368 మందితో 3.68 శాతంగా ఉన్న ఆదివాసీ, గిరిజనులు... 2011 నాటికి 59,18,073కు పెరిగా రు. రాష్ర్ట జనాభాతో పోలిస్తే ఇది 9 శాతం. 2005-06 బడ్జెట్‌లో గిరిజన సంక్షేమం కోసం రూ.309.63 కోట్లు, 2012-13 బడ్జెట్‌లో రూ.1552 కోట్లు కేటాయించినా గిరిజనుల బతుకులు మాత్రం మారడం లేదు. ఆదివాసీలపై వివక్షను రూపుమాపేందుకు వైఎస్ రాజశేఖరరెడ్డి 2004లో 15మందికి, 2009లో 19మందికి పార్టీ టికెట్లు ఇచ్చి చట్టసభలకు పంపేందుకు కృషి చేశారు.
తల రాతలు మార్చే శక్తిగా..
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఎనిమిది గిరిజన జిల్లాల్లో 31,485.34 చదరపు కిలోమీటర్ల పరిధిలోని 5,968 గ్రామాల్లో ఆదివాసీ, గిరిజనులు విస్తరించి ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. అత్యధికంగా ఖమ్మం జిల్లా జనాభాలో 26.47 శాతం మంది గిరిజనులున్నారు. ఆ తర్వాత ఆదిలాబాద్‌లో 16.74, విశాఖపట్నంలో 14.55, వరంగల్‌లో 14.10, నల్లగొండలో 10.55, విజయనగరంలో 9.55, నిజామాబాద్‌లో 9 శాతం మంది ఆదివాసీ, గిరిజనులున్నారు. వీరి ఓట్లు కీలకం కానుండడంతో వారిని ప్రసన్నం చేసుకోవడానికి రాజకీయ నాయకులు ప్రదక్షణలు చేస్తున్నారు. హామీలు గుప్పిస్తున్నారు.
వైఎస్ హయాంలో..
- గిరిజనుల సంక్షేమం కోసం 2006 డిసెంబర్ 13న అటవీహక్కుల చట్టాన్ని ప్రకటించిన వైఎస్ రాజశేఖరరెడ్డి 1 జనవరి 2007 నుంచి దానిని అమల్లోకి తెచ్చారు. దానికి సరిగ్గా ఏడాది తర్వాత ప్రత్యేక చట్టం తెచ్చిన వైఎస్సార్ దీనికింద 11.27లక్షల ఎకరాలను గుర్తించారు. మొత్తంగా ఆయన హయాంలో 4.44 లక్షల ఎకరాలను 1.28లక్షల గిరిజన, ఆదివాసీ కుటుంబాలకు పంపిణీ చేశారు.
- దారిద్య్రరేఖకు దిగువన ఉన్న గిరిజన కుటుంబాలను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అందజేసిన గ్రాంటుకు సమానంగా ఆర్థిక సహాయ పథకం కింద ఏటా రూ. 29 కోట్లను గ్రాంట్ ఇన్ ఎయిడ్‌గా కేటాయిస్తూ 2005 సెప్టెంబర్ 21న వైఎస్ జీవో విడుదల చేశారు.
- రాష్ట్రంలోని కొండకోనలపైన, మారుమూల, లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న 2,351 గిరిజన ఆవాసాలను గుర్తించిన వైఎస్సార్ ఆటవీహక్కుల చట్టం, 2006 కింద త్వరితగతిన వాటిని అభివృద్ధి చేశారు.
- ప్రభుత్వశాఖలు తమ ప్రణాళిక బడ్జెట్ నుంచి గిరిజన ఉప ప్రణాళిక (టీఎస్‌పీ)కు అందజేస్తున్న 6 శాతం నిధులను 6.6 శాతానికి పెంచుతూ 2005 నవంబర్ 7న జీవోఎంఎస్ 17 ద్వారా ఉత్తర్వులు జారీ చేశారు.
- పోస్టుమెట్రిక్ ఉపకార వేతనాలను 2005-06 ఆర్థిక సంవత్సరంలో సవరించారు. ఈ మేరకు 2005 ఫిబ్రవరి 10న ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ఆ ఒక్క సంవత్సరమే 1,40,466 మంది విద్యార్థులు లబ్ధి చేకూరింది.
జన తెలంగాణ
వైఎస్ నమూనా ఆదర్శం
వైఎస్ రాజశేఖరరెడ్డి అనుసరించి, ఆచరించిన అభివృద్ధి నమూనా తెలంగాణ నవ నిర్మాణానికి అవసరం. 2004 నుంచి 2009 వరకు రాష్ట్రంలో అన్ని వర్గాల వారి సంక్షేమానికి వైఎస్ కృషి చేశారు. మహిళలకు, యువతకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. రైతులకు అన్ని విషయాల్లో అండగా నిలవాలి. పండించిన పంటకు సరైన ధర లభించేలా చూడాలి. సమర్థవంతంగా పాలనను అందించగలిగే విజన్ ఉన్న నాయకుడినే తెలంగాణ సమాజం ఎన్నుకోవాలి. కొన్ని మార్పులతో వైఎస్ నమూనాను అమలు చేస్తే రాష్ట్రం సగర్వంగా తలెత్తుకుని నిలబడగలుగుతుంది.
- బి. అనూష, 8వ తరగతి, ఆదర్శ పాఠశాల, చిన్నకోడూరు, మెదక్ జిల్లా.
వలసలు లేని పాలన రావాలి
వలసలు లేని, రైతు ఆత్మహత్యలు లేని పాలన రావాలి. రైతుల పంటలను ప్రభుత్వమే గిట్టుబాటు ధర చెల్లించి కొనుగోలు చేయాలి. పేదలందరికీ భూమిని పంచాలి. ప్రతి పల్లెకు రక్షిత జలాలను అందించాలి. కామన్‌స్కూలు విధానాన్ని ప్రవేశపెట్టాలి. అన్ని వర్గాలకు సమాన అవకాశాలు కల్పించి సామాజిక తెలంగాణ సాధించాలి. యువత రాజకీయాల్లోకి ప్రవేశించి అవినీతి రహిత పాలన అందించాలి. తెలంగాణ అమరవీరుల పేరిట స్మారక చిహ్నాలను ఏర్పాటు చేయాలి. ఉద్యోగ ఖాళీలన్నీ భర్తీ చేయాలి.
- జంగం శ్రీశైలం, కామారెడ్డి,
నిజామాబాద్ జిల్లా