ఇసుక భోక్తలు..! | sand mafia | Sakshi
Sakshi News home page

ఇసుక భోక్తలు..!

Published Wed, Feb 8 2017 11:58 PM | Last Updated on Tue, Aug 21 2018 5:51 PM

ఇసుక భోక్తలు..! - Sakshi

ఇసుక భోక్తలు..!

- ముఖ్యనేత అనుచరుడి మాఫియా
- సహకారం అందిస్తున్న కొందరు పోలీసులు
- రెండు గ్రామాల మధ్య తలెత్తిన గొడవలు
- కోర్టును ఆశ్రయించిన రైతులు
 
కోడుమూరు: అధికార పార్టీ ముఖ్యనేతల అనుచురుడు.. ఇసుక మాఫియా అవతారమెత్తాడు. అతనికి కొందరు పోలీసులు సహకారం అందిస్తున్నారు. కోడుమూరు మండలంలోని వర్కూరు, ముడుమలగుర్తి, కృష్ణాపురం, గోరంట్ల, లద్దగిరి, అనుగొండ గ్రామాల వరకు దాదాపు 30 కిలోమీటర్ల మేర హంద్రీనది విస్తరించి ఉంది. ఇటీవల ప్రభుత్వం ఇసుక రవాణాపై నిషేధం ఎత్తివేయడంతో కృష్ణగిరి మండలం రామకృష్ణాపురానికి చెందిన టీడీపీ నాయకుడు అక్రమ రవాణాకు తెరతీశాడు. అధికార పార్టీ ముఖ్యనేతలకు ఇతను దగ్గరి అనుచరుడు కావడంతో ఆ నాయకుడి ఇసుక ట్రాక్టర్లను పట్టుకోవడానికి పోలీసులు జంకుతున్నారు. దీంతో గోరంట్ల, మన్నెగుంట గ్రామాల సరిహద్దుల్లో ఉన్న ఇసుకను ట్రాక్టర్ల ద్వారా తీసుకుపోయి రామకృష్ణాపురం గ్రామ పొలాల్లో డంప్‌  చేసి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. 
 
హైకోర్టును ఆశ్రయించిన రైతులు
నెల మామూళ్లు ఇచ్చిన వారిని పోలీసులు వదిలేస్తున్నట్లు.. మామూళ్లు ఇవ్వని ట్రాక్టర్లపై  నిఘా వేసి వేధింపులకు గురి చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కృష్ణగిరి మండలం మన్నెగుంట, హెచ్‌.ఎర్రగుడి,  కోడుమూరు మండలం గోరంట్ల గ్రామానికి చెందిన రైతులు హైకోర్టును ఆశ్రయించారు. వ్యాపారులు..హంద్రీలో 20 అడుగుల లోతు వరకు ఇసుకను తవ్వేసి అమ్ముకుంటున్నారని, భూగర్భజలాలు ఇంకిపోయి పంట పొలాలు ఎండిపోతున్నాయని రైతులు.. హైకోర్టుకు విన్నవించుకున్నారు. తాజాగా హైకోర్టు అక్షింతల నేపథ్యంలో ఖాళీ ట్రాక్టర్లను తీసుకొచ్చి కేసులు నమోదు చేద్దామనే ఆలోచనలో అధికారులు ఉన్నట్టు తెలుస్తోంది.
 
ముదురుతున్న వివాదం..
 కృష్ణగిరి మండలం ఎర్రబాడు గ్రామానికి చెందిన ట్రాక్టర్‌ యజమానులను కోడుమూరు మండలం ముడుమలగుర్తి గ్రామానికి చెందిన రైతులు అడ్డుకున్నారు. దీంతో రెండు గ్రామాల మధ్య వివాదం నెలకొంది. గోరంట్ల గ్రామంలో విచ్చలవిడిగా ఇసుక తరలిపోతుంటే భూగర్భజలాలు ఇంకిపోతున్నాయని సర్పంచు పరమేశ్వరనాయుడు 20రోజుల పాటు ఆ గ్రామానికి నీళ్లు నిలుపుదల చేశారు. ఈఓఆర్డీ రామకృష్ణ హంద్రీలో పర్యటించి దాదాపు 20 ట్రాక్టర్లను పోలీస్‌స్టేషన్‌కు అప్పగించారు. అయితే తమకేమి సంబంధం లేదంటూ కనీసం అపరాధరుసుం వసూలు చేయకుండా టీడీపీ నేతల ఒత్తిళ్లకు లొంగి ట్రాక్టర్లను పోలీసులు వదిలేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
 
పట్టించుకోని పోలీసులు..
వర్కూరు నుంచి కర్నూలుకు రోజూ 30 నుంచి40 ట్రాక్టర్ల ఇసుక రవాణా అవుతోంది. గాజులదిన్నె ప్రాజెక్టు వైస్‌ చైర్మన్‌ కేఈ.మల్లికార్జునగౌడ్‌ 20 ట్రాక్టర్లను పట్టుకొని పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చినా పోలీసులు పట్టించుకోలేదు. ఈయన అధికారపార్టీ నేత అయినప్పటికీ.. వారిలో ఉన్న అభిప్రాయ భేదాలతో ఈయన ముందుకు వచ్చి అక్రమ ఇసుక ట్రాక్టర్లను పట్టించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. వెల్దుర్తి గ్రామానికి చెందిన కొందరు వ్యాపారస్తులు నెల మామూళ్లు ఇవ్వకుండా ఇసుక రవాణా చేస్తుండగా, నెలన్నర క్రితం ఓవర్‌లోడ్‌ కేసులు నమోదు చేసి ట్రాక్టర్‌ యాజమానులు పోలీసులు తీవ్ర వేధింపులకు గురి చేశారు. వర్కూరులో కోడుమూరు నియోజకవర్గ అధికారపార్టీ నేత అనుచరులు ఒక ట్రాక్టర్‌ ఇసుకకు రూ.1000ల నుంచి రూ1500లు వసూలు చేస్తున్నారు. రోజు 100నుంచి 200ట్రాక్టర్ల వరకు ఇసుకను అమ్ముకుంటున్నారు. ఇదేమిటని ప్రశ్నిస్తే తమ పొలాల్లోని ఇసుకను అమ్ముకుంటున్నామని సదరు నేత అనుచరులు దబాయిస్తున్నారు.
 
అధికారుల హడావుడి
 కోడుమూరు మండలంలో 30కిలోమీటర్ల మేర విస్తరించివున్న హంద్రీనదిలో అక్రమ ఇసుక రవాణాను అడ్డుకొనే నాథుడే కరువయ్యాడు. అడ్డుకోవాల్సిన పోలీస్‌ అధికారులు నిమ్మకు నీరేత్తినట్లుగా వ్యవహారిస్తున్నారనే ఆరోపణలు మిన్నంటుతున్నాయి. ఫలితంగా జిల్లావ్యాప్తంగా అక్రమ ఇసుక రవాణా పెరిగిపోతుంది. ఈనెల 1వతేదీన మైనింగ్‌ ఏడీ వెంకటరెడ్డి బృందం కోడుమూరు మండలంలోని హంద్రీనదిపై పర్యటించి అక్రమ ఇసుక రవాణాపై విచారించారు. కోర్టులో కేసు నేపథ్యంలోనే అధికారుల హడావుడి మొదలయ్యిందన్న విమర్శలు గుప్పుమంటున్నాయి. 
 
రూ.లక్ష వరకు జరిమానా విధిస్తాం ః నిత్యానందరాజు, తహసీల్దార్‌
వ్యాపారానికి ఇసుకను తరలిస్తే వాహనాలను పట్టుకొని రూ.లక్ష వరకు జరిమానా విధిస్తాం. కొత్తగా విడుదలైన జీఓ ఆధారంగా ఇళ్ల కట్టడాలకు ఇసుక తోలుకోవచ్చు. వ్యాపారానికి తరలిస్తే ఉక్కుపాదంతో అణచివేస్తాం. మైనింగ్, రెవెన్యూ అధికారుల ఆధ్వర్యంలో చెక్‌పోస్టులు ఏర్పాటు చేయాలని ఉన్నతాధికారులు ప్రతిపాదిస్తున్నారు. 
 
కేసులు పెడతాం:  మహేష్‌కుమార్, ఎస్‌ఐ
ఇసుకను అక్రమంగా తరలించి వ్యాపారాలకు అమ్ముకుంటే రెవెన్యూ అధికారుల ఆదేశాల మేరకు కేసులు నమోదు చేస్తాం. పది రోజుల నుంచి అక్రమ ఇసుక రవాణా జరుగుతున్న ప్రాంతాల్లో పోలీస్‌ బందోబస్తును ఏర్పాటు చేశాం. అక్రమ ఇసుక రవాణాపై అడ్డుకట్టవేసేందుకు పోలీసులకు అధికారం లేదు. పూర్తి బాధ్యత రెవెన్యూ, మైనింగ్‌ అధికారులదే. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement