సంక్రాంతి సందట్లో టీడీపీ బ్యాచ్ బరితెగింపు
మైనింగ్, పోలీసు అధికారులకు ఫిర్యాదు చేసినా పచ్చమూక స్వైరవిహారం
బీటెక్ రవి ప్రోద్బలంతోనే 20 లారీల నిల్వలు దోపిడీ
న్యాయపోరాటం చేస్తామన్న కంపెనీ ప్రతినిధి
సాక్షి ప్రతినిధి, కడప : అందరూ సంక్రాంతి సంబరాల్లో జోరుగా హుషారుగా మునిగితేలుతుంటే తెలుగుదేశం తమ్ముళ్లు ఇదే అదనుగా దోపిడీకి తెగబడ్డారు. సందట్లో సడేమియాలా రూ.12 కోట్ల విలువైన ఖనిజాన్ని కొల్లగొట్టారు. వెలికితీసి నిల్వ ఉంచిన బెరైటీస్‌ను లూటీ చేసేశారు. ప్రమాదాన్ని ముందే పసిగట్టిన మైనింగ్ లీజుదారులు అధికారులకు విన్నవించినా ఉపయోగంలేకుండా పోయింది.
వైఎస్సార్ జిల్లా వేముల మండల కేంద్రంలో పులివెందుల టీడీపీ తమ్ముళ్లు రాత్రికి రాత్రే ఈ దోపిడీకి బరితెగించారు. వివరాలివీ..వేముల గనుల్లో వెలికితీసిన బెరైటీస్ ఖనిజాన్ని నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) నుంచి వేలంలో టిఫిన్ బెరైటీస్ ఆస్‌బెస్టాస్ ప్రైవేట్ లిమిటెడ్ కొనుగోలు చేసింది. ఈ కంపెనీ ప్రాంగణంలో దాదాపు 3,500 టన్నులు నిల్వలు అధికారికంగా ఉన్నాయి. ఈ స్టాకుపై తెలుగు తమ్ముళ్ల కన్నుపడింది.
అక్రమ మైనింగ్ చేస్తే కొంతమేరే అక్రమ ఆదాయం వస్తుంది.. అదే రాత్రికి రాత్రే నిల్వ ఉన్న ఈ ఖనిజాన్ని కొల్లగొడితే దెబ్బకు ఒకేసారి భారీగా లబ్ధిపొందవచ్చని వారు భావించారు. అంతే.. సుమారు 3వేల టన్నుల బెరైటీస్‌ను ఉన్నపళంగా తరలించేశారు. మరోవైపు.. తెలుగుదేశం నేతలు తమ కంపెనీ ప్రాంగణంలోకి అక్రమంగా చొరబాట్లకు పాల్పడుతున్నారని.. పైగా అక్రమ మైనింగ్‌కూ పాల్పడుతున్నారని అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా నిరుపయోగమే అయ్యిందని ఆ సంస్థ ప్రతినిధి వాపోయారు.
సుమారు రూ.12 కోట్ల విలువైన ఖనిజాన్ని 20 లారీల ద్వారా తెల్లవారేలోపే వివిధ ప్రాంతాలకు తరలించేశారని.. వారి పన్నాగాన్ని పసిగట్టి అటు మైనింగ్ అధికారులకు ఇటు పోలీసు అధికారులకు ఫిర్యాదు చేసినా వారు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంతో లూటీకి ఆస్కారం ఏర్పడిందని వారు ఆరోపిస్తున్నారు.
బీటెక్ రవి ప్రోద్బలంతోనే..
ఇదిలా ఉంటే.. టిఫిన్ కంపెనీకి చెందిన దాదాపు 3 వేల టన్నుల బెరైటీస్‌ను అక్రమంగా రాత్రికి రాత్రే తరలించుకుపోవడం వెనుక పులివెందుల టీడీపీ ఇన్‌చార్జి బీటెక్ రవి ఉన్నారని.. ఆయన ప్రోద్బలంవల్లే ఇది సాధ్యమైందని ఆ కంపెనీ ఏజెంట్, వైఎస్సార్‌సీపీ నేత వేల్పుల రామలింగారెడ్డి (వేల్పుల రాము) మీడియాకు వెల్లడించారు.
అలాగే, వేముల మండల టీడీపీ నేతలు పార్థసారథిరెడ్డి, మబ్బుచింతలపల్లె శ్రీనాథ్రెడ్డిల ప్రత్యక్ష ప్రమేయంతో పెద్దపెద్ద యంత్రాల ద్వారా లోడింగ్ చేస్తూ దాదాపు 20 లారీల బెరైటీస్‌ను తెల్లవారేలోపు కడపలోని పవన్, డైమండ్, జకరయ్య మినరల్స్‌కు తరలించారన్నారు. మరికొంత స్టాకు వేములలోని రామిరెడ్డితోటకు, పేర్ల పార్థసారథిరెడ్డి ఇంటి దగ్గర నిల్వ ఉంచారని తెలిపారు.
నిజానికి.. కూటమి ప్రభుత్వం వచ్చాక కంపెనీ ప్రతినిధిని అయిన తనను అనేక విధాలుగా లొంగదీసుకునేందుకు ప్రయత్నించారని.. కుదరకపోవడంతో చివరికి హత్యాయత్నానికి కూడా తెగబడ్డారన్నారు. వారి బెదిరింపులకు భయపడకుండా వీరి గురించి అధికారులతో పాటు చివరికి ఎస్పీ హర్షవర్థన్‌రాజుకు సైతం స్వయంగా ఫిర్యాదు చేశానన్నారు. ఎన్సీఎల్టీ ద్వారా కొనుగోలు చేసిన ఈ స్టాకుపైన హైకోర్టు స్టేటస్‌కో ఉత్తర్వులున్నా టీడీపీ నేతలు కొల్లగొట్టుకుపోయారని వారికి తెలిపానన్నారు.
అవసరమైతే పోలీసు పికెట్ ఏర్పాటుచేయాలని డీఎస్పీ, ఎస్‌ఐలను ఆదేశించారనన్నారు. అయినా.. సంక్రాంతి రోజున రాత్రికి రాత్రే మాయంచేశారని వేల్పుల రామలింగారెడ్డి వాపోయారు. ఈ విషయంలో తాము న్యాయపోరాటం చేస్తామని ఆయన చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment