కందుకూరు: జిల్లా పరిధిలో సాగులో ఉన్న పత్తి, వరి పైర్లలో ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో తెగుళ్లు ఆశించి రైతులు సతమతమవుతు న్నారు. ఆ పంటల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చేపట్టాల్సిన యాజమాన్య పద్ధతుల్ని గురించి జిల్లా ఏరువాక కేంద్రం శాస్త్రవేత్తలు ఎన్.ప్రవీణ్, సీహెచ్.చిరంజీవి, పి.అమ్మాజీ రైతులకు సూచనలు, సలహాలు అందించారు.
పత్తిలో..
ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో పత్తి పంటలో నల్లమచ్చ తెగులు ఆశించినట్లు గుర్తించడమైంది. ఈ తెగులు ఆశిస్తే కోణాకారంలో నూనె రంగు మచ్చలు ఏర్పడి తర్వాత మూడవ దశలో ఆకుల ఈనెల ద్వారా తెగులు వ్యాపించి నల్లగా మారుతుంది. దీనిని బ్లాక్ ఆర్మ్ అని పిలుస్తారు. ఉద్ధృతిని బట్టి 3, 4 పర్యాయాలు 15 రోజుల వ్యవధిలో 10 లీటర్ల నీటికి 1 గ్రా. పౌషామైసిన్ లేదా ప్లాంటోమైసిన్ మరియు కాపర్ ఆక్సిక్లోరైడ్ 30 గ్రా. కలిపి పిచికారీ చేయాలి.
పలు చోట్ల పత్తిలో బూడిద తెగులు ఆశించింది. ఆకుల మీద కోణాకారపు మచ్చలు ఏర్పడి బూడిద తెగులు బీజాలు ఆకుల అడుగు భాగాన ఏర్పడతాయి. క్రమేపీ ఆకుల పై భాగాలకు కూడా వ్యాపించి ఆకులు పసుపు రంగులోకి మారి పండు బారి రాలిపోతాయి. దీని నివారణకు లీటర్ నీటికి నీటిలో కరిగే గంధకం 3 గ్రా. లేదా 1 గ్రా. కార్బండిజం కలిపి పిచికారీ చేయాలి. పత్తిలో రసం పీల్చే పురుగుల నివారణకు 1 గ్రా. ఎసిఫెట్ లేదా 2 మి.లీ. ప్రిఫోనిల్ మందును కలిపి పిచికారీ చేయాలి.
వరిలో...
చాలా ప్రాంతాల్లో వరిలో కంకినల్లి మరియు గింజమచ్చ తెగులు ఆశించింది. నివారణ చర్యలు చేపట్టకపోతే గింజ పట్టే దశలో ఉన్న పంటకు నష్టం వాటిల్లే అవకాశం ఉంది. దీని నివారణకు 2 మి.లీ ప్రొఫినోఫాస్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. వరిలో కాండం తొలుచు పురుగు నివారణకు కార్టాప్ హైడ్రోక్లోరైడ్ లేదా 0.4 మి.లీ. క్లోరాజోన్ మందును లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి.
ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో సుడి దోమ బాగా ఆశిస్తోంది. నివారణకు పొలాన్ని అడపాదడపా ఆరబెట్టాలి. ప్రతి 2 మీటర్లకు 20 సెం.మీ. కాలి బాటలు వదలాలి. ముందుగా పొలంలో నీటిని తీసి వేసి మొదలు తడిచే విధంగా ఇథోపెన్ ప్రాక్ట్ 1.5 మి.లీ. లేదా ఎసిఫెట్ 1.5 గ్రా. మరియు డైక్లోరోవాస్ 1.0 మి.లీ. లేదా బుప్రొజిన్ 1.6 మి.లీ. లీటర్ నీటికి కలిపి అవసరం మేరకు 7 నుంచి 10 రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి.
పత్తి, వరిలో...తెగుళ్ల నివారణ ఇలా..
Published Mon, Nov 3 2014 12:05 AM | Last Updated on Sat, Sep 2 2017 3:46 PM
Advertisement
Advertisement