నిర్మల్: కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ‘ప్రజాపాలన’వల్ల సుదీర్ఘకాలంగా ఉన్న తమ ఊరి సమస్య పరిష్కారమవుతోందని నిర్మల్ జిల్లా కడెం మండలం ఉడుంపూర్ గ్రామ వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ గ్రామం కవ్వాల్ అభయారణ్య ప్రాంతంలో ఉంటుంది. ఇక్కడ దాదాపు 2,500 జనాభా ఉండగా.. ఈ ఊరికి అటవీ ప్రాంతం నుంచి వచ్చే వాగు ఉంది. ఈ వాగుపై ఎప్పుడో కట్టిన చెక్‌డ్యామ్ 30–40 ఏళ్ల కిందటే కొట్టుకుపోయింది.
గతంలో చెక్‌డ్యామ్ నుంచి వచ్చే కాలువతో సమీపంలోని చెరువులు నింపేవారు. అయితే చెక్‌డ్యామ్, కాలువ దెబ్బతినడంతో సాగునీటికి గ్రామస్తులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉడుంపూర్ కవ్వాల్ అభయారణ్యం పరిధిలో ఉండటంతో కాంక్రీట్ నిర్మాణాలు చేపట్టడానికి అటవీశాఖ అనుమతులివ్వడం లేదు. ఏళ్లుగా గ్రామస్తులు మొర పెట్టుకుంటున్నా.. ఎవరూ పరిష్కారం కోసం ప్రయత్నం చేయలేదు.
కదిలిన అధికారి..
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమాన్ని ఈనెల 3న ఉడుంపూర్‌లో నిర్వహించారు. కడెం మండల ఇన్‌చార్జిగా ఉన్న జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి (డీఆర్‌డీవో) విజయలక్ష్మి ఆరోజు ఉడుంపూర్‌లో కార్యక్రమాన్ని పరిశీలించేందుకు వచ్చారు. ఈ సందర్భంగా ‘ఆరు గ్యారంటీ’ల దరఖాస్తులతోపాటు తమ ఊరి సమస్యను ప్రభుత్వం పరిష్కరించాలంటూ గ్రామస్తులు డీఆర్‌డీవో విజయలక్ష్మికి దరఖాస్తును అందించారు. వెంటనే స్పందించిన ఆమె సభ కాగానే, గ్రామస్తులతో కలసి మోటార్‌బైక్‌పై కొంతదూరం, ఆపై కాలినడకన అటవీ ప్రాంతంలో ఉన్న చెక్‌డ్యామ్ వద్దకు వెళ్లి పరిశీలించారు.
అనంతరం ఆమె ఉడుంపూర్ నీటి సమస్యను జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ దృష్టికి తీసుకెళ్లారు. అలాగే ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మబొజ్జుతో చర్చించారు. వారి సూచనల మేరకు వెంటనే రూ.9 లక్షల అంచనాలతో పనులకు ప్రణాళికలు రూపొందించారు. అటవీ ప్రాంతంలో చెట్లకు ఇబ్బంది కలగకుండా కాలువ తవ్వకానికి పథకం సిద్ధం చేశారు.
ఎమ్మెల్యే వెడ్మబొజ్జు చేతుల మీదుగా శనివారం చెక్ డ్యామ్ ప్రాంతం నుంచి కాలువ తవ్వకం పనులు ప్రారంభించారు. ప్రజాపాలనతో తమ ఊరి దీర్ఘకాలిక సమస్యకు పరిష్కారం లభించడంతో ఉడుంపూర్‌వాసులు హర్షం వ్యక్తంచేస్తున్నారు. సీఎం రేవంత్‌రెడ్డికి, ఎమ్మెల్యే బొజ్జు, జిల్లా అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment