
‘‘ఓదెల 2’ చిత్రకథ వినగానే తమన్నా ఎగ్జైట్ అయ్యారు. తొలిసారి ఆమె నాగసాధువు పాత్ర చేశారు. అద్భుతంగా నటించడంతో పాటు ఆ పాత్ర కోసం ఎంతో కష్టపడ్డారామె. ఏప్రిల్, మే నెలల్లో ఎండల్లోనూ చెప్పులు లేకుండా షూటింగ్‌లో పాల్గొన్నారు. సరైన టైమ్‌లో సరైన కథ తమన్నా దగ్గరకెళ్లిందని నమ్ముతున్నాను’’ అని నిర్మాత డి. మధు అన్నారు. తమన్నా లీడ్ రోల్‌లో నటించిన చిత్రం ‘ఓదెల 2’. అశోక్ తేజ దర్శకత్వంలో మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్ వర్క్స్‌పై డి. మధు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 17న తెలుగు, హిందీలో విడుదలవుతోంది.
ఈ సందర్భంగా డి. మధు విలేకరులతో మాట్లాడుతూ– ‘‘ఓదెల రైల్వేస్టేషన్’ మూవీ నాకు బాగా నచ్చింది. అనుకోకుండా ఓ రోజు సంపత్ నందిగారు ‘ఓదెల 2’ కథని నాకు చెప్పడం... చాలా నచ్చడంతో ఈప్రాజెక్టు మొదలైంది. ‘ఓదెల 2’ కథ లాజికల్‌గా ఉంటుంది. అశోక్ తేజ చక్కగా తీశారు. ఇందులో ఉన్న థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఆడియన్స్‌ని సర్‌ప్రైజ్ చేస్తాయి.
అజినీష్ లోక్‌నాథ్ మ్యూజిక్, నేపథ్య సంగీతం చాలా బాగుంటాయి. సౌందర్ రాజన్‌గారు అద్భుతమైన విజువల్స్ ఇచ్చారు. వశిష్ఠ, మురళీ శర్మ, శ్రీకాంత్ అయ్యంగార్, హెబ్బా పటేల్ పాత్రలన్నీ కూడా చాలా బాగుంటాయి. ప్రేక్షకులకు మంచి సినిమా ఇవ్వాలని, అలాగే మంచి సక్సెస్ అందుకోవాలనే ప్యా షన్‌తో బడ్జెట్ గురించి ఆలోచించకుండా ‘ఓదెల 2’ని గ్రాండ్‌గా తీశాం. ఇక భావోద్వేగాలున్న చిత్రాలతో పాటు లేడీ ఓరియంటెడ్ కథలంటే నాకు ఇష్టం’’ అన్నారు.