కలప తరలిపోతోంది..
* ప్రేక్షక పాత్రలో అధికారులు
* మొబైల్ పార్టీ నిఘాతో పట్టివేత
జన్నారం : కలప స్మగ్లర్ల కన్ను కవ్వాల్ అభయారణ్‌యంలోని టేకు చెట్లపై పడింది. ఈ ప్రాంతంలో లభించే టేకుకు భారీ డిమాండ్ ఉండడంతో వృక్షాలపై వేటు వేస్తున్నారు. కవ్వాల్ అభయారణ్యంలోని పలు ప్రాంతాల నుంచి విలువైన టేకును తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. అధికారుల ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ స్మగ్లింగ్‌కు పాల్పడుతున్నారు. తాళ్లపేట్ రేంజ్‌లో నిత్యం కలప తరలిపోతున్నట్లు తెలుస్తోంది. స్వయంగా డీఎఫ్‌వో దామోదర్‌రెడ్డి రంగంలోకి దిగి మొబైల్ పార్టీ, స్ట్రైకింగ్ ఫోర్స్ సిబ్బంది ద్వారా కలప స్వాధీనం చేసుకున్న సంఘటనలే అందుకు నిదర్శనం. ఉన్నతాధికారులు కలప స్మగ్లింగ్‌పై ఉక్కుపాదం మోపుతుండగా.. కొందరు కింది స్థాయి అధికారుల సహకారంతో కలప అక్రమ రవాణా సాగిపోతోంది.
డివిజన్‌లోని ఇందన్‌పల్లి రేంజ్ పరిధిలో కూడా ఇటీవల స్మగ్లింగ్ పెరిగింది. రేంజ్ పరిధిలోని కల్లెడ, ఇందన్‌పల్లి బీట్‌ల పరిధిలో ఇటీవల పట్టుబడిన సంఘటనలు చూస్తే స్మగ్లర్ల సంఖ్య కూడా పెరుగుతున్నట్లు తెలుస్తోంది. కల్లెడ బీట్‌లోని ఎర్రగుంటలో 20 రోజుల క్రితం రెండు ఎడ్లబండ్లు పట్టుకోగా.. గొడవకు దారి తీసి పోలీసు కేసు వరకు వెళ్లింది. ఇటీవల రూ.25వేలు విలువైన పది టేకు దుంగలు పట్టుకున్నారు. ఇందన్‌పల్లి రేంజ్‌లోని పలు ప్రాంతాల్లో టేకు చెట్లను నరికి వేసి దుంగలను అమ్ముకుంటున్నారు. టేకు విలువ పెరగడంతో ఇతర ప్రాంతాలకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.
ఓ ఉన్నతాధికారి తన సొంతానికి టేకు కలపతో ఫర్నిచర్ చేయించుకున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. పది రోజుల క్రితం రెండు టేకు దుంగలను సదరు అధికారి కింది స్థాయి అధికారులతో తెప్పించి ఫర్నిచర్ కోసం కోతకు ఇచ్చినట్లు తెలిసింది. కలప స్మగ్లింగ్ అరికట్టాల్సిన అధికారే ఇలాంటి పనిచేయడం చర్చనీయాంశంగా మారింది. కంచె చేను మేసిన చందంగా అధికారులు వ్యవహరిస్తే కలప అక్రమ రవాణాకు ఎలా అడ్డుకట్ట పడుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి కలప స్మగ్లింగ్‌ను అరికట్టాలని పలువురు కోరుతున్నారు.
స్మగ్లింగ్ తగ్గింది..
గతంతో పోలిస్తే ఇందన్‌పల్లి అడవుల్లో కలప స్మగ్లింగ్ తగ్గింది. ఒకట్రెండు సంఘటన తప్పా కలప రవాణా లేదు. ఎప్పటికప్పుడు సిబ్బందిని అప్రమత్తం చేశాం. రాత్రి సమయంలో పెట్రోలింగ్ చేస్తున్నాం. స్మగ్లింగ్ నిరోధానికి చర్యలు చేపడుతున్నాం.
- ప్రతాప్‌రెడ్డి, ఇందన్‌పల్లి రేంజ్ అధికారి