యనమల ఆధిపత్యాన్ని సహించని మంత్రి | ayyanna patrudu vs yanamala ramakrishunudu | Sakshi
Sakshi News home page

యనమల ఆధిపత్యాన్ని సహించని మంత్రి

Published Wed, Mar 2 2016 11:43 PM | Last Updated on Fri, Aug 10 2018 8:16 PM

యనమల ఆధిపత్యాన్ని సహించని మంత్రి - Sakshi

యనమల ఆధిపత్యాన్ని సహించని మంత్రి

అయ్యన్న అడ్డుచక్రం!
యనమల ఆధిపత్యాన్ని సహించని జిల్లా మంత్రి
సమావేశాలే నిర్వహించని ఇన్‌చార్జి మంత్రి
ఇసుక దందా, అధికారుల బదిలీల్లో ఆధిపత్య పోరే కారణం
 

ఒకరేమో జిల్లా మంత్రి... మరొకరు జిల్లా ఇన్‌చార్జి మంత్రి... ఇద్దరూ టీడీపీలో అత్యంత సీనియర్లే... ఎన్టీఆర్, చంద్రబాబు కేబినెట్లలో కలసి పనిచేసినవారే. పైగా ఇరుగుపొరుగు జిల్లాలవారే. అయితే మాత్రం ...! ‘ఎక్కడైనా బావగానీ.. వంగ తోట కాడ కాదు’ అన్నట్లుగా తయారైంది వారి పరిస్థితి.  జిల్లాపై పెత్తనం చెలాయించాలని ఇన్‌చార్జి మంత్రి చూస్తుంటే... అసలు మీ పెత్తనం ఏమిటని జిల్లా మంత్రి అడ్డుపడుతున్నారు. ఎందుకంటే అటు ఇన్‌చార్జి మంత్రి, ఇటు జిల్లా మంత్రి ఇద్దరూ కన్నేసింది ఒకే వ్యవహారంపై. అక్రమంగా కోట్లు కురిపిస్తున్న ఇసుక దందాతోపాటు ఉన్నతాధికారుల నియామక వ్యవహారం మీద ఇద్దరూ తమ మాటే చెల్లాలని పట్టుబడుతున్నారు. ఈ వ్యవహారం ఎంతవరకు వెళ్లిదంటే.. ఇన్‌చార్జి మంత్రిగా నియమితుడై ఏడాది గడుస్తున్నా ఇంతవరకు జిల్లాలో ఒక్క అధికారిక సమావేశం కూడా ఏర్పాటు చేయకుండా అతన్ని కట్టడి చేశారు.  వీరిలో ఒకరు జిల్లా మంత్రి అయ్యన్నపాత్రుడు కాగా..  మరొకరు ఇన్‌చార్జి మంత్రి యనమల రామకృష్ణుడు. వీరిద్దరి ఆధిపత్య పోరుకు వేదిక.. విశాఖ జిల్లా..
 
విశాఖపట్నం:  విశాఖ, తూర్పుగోదావరి జిల్లాల సరిహద్దుల్లో ఉన్న ఇసుక ర్యాంపుల వ్యవహారం మంత్రులు అయ్యన్న, యనమల మధ్య చిచ్చుపెట్టింది. మంత్రి యనమల కుటుంబ సభ్యులు జిల్లా సరిహద్దు దాటి విశాఖ జిల్లాలోకి వచ్చి మరీ భారీగా ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారు. మరో మాటలో చెప్పాలంటే పాయకారావుపేట నియోజకవర్గంలో ఇసుక దందాపై యనమల కుటుంబ సభ్యుల ఆధిపత్యమే కొనసాగుతోంది. వీరి పెత్తనమేమిటంటూ జిల్లా మంత్రి అయ్యన్నపాత్రుడు కొంతకాలంగా గుర్రుగా ఉన్నారు. వారి దందాను అడ్డుకుని ఆధిపత్యం సాధించేందుకు రంగంలోకి దిగారు. ఈ నేపథ్యంలో ఇద్దరు మంత్రుల మధ్య చిన్నగా విభేదాలు ప్రారంబమయ్యాయి.
 అంతలోనే ఏడాది క్రితం  విశాఖ జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా యనమల రామకృష్ణుడును సీఎం నియమించారు. ఇది అయ్యన్నకు ఏమాత్రం రుచించలేదు. మరోవైపు యనమల కూడా దూకుడుగా వ్యవహరించి జిల్లా వ్యవహారాలను గుప్పిట్లో పెట్టుకోవాలని భావించారు. జిల్లాలో ఉన్నతాధికారుల నియామకంలో యనమల కల్పించుకోవడాన్ని కూడా అయ్యన్న సమ్మతించలేదు. జిల్లాలో వివాదాస్పదమైన ఆర్డీవో, డీఆర్వో నియామకాల్లో మంత్రి యనమల తనదైన పంథాలో వ్యవహరించడాన్ని అయ్యన్న అడ్డుకున్నారు. తాజాగా తాండవ నదిలో ఇసుక ర్యాంపులు దక్కించుకునేందుకు మంత్రులు పోటీపడుతున్నారు. అందుకోసం పంతాలకు పోతున్నారు.
 
అడుగడుగునా అడ్డుకట్ట
ఈ నేపథ్యంలో విశాఖ జిల్లాపై పట్టు సాధించేందుకు యనమలకు ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదని అయ్యన్న పాత్రుడు భీష్మించుకున్నారు. అందుకే జిల్లాలో యనమల ఇంతవరకు ఎలాంటి అధికారిక సమావేశాన్ని నిర్వహించలేకపోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. జిల్లా డీఆర్సీ సమావేశంతోపాటు అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షా సమావేశాలను నిర్వహించాలని యనమల భావించారు. ఈ విషయాన్ని జిల్లా అధికార యంత్రాంగం ద్వారా అయ్యన్నకు తెలియజేశారు. దీనిపై ఆయనసానుకూలంగా స్పందించలేదని తెలుస్తోంది. ‘ఇప్పుడేమీ సమావేశాలు వద్దు. తరువాత నేను చెబుతా’ అని ముక్తసరిగా తేల్చేశారు. దాంతో ఇన్‌చార్జి మంత్రిగా నియమితుడై ఏడాది గడుస్తున్నా యనమల రామకృష్ణుడు ఇంతవరకు జిల్లాలో అధికారికంగా ఎలాంటి సమావేశాన్ని నిర్వహించలేకపోయారు. సీఎం చంద్రబాబు వస్తే ఆ పర్యటనలో పాల్గొనడం మినహా అధికారికంగా విధులు నిర్వర్తించలేకపోతున్నారనే అధికారవర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ‘నా పుట్టలో వేలు పెడితే కుట్టనా’ అన్నట్లుగా మంత్రి అయ్యన్న వ్యవహరిస్తున్నారు.
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement