ఇసుక చిచ్చు! | sand mafia | Sakshi
Sakshi News home page

ఇసుక చిచ్చు!

Published Tue, Apr 12 2016 12:50 AM | Last Updated on Fri, Aug 10 2018 8:16 PM

ఇసుక చిచ్చు! - Sakshi

ఇసుక చిచ్చు!

అధికార పార్టీలో వర్గ విభేదాలు
ఉచిత ఇసుకను పక్కదారి పట్టిస్తున్న నేతలు
సీఎంకు ఫిర్యాదులు

 

గుంటూరు : గుంటూరు జిల్లాలోని ఇసుక వ్యాపారం టీడీపీలో వర్గ విభేదాలు పెంచుతోంది. కొందరు నేతలు ఉచిత ఇసుక విధానాన్ని పక్కదారి పట్టిస్తున్నారు. ఇసుక తవ్వకాలకు సహకరించిన డ్వాక్రా గ్రూపుల మొత్తాలను ఎగవేయడం.. సరిహద్దు నియోజకవర్గాల్లో హల్‌చల్ చేయడం వంటి సంఘటనలు నేతల మధ్య విభేదాలు పెంచుతున్నాయి. అన్యాయానికి గురైన ద్వితీయశ్రేణి నాయకులు కొందరు సీనియర్ల సహకారంతో విషయాన్ని పార్టీ అధినేత సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళుతున్నారు. మరికొన్నింటి వివరాలు పార్టీ రాష్ట్ర కార్యాలయానికి పంపుతున్నారు. రానున్న మంత్రివర్గ విస్తరణలో మంత్రి పుల్లారావు శాఖలను కొన్నింటినైనా తగ్గించేలా చేయాలని ఒక వర్గం ప్రయత్నిస్తుంటే, పుల్లారావు తన వ్యతిరేక వర్గ పరపతిని తగ్గించేందుకు అందివచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకునే యత్నం చేస్తున్నారు. ఉగాది నాటి ఘటన ఇందుకు ఉదాహరణగా పార్టీ నేతలు చెబుతున్నారు.

 
గణాంకాలు సహా ఫిర్యాదు..
ఉగాది పర్వదినాన తాడేపల్లి జెడ్పీటీసీ సభ్యురాలు దండమూడి శైలజారాణి మండలంలో ఇసుక తవ్వకాల్లో జరుగుతున్న అవినీతిని సీఎంకు వివరించినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా మంగళగిరి నియోజకవర్గ పరిధిలోని ఇసుక రీచ్‌ల్లోని ఇసుకను పొన్నూరు నియోజకవర్గ నేతలు ఎక్కువగా అమ్ముకున్నారని, నిబంధనలకు విరుద్ధంగా జరిగిన అమ్మకాల కారణంగా ప్రభుత్వం కోల్పోయిన ఆదాయ వివరాలను గణాంకాలతో సహా వివరించినట్టు తెలుస్తోంది. ఏడాది కాలంలో ఇసుక తవ్వకాలకు సహకరించిన డ్వాక్రా గ్రూపు సభ్యులకు, మత్స్యకారులకు చెల్లింపులు చేయకుండా, వారిపై బెదిరింపులకు దిగుతున్నట్టు ఆమె ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ప్రవేశపెట్టిన ఉచిత ఇసుక పాలసీని కొందరు నేతలు అపహాస్యం చేస్తున్నారని, అధికారులను అడ్డుపెట్టుకుని తమ సొంత అవసరాలకు, బడా కంపెనీలకు ఇసుక ఎలా అందిస్తున్నారో వివరించారు. రాజధాని నిర్మాణానికి ఇసుక తోలుతున్నామని చెబుతూ వేరే సొసైటీ సభ్యులు ఎవరినీ అక్కడకు రానీయకుండా అధికారులతో, పోలీసులతో ఎలా బెదిరిస్తున్నారో.. తదితర విషయాలు సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు టీడీపీ వర్గాల సమాచారం. మంత్రి పుల్లారావు సమక్షంలోనే ఆమె ఫిర్యాదు చేశారు. దీనిపై మరికొన్ని వివరాలను సీఎం పుల్లారావు, ఇతర వర్గాల ద్వారా సేకరించినట్టు తెలుస్తోంది. వ్యూహాత్మకంగానే పొన్నూరు నేతలపై మంత్రి పుల్లారావు ఫిర్యాదు ఇప్పించారనే అభిప్రాయం కూడా పార్టీలో లేకపోలేదు.

 

రోజుకు సంపాదన రూ.లక్ష..
ట్రాక్టరు ట్రక్కులో ఇసుక లోడ్ చేయడానికి రూ.300 నుంచి రూ.500 వరకూ, లారీకి రూ.1000 వరకూ టీడీపీ నేతలు వసూలు చేస్తున్నారు. ఒక పొక్లెయిన్ ద్వారా రోజుకు రూ.80 వేల నుంచి రూ.లక్ష వర కూ టీడీపీ నేతలు సంపాదిస్తున్నారు. గతం కంటే ఈ విధానమే బాగుందని, 210 సామర్థ్యం కలిగిన పొక్లెయిన్‌ను కొనుగోలు చేయడం లేదా అద్దెకు తీసుకుని టీడీపీ నేతలు ఈ వ్యాపారాన్ని గుట్టు చప్పుడు కాకుండా నిర్వహిస్తున్నారు. అన్ని రీచ్‌లలోనూ ముఖ్యనేతలకు చెందిన పొక్లెయిన్‌లే ఉండటంతో మిగిలిన నేతలు వీటిపైనా ఫిర్యాదు చేస్తున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement