దిలావర్‌పూర్ (నిర్మల్): నిర్మల్ జిల్లా దిలావర్‌పూర్ మండల కేంద్రం–గుండంపల్లి గ్రామాల మధ్య నిర్మిస్తున్న ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళన బుధవారం ఉద్రిక్తంగా మారింది. ఒక్కసారిగా తరలివచ్చిన గ్రామస్తులు, రైతులు ఫ్యాక్టరీపై దాడిచేసి, వాహనాన్ని తగులబెట్టడంతో ఆ ప్రాంతమంతా రణరంగాన్ని తలపించింది. పోలీసులు లాఠీచార్జీ చేసినా రైతులు వెనక్కి తగ్గకపోవడంతో కొన్ని గంటలపాటు ఉద్రిక్తత కొనసాగింది. చివరకు జిల్లా ఉన్నతాధికా రులు సముదాయించడంతో గ్రామస్తులు వెనక్కితగ్గారు.
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు బ్యాక్‌వాటర్ సమీపంలో నిర్మిస్తున్న ఫ్యాక్టరీపై మొదటి నుంచీ రైతులు, గ్రామస్తులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. సమీప గ్రామస్తులు పలుమార్లు ఆందోళనలు చేయడంతోపాటు అధికారులకు వినతిపత్రాలు ఇచ్చారు. అయినా ఫ్యాక్టరీ పనులు ఊపందుకోవడంతో బుధవారం దిలావర్‌పూర్, గుండంపల్లి గ్రామాలకు చెందిన ప్రజలు ఒక్కసారిగా పరిశ్రమ ప్రాంతాన్ని చుట్టుముట్టారు. అక్కడ నిర్మిస్తున్న ప్రహరీని కూల్చేశారు. నిర్మాణా లను అడ్డుకున్నారు. వందలమంది మూకుమ్మ డిగా దాడికి పాల్పడటంతో నిర్మాణాలు ధ్వంసమయ్యాయి.
ఓ కారును ధ్వంసం చేసి నిప్పుపెట్టారు. నిర్మల్ నుంచి ఫైరింజిన్ వచ్చి మంటలను ఆర్పివేసింది. మరోపక్క రైతులు, గ్రామస్తులు దిలావర్‌పూర్ తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. వారిని సివిల్‌డ్రెస్‌లో ఉన్న పోలీసులు వీడియో తీస్తుండగా వారు ఇథనాల్ కంపెనీ వారని అనుకున్న గ్రామస్తులు దాడి చేశారు. పోలీసుల ఫోన్లు లాక్కుని ధ్వంసం చేశారు. దీంతో పోలీసులు వారిని చెదరగొట్టేందుకు స్వల్ప లాఠీచార్జీ చేశారు.
ఇందులో పలువురు రైతులు, గ్రామస్తులకు గాయాలయ్యాయి. అడిషనల్ కలెక్టర్ కిశోర్‌కుమార్, భైంసా ఏఎస్పీ కాంతిలాల్ పాటిల్, తహసీల్దార్ సరిత అక్కడికి వచ్చి సమస్యను ప్రభుత్వానికి నివేదిస్తామని, అప్పటివరకు శాంతియుతంగా ఉండాలని గ్రామస్తులను కోరగా, రైతులు శాంతించారు. కాగా, రైతులు, ప్రజలు గురువారం దిలావర్‌పూర్ మండల బంద్‌కు పిలుపునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment