హైదరాబాద్, సాక్షి: అసెంబ్లీ నుంచి సీన్ మారి రోడ్డెక్కింది. తెలంగాణలో అధికార ప్రతిపక్షాల నడుమ నీళ్ల నిప్పులు తారాస్థాయికి చేరాయి. ఈ క్రమంలోనే మంగళవారం పోటాపోటీ ప్రదర్శనలకు ఇరు పార్టీలు సిద్ధం అయ్యాయి.
ఐదో రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్నాయి. ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌పైచర్చ జరగాల్సి ఉంది. అయితే అది వాయిదా పడే అవకాశాలే ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎందుకంటే.. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రుల మేడిగడ్డ సందర్శనకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ప్రాజెక్టు సందర్శనకు ప్రజాప్రతినిధులకు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఇప్పటికే ఆహ్వానాలు పంపారు. దీంతో అంతా బస్సుల్లో మేడిగడ్డ ప్రాజెక్టుకు బయల్దేరే అవకాశాలు కనిపిస్తున్నాయి.
సీఎం హోదాలో రేవంత్‌రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. ఈ క్రమంలో ప్రజాప్రతినిధులంతా రోడ్డు మార్గాన బస్సుల్లో రావాలని ఇప్పటికే ఆయన ఆదేశాలు జారీ చేశారు. మధ్యాహ్నాం మూడు గంటల ప్రాంతంలో బస్సులు మేడిగడ్డకు చేరుకోనున్నాయి. గంటన్నర పాటు ప్రాజెక్టును, పిల్లర్లు కుంగిన ప్రాంతాన్ని ప్రజాప్రతినిధులంతా సందర్శిస్తారు. ఆపై సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో అధికారుల పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఉండనుంది. సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్‌లు మీడియాతో మాట్లాడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే.. ఎంఐఎం సభ్యులు సైతం మేడిగడ్డ వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
తొలిసారి కేసీఆర్ సభ
మరోవైపు కృష్ణా నది కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు - KRMBకి అప్పగించడంపై బీఆర్‌ఎస్ విమర్శలు ఎక్కుపెట్టంది. కృష్ణా జలాల పరిరక్షణ పేరిట ఆ పార్టీ అధినేత కేసీఆర్ అధ్యక్షతన మర్రిగూడ బైపాస్‌లో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేసింది. సాయంత్రం 4గం. ప్రాంతంలో ఈ సభ జరగనుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్‌ఎస్ నిర్వహించబోయే బహిరంగ సభ ఇదే కావడంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. ఈ క్రమంలోనే నల్లగొండ, ఖమ్మంల నుంచి 2 లక్షల మంది సభకు తరలించాలని నిర్ణయించింది. ఈ సభలో కృష్ణా జలాల విషయంలో కాంగ్రెస్ చేస్తున్న మోసాన్ని కేసీఆర్.. తెలంగాణ ప్రజలకు వివరిస్తారని బీఆర్‌ఎస్ శ్రేణులు చెబుతున్నాయి.
నల్లగొండలో ఉద్రిక్తత!
కేసీఆర్ సభకు కౌంటర్‌గా.. నల్లగొండ క్లాక్ టవర్‌లో మినీ సభకు కాంగ్రెస్ సిద్ధమైంది. గత పదేళ్లలో కృష్నా జలాల విషయంలో బీఆర్‌ఎస్ అవలింభించిన విదాల్ని వివరించడంతో పాటు ప్రాజెక్టులను పూర్తి చేయకపోవడంపైనా పవర్ పాయింట్ ప్రజంటేషన్‌కు సిద్ధమైంది. అలాగే.. కేసీఆర్ కోసం గులాబీ కుర్చీ, కండువాను సిద్దం చేశాయి కాంగ్రెస్ శ్రేణులు. దీనిని బీఆర్‌ఎస్ అడ్డుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో పట్టణంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment