అతడే ఓ మాఫియా | He was a Mafia | Sakshi
Sakshi News home page

అతడే ఓ మాఫియా

Published Sat, Oct 18 2014 3:11 AM | Last Updated on Fri, Aug 10 2018 5:38 PM

అతడే ఓ మాఫియా - Sakshi

అతడే ఓ మాఫియా

ఇసుక, గ్రావెల్ కావాలంటే ఎప్పుడైనా రెడీ
నిర్భీతిగా తవ్వకాలు.. యథేచ్ఛగా అమ్మకాలు
అనుమతుల్లేవ్.. అడ్డుకునే వారూ లేరు
అధికార పార్టీ నేత బహిరంగ వ్యాపారం
సాక్షి ప్రతినిధి, ఏలూరు : ఇసుక కోసం మీ సేవా కేంద్రాల వద్ద బారెడు క్యూలో నిలబడాల్సి వస్తోందా.. సొమ్ముకట్టినా సరుకు రాక విసుగెత్తిపోతున్నారా.. అయితే పెదవేగి మండలంలోని తెలుగుదేశం పార్టీ నేత వద్దకు వెళ్లి సొమ్ము చెల్లిస్తే చాలు. ఎంతకావాలంటే అంత సరుకును వెంటనే ఇచ్చేస్తారు. ఇసుక.. మట్టి.. గ్రావెల్.. ఏది కావాలంటే అది క్షణాల్లోనే పంపిస్తారు. అధికార పార్టీ నేతకు దీంతో సంబంధం ఏమిటనుకుంటున్నారా. అడ్డగోలు ఆదాయ మార్గాల అన్వేషణలో ఉన్న సదరు నేత ప్రస్తుతానికి తెల్ల బంగారంగా పేరొం దిన ఇసుక తవ్వకాల పనిలో నిమగ్నమయ్యూరు. దెందులూరు నియోజకవర్గ పరిధిలో ఉన్న తమ్మిలేరు వాగు నుంచి ఇసుకను తవ్వేస్తున్నారు. మట్టిని కొల్లగొట్టేస్తున్నారు. చివరకు పోలవరం కాలువ తవ్వగా వచ్చిన గ్రావెల్ గుట్టలనూ మింగేస్తున్నారు. పగలు, రాత్రి తేడా లేకుండా ఇష్టారాజ్యంగా తవ్వకాలు సాగిస్తున్నా అధికారులు మాత్రం సదరు నేత జోలికి వెళ్లి ఇదేమిటని అడిగే సాహసం చేయలేకపోతున్నారు.
 
ఎక్కడెక్కడ నుంచి..
పెదవేగి మండలం విజయరాయి సమీపంలోని తమ్మిలేరు వాగు నుంచి ఇసుక, నడిపిల్లి అడ్డరోడ్డు దాటిన తర్వాత నక్కవారిగూడెంలోని వాగు నుంచి, జానంపేట గ్రామం దాటిన తర్వాత  తమ్మిలేరు వాగు నుంచి ఇసుక, విజయా గార్డెన్స్ వెనుక వైపున పోలవరం కాలువ గట్టు నుంచి గ్రావెల్,  పినకడిమి నుంచి గ్రావెల్, బి.శింగవరం వద్దనున్న తమ్మిలేరు వాగు నుంచి ఇసుక, వంగూరు లక్ష్మీపురం పోలవ రం కాలువ గట్టు నుంచి గ్రావెల్‌ను జేసీబీలు, పొక్లెయిన్లతో తవ్వేస్తున్నారు. సుమారు రోజుకు 100 ట్రాక్టర్ల ఇసుక, వందలాది లారీల గ్రావెల్ తరలిస్తున్నారంటే ఆయా ప్రాంతాల్లో ఏ మేరకు తవ్వకాలు సాగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు.
 
ధరలు ఇలా..
ట్రాక్టర్ ఇసుక రూ.3 వేలకు, లారీ గ్రావెల్ రూ.2 వేలకు బహిరంగంగానే విక్రరుుస్తున్నారు. ఏలూరు ఆటోనగర్ వద్ద లెవెలింగ్ పనులు చేపట్టిన నిర్మాణ సంస్థల ప్రతినిధులు ఇసుక, మట్టి కొరత తీవ్రంగా ఉండటంతో అడిగినంత ధర ఇచ్చి ఆ నాయకుడి నుంచి వాటిని కొనుగోలు చేస్తున్నారు. ఇలా నిత్యకల్యాణం పచ్చతోరణం మాదిరిగా ఇసుక, గ్రావెల్ తవ్వకాలు, అమ్మకాలతో సదరు నేత కోట్లాది రూపాయలు దండుకుంటున్నారని అంటున్నారు. ఇంత జరుగుతున్నా మైనింగ్ అధికారులు గాని, రెవెన్యూ అధికారులు గాని అటువైపు కన్నెత్తి చూసే సాహసం చేయలేకపోతున్నారు. సాధారణంగానే అధికారులపై చీటికీ మాటికీ నోరేసుకు పడిపోయే ఆ అధికార పార్టీ నేత జోలికి వెళ్తే ఇంకేమైనా ఉందా.. అంటూ సంబంధిత శాఖల అధికారులు హడలెత్తిపోతున్నారు.              కనీసం జిల్లాస్థాయి ఉన్నతాధికారులైనా స్పందించి సదరు నేత ఆగడాలకు అడ్డుకట్ట వేసి ఇసుక, గ్రావెల్ అక్రమ తవ్వకాలను అడ్డుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement