టిడ్కో ఇళ్లకు కేటాయించిన స్థలంలో మట్టి తవ్వకాలు జరుపుతున్న అక్రమార్కులు
మదనపల్లె(చిత్తూరు జిల్లా): మదనపల్లె మండలంలో మట్టి, గ్రావెల్ మాఫియా రెచ్చిపోతోంది. ప్రభుత్వ అనుమతి లేకుండా కొండలు, గుట్టలను పిండిచేస్తోంది. భారీ వాహనాలు పెట్టి పగలు, రాత్రి తేడా లేకుండా తరలిస్తోంది. ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టడంతో పాటు ప్రకృతివనరులను ధ్వంసం చేస్తోంది. ఈ వ్యవహారం మండలంలోని పోతబోలు, వెంకప్పకోట, బసినికొండ, కొత్తపల్లె, అంకిశెట్టిపల్లె, చీకలబైలు పంచాయతీల్లో సాగుతోంది. టిడ్కో గృహాలకు కేటాయించిన ప్రభుత్వస్థలాన్నీ యథేచ్ఛగా తవ్వేస్తుండడం విమర్శలకు తావిస్తోంది.
చదవండి: టీడీపీ సమావేశంలో రికార్డింగ్ డ్యాన్స్‌లు
గ్రామీణ ప్రాంతాల్లోని చెరువులు, గుట్టలు, ప్రభుత్వ స్థలాల్లోని మట్టి అక్రమార్కులకు వరంగా మారింది. ఎటువంటి అనుమతులు లేకుండా కొందరు టీడీపీ నేతలు ఇష్టానుసారం తవ్వి అమ్ముకుంటున్నారు. రెవెన్యూ అధికారులు సహకరిస్తుండడంతో వీరి దందా మూడు ట్రాక్టర్లు, ఆరు ట్రిప్పర్లుగా సాగుతోంది. వెంకప్పకోట పంచాయతీలో ప్రభుత్వం టిడ్కో ఇళ్ల నిర్మాణానికి సర్వే నం.72, 75, 74, 75, 90లో 40.68 ఎకరాల భూమిని కేటాయించింది.
ఇందులో ఇళ్ల నిర్మాణం చేస్తున్న ప్రాంతానికి ఎదురుగా ఉన్న స్థలంలో మట్టి అక్రమ తవ్వకాలు యథేచ్చగా సాగుతున్నాయి. పోతబోలు పంచాయతీ తురకపల్లె నమాజుకట్ట వద్ద ప్రభుత్వ స్థలంలో సర్వే నం.1312, 1314లో జేసీబీలతో మట్టిని తవ్వి టిప్పర్లు, ట్రాక్టర్లతో పట్టణంలోకి తరలిస్తున్నారు. ట్రాక్టర్ రూ.800–1,000 వరకు, టిప్పర్ మట్టిని రూ.4 వేలకు అమ్ముకుంటున్నారు. అక్రమదందా వెనుక స్థానిక వీఆర్వో నాగరాజ ప్రమేయం ఉన్నట్లు సమాచారం.
తహసీల్దార్‌తో వాగ్వాదానికి దిగిన టీడీపీ మాజీ ఎంపీటీసీ శ్రీనివాసులు, తదితరులు
మాఫియా డాన్‌గా టీడీపీ మాజీ ఎంపీటీసీ
మండలంలో గ్రావెల్ మాఫియాకు సంబంధించి పోతబోలు టీడీపీ మాజీ ఎంపీటీసీ సభ్యుడు శ్రీనివాసులు డాన్‌గా వ్యవహరిస్తున్నట్లు తెలిసింది. టీడీపీ హయాంలో అడ్డగోలుగా ఇసుక, మట్టి వ్యాపారాల్లో రాటుదేలి ఆర్థికంగా స్థిరపడిన అతను ట్రిప్పర్లు, ట్రాక్టర్లు కొనుగోలు చేసి స్నేహితులతో కలిసి అక్రమదందా సాగిస్తున్నట్టు సమాచారం. శనివారం పోతబోలు తురకపల్లె వద్ద తహసీల్దార్ సీకే.శ్రీనివాసులు జరిపిన దాడుల్లో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడడమే కాకుండా తాను చేస్తోంది సక్రమమేనని వాదనలకు దిగడం కొసమెరుపు. గతంలో ఇతనిపై మదనపల్లె రూరల్ పోలీస్ స్టేషన్‌లో పదికిపైగా కేసులు ఉండడం గమనార్హం.
ఎలాంటి అనుమతులు లేవు
మండలంలో మట్టి, గ్రావెల్ తవ్వకాలకు ఎలాంటి అనుమతులు లేవు. టిప్పర్, ట్రాక్టర్ యజమానులు ముఠా గా ఏర్పడి మట్టి తవ్వకాలు చేస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. దాడుల్లో పట్టుబడిన వాహనాలను సీజ్‌చేసి కేసు నమోదుచేశాం.
–సీకే.శ్రీనివాసులు, తహసీల్దార్, మదనపల్లె
నమాజ్ కట్టవద్ద
♦మదనపల్లె మండలం, పాతబోలు పంచాయతీ, తురకపల్లె నమాజ్ కట్ట వద్ద ఉన్న ప్రభుత్వ స్థలం : 20 ఎకరాలు
♦అక్రమార్కులు తవ్వేసిన విస్తీర్ణం :
సుమారు 5 ఎకరాల్లో
♦ఎన్ని రోజులుగా సాగుతోంది?: నెల రోజులుగా
♦రోజుకు అక్రమంగా తరలుతున్న ట్రిప్పర్లు: 40పైనే
♦గ్రావెల్ తరలించి కొల్లగొట్టిన సొమ్ము: రూ.45 లక్షలపైనే
వెంకటప్ప పంచాయతీలో..
♦టిడ్కో ఇళ్లకు కేటాయించిన స్థలం: 40.68 ఎకరాలు
♦రోజుకు అక్రమంగా తరలుతున్న గ్రావెల్ : 20 ట్రిప్పర్లు
♦తవ్వేసిన విస్తీర్ణం : మూడెకరాల్లో
♦ఎన్నిరోజులుగా సాగుతోంది: వారం రోజులుగా
♦కొల్లగొట్టిన సొమ్ము : రూ.5 లక్షలపైనే
ఈ రెండు ప్రాంతాల్లోనే ఇంత పెద్ద ఎత్తున దోపిడీ జరుగుతుంటే.. ఇక మండలంలో పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఏడాది కాలంగా కోట్ల రూపాయల గ్రావెల్‌ను అక్రమార్కులు తరలించి సొమ్ముచేసుకున్నట్టు స్పష్టమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment