మట్టి..గ్రావెల్ మాఫియా
-
యథేచ్ఛగా తమిళనాడుకు తరలింపు
-
విచ్చలవిడిగా తెలుగు తమ్ముళ్ల వ్యాపారం
సూళ్లూరుపేట : తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చా ఆ పార్టీ నేతలు అలీబాబా 40 దొంగల్లా మారారు. సంపాదనకు ఉన్న ఏ అవకాశాన్ని వదులుకోవడం లేదు. చెరువుల్లో మట్టి.. రిజర్వ్ ఫారెస్ట్‌లోని కొల్లగొట్టే మాఫియాగా మారారు. అడ్డుకోవాల్సిన అధికారులు అధికార పార్టీ నేతలను చూస్తే వణికిపోతున్నారు. విచ్చలవిడిగా తెలుగు తమ్ముళ్లు కోట్ల రూపాయల వ్యాపారం చేస్తూ జేబులు నింపుకుంటున్నా.. అధికారులు మాత్రం నిస్సాహాయస్థితిలో ఉన్నారు. నీరు–చెట్టు పథకంలో తీసిన మట్టిని రియల్ ఎస్టేట్ల వెంచర్లకు తోలుకుని రెండు వైపులా సొమ్ము చేసుకుంటున్నారు. సూళ్లూరుపేట, తడ మండలాల్లో చెరువుల్లో మట్టి తవ్వేసి చెరువులను సర్వనాశనం చేస్తున్నారు. ఈ ప్రాంతంలో మట్టి, గ్రావెల్‌ను పగలూ, రాత్రి తేడా లేకుండా తరలించడం చూస్తుంటే జాతరలా ఉంది పరిస్థితి. సూళ్లూరుపేట మున్సిపాలిటీ పరిధిలోని పాముల కాలువ పరివాహక ప్రాంతంలో ఏర్పాటు చేయబోతున్న టెక్స్‌టైల్ పార్కుకు తడ మండలంలోని కాదలూరు పెద్ద చెరువు, కొండూరు సోమయాజులు చెరువు, కాశింఖాన్‌కండ్రిగ చెరువు, చేనిగుంట వడగనేరి చెరువు, తడకండ్రిగ చెరువు, వెండ్లూరుపాడు చెరువు, సూళ్లూరుపేట మండలంలో ఇలుపూరు, మంగళంపాడు చెరువుల్లో ఇబ్బడి ముబ్బడిగా మట్టిని తరలిస్తున్నారు. ఆయా చెరువుల్లో మట్టి తీసేందుకు సాక్షాత్తూ ముఖ్యమంత్రి పేషీ నుంచి అనుమతులు తీసుకోవడంతో స్థానిక అధికారులెవరూ ఆపే ప్రయత్నాలు చేయలేకపోతున్నారు. ‘ ఊరు మనదే దోచేయ్’ అనే రీతిలో ఆ పార్టీ నేతల పరిస్థితి ఉంది. జిల్లా కలెక్టర్‌గా పనిచేసి బదిలీపై వెళ్లిన ఎం.జానకి ఇచ్చిన అనుమతిలో చెరువుల్లో పద్ధతి ప్రకారం రెండు నుంచి నాలుగు అడుగుల లోతులో చెరువు అంతా మట్టి తీయాలని ఆదేశాలిచ్చారు. అలా కాకుండా చెరువుల్లో ఎక్కడ పడితే అక్కడే పెద్ద పెద్ద బావులను తలపించేలా తవ్వేస్తున్నారు. భవిష్యత్‌లో వానలు తక్కువగా కురిస్తే గుంతల్లోనే నీళ్లు చేరిపోయి తూములు వరకు వచ్చే పరిస్థితులు లేవని రైతులు అందోళన చెందుతున్నారు.
రిజర్వు ఫారెస్ట్‌లో గ్రావెల్ అక్రమ రవాణా
చెరువుల్లో మట్టి దోపిడీ చేయడంతో పాటు తడ మండలం మాంబట్టు సమీపంలోని నెల్లూరు–చిత్తూరు జిల్లాల సరిహద్దుల్లోని రిజర్వ్ ఫారెస్ట్‌లో గ్రావెల్‌ను తమిళనాడుకు అక్రమంగా యథేచ్ఛగా తరలించేస్తున్నారు. చిత్తూరు జిల్లా వరదయ్యపాళెం మండలం కారిపాకంలో నిరుపేద దళితులకు ఇచ్చిన రిజర్వ్ ఫారెస్ట్ భూములను చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్ గారే వచ్చి నెల్లూరు జిల్లాకు చెందిన అధికార పార్టీకి చెందిన నేతలకు అప్పగించారు. దీంతో వీళ్లు మరో ఓబులాపురం గనుల తరహాలో అయిదారు హిటాచీలు పెట్టి వందలాది టిప్పుర్లతో తమిళనాడుకు గ్రావెల్‌ను తరలించేస్తున్నారు. మాంబట్టు సెజ్‌లోని ఆపాచీ కంపెనీ, భారత్ లెదర్ కంపెనీ మధ్యలో డొంకదారిని వెడల్పు చేసి అటవీ శాఖ భూముల్లో రోడ్డు ఏర్పాటు చేసుకుని గ్రావెల్‌ను పగలు రాత్రి తేడా లేకుండా తరలించేస్తున్నారు. అటవీ ప్రాంతమంతా ఓబులాపురం గనుల తరహాలో సుమారు ఒక తాటిమాను మునిగిపోయేంత లోతుగా తవ్వేసి తరలిస్తున్నా.. పట్టించుకునే నాథుడే లేకుండా పోయారు. ప్రస్తుతం సూళ్లూరుపేట, తడ ప్రాంతంలో హైవే మీద వెళ్లాలంటేనే టిప్పర్లు స్పీడ్‌కు భయపడిపోతున్నారు.