రైతులు టేకు చెట్లు అమ్ముకోవచ్చు
ఏపీ రాజధాని నిర్మాణం కోసం భూములిచ్చే రైతులు తమ భూముల్లో టేకుచెట్లు ఉంటే వాటిని అమ్ముకోవచ్చని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. రాజధాని భూసేకరణ అంశంపై ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు. ఇప్పటివరకు వారికి ఉన్న పంట రుణాలకు వన్ టైం సెటిల్మెంట్ చేస్తామని చెప్పారు. స్టాంపు, రిజిస్ట్రేషన్, నాలా ఫీజులన్నీ వన్ టైం సెటిల్మెంట్ చేస్తామన్నారు. ఈ ప్రాంతంలో మొత్తం 22వేల మంది రైతులు ఉన్నారని, వారందరికీ కూడా ఇదే పద్ధతి అనుసరిస్తామని అన్నారు. మెట్ట భూములకు ఏడాదికి ఎకరాకు రూ. 30 వేల వంతున ప్రతి ఏడాది చెల్లిస్తామని, దీనిపై ఏటా మూడేసి వేల వంతున పెంచుకుంటూ పోతామని అన్నారు. పదేళ్ల పాటు ఇలా చెల్లిస్తామని చంద్రబాబు చెప్పారు.
అలాగే జరీబు భూముల్లో అయితే ఎకరాకు ఏడాదికి రూ. 50 వేల వంతున ఇస్తామని, దీన్ని ప్రతియేటా 5వేల వంతున పెంచుకుంటూ పోతామని అన్నారు. రైతులు తమ భూమిని ప్రభుత్వానికి ఇచ్చిన వెంటనే చట్టబద్ధమైన రసీదు ఇస్తామని తెలిపారు. తర్వాత ల్యాండ్ పూలింగ్ ఓనర్ షిప్స్ ఇస్తామని, దీని తర్వాత భూముల అభివృద్ధి మొదలుపెడతామని చెప్పారు.