ఇసుకాయ స్వాహా
ఇసుకాయ స్వాహా
Published Sun, Nov 6 2016 12:13 AM | Last Updated on Mon, Oct 8 2018 4:18 PM
ఉచితం ముసుగులో దోపిడీ
పోలవరం ర్యాంపులో ఎడాపెడా తవ్వకాలు
టీడీపీ నేతల ఆగడాలు
పోలవరం రూరల్ : అనుమతులతో పనిలేదు. అడ్డగించే నాథుడూ లేడు. ఇసుక ర్యాంపుల్లో అధికార పార్టీ నేతలు అడిందే ఆట.. పాడిందే పాట అన్నట్టుగా యథేచ్ఛగా తవ్వకాలు సాగిపోతున్నాయి. అనుమతి లేకపోయినా ఉచిత ఇసుక పేరిట యంత్రాల సాయంతో పెద్దఎత్తున ఇసుక తవ్వుతూ లారీలు, ట్రాక్టర్లపై తరలిస్తున్నారు. ఖాళీ స్థలాల్లో నిల్వ ఉంచి అమ్ముకుంటున్నారు. పోలవరంలోని ఆంజనేయస్వామి ఆలయం వద్ద గల ర్యాంపులో రెండు రోజులుగా ఇసుక తవ్వకాలు ఊపందుకున్నాయి. ఇక్కడ ఇసుక తవ్వకానికి ఎలాంటి అనుమతులు లేకపోయినా నియోజకవర్గ టీడీపీ నేత అండదండలతో ఆయన అనుచరులు యం త్రాలను ఉపయోగించి తవ్వకాలు జరిపిస్తున్నారు. రాత్రికి రాత్రి బయటి ప్రాంతాలకు తరలించి అక్కడ అమ్మకాలు సాగిస్తున్నారు.
కూలీలను అడ్డుకుని మరీ..
శనివారం ఉదయం కూలీలు ఇసుకను లోడ్ చేసేందుకు వెళ్లగా టీడీపీ నాయకులు అడ్డుకున్నారు. ఇసుక ర్యాంపులో రోడ్డు నిర్మిస్తున్నామని, మెషి¯ŒSతో ఇసుకను తవ్వి వాహనాల్లో తరలిస్తామని చెప్పుకొచ్చారు. తమకు ఏ పనులూ లేకపోవడంతో ఇసుకను ఎడ్లబండ్లపై లోడ్ చేసి ఉపాధి పొందుతున్నామని, తమకు ఆ అవకాశం లేకుండా చేయొద్దని వేడుకున్నారు. అయినా టీడీపీ నేతలు పట్టించుకోలేదు. కూలీలను ఆ ర్యాంపులోకి అడుగు పెట్టొద్దంటూ హుకుం జారీ చేశారు. దీంతో టీడీపీ నేతలకు, కూలీలకు మధ్య వాగ్వివాదం జరిగింది. అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని కూలీలు వాపోయారు. ఇసుక తవ్వే పనులు కల్పించాలని డిమాండ్ చేశారు.
ప్రమాదకరంగా రేవు
గతంలో ఉచిత ఇసుక పేరుతో ఈ ర్యాంపు నుంచి అక్రమంగా ఇసుక తవ్వడం వల్ల పెద్దపెద్ద గోతులు ఏర్పడ్డాయి. ఇటీవల వచ్చిన వరదలకు కొంతవరకు పూడినా, ఇప్పటికీ రేవులు ప్రమాదకరంగానే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మళ్లీ ఇసుక తవ్వకాలు చేపట్టడంతో ఇక్కడి రేవు మరింత ప్రమాదకరంగా మారుతోంది.
తవ్వకాలకు అనుమతులు లేవు
పోలవరంలోని ఆంజనేయస్వామి గుడి ర్యాంపు నుంచి ఇసుక తవ్వకాలకు ఏ విధమైన అనుమతులు లేవు. అక్కడ ఎవరూ ఇసుక తవ్వకూడదు. కొందరు ఇసుకు తవ్వుతున్నట్టు నా దృష్టికి వచ్చింది. ఈ విషయమై తహసీల్దార్‌తో మాట్లాడాం. సంబంధిత శాఖల అధికారులతో కలిసి రెండు రోజుల్లో ర్యాంపును పరిశీలిస్తాం.
– పి.మోహనరావు, ఏడీ, గనుల శాఖ
Advertisement
Advertisement