గ్రా‘వెల్’ దోపిడీ
అక్రమంగా భారీ తవ్వకాలు ఫిర్యాదు చేసినా పట్టించుకోని అధికారులు
ప్రభుత్వ ఆదాయానికి గండి
ఉదయగిరి: ఉదయగిరి నియోజకవర్గంలో గ్రావెల్ అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. మం డల స్థాయి అధికారులను మేనేజ్ చేసుకొని అక్రమార్కులు ఈ తంతుకు పాల్పడుతున్నారు. క్షేత్రస్థాయిలో దీనిని అడ్డుకోవలసిన అధికారులు మామూళ్ల మత్తులోనో..అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకో తలొగ్గి ఫిర్యాదులొచ్చినా ఆ వైపు కన్నెత్తి చూడడం లేదు. స్వయంగా జిల్లా కలెక్టరే గ్రావెల్ అక్రమ తవ్వకాలపై సీరియస్ అవుతున్నా మండల స్థాయి అధికారులకు చీమకుట్టినట్లు కూడా లేకపోవడం గమనార్హం. అనుమతులు లేని తవ్వకాలతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిపడుతోంది. అధికారుల కళ్లెదుటే జరుగుతున్న ఈ తంతు తమకు సంబంధించింది కాదులే..అన్న రీతిలో వ్యవహరిస్తున్నారు.
వరికుంటపాడు మండలం తిమ్మారెడ్డిపల్లి నుంచి మర్రి పాడు మండలం బాట వరకు 565వ జాతీయ రహదారి పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఈ పనులకు అవసరమైన గ్రావెల్‌ను అక్రమంగా భారీగా తరలిస్తున్నారు. ఒకట్రెండు చోట్ల అనుమతులు పొందిన కాంట్రాక్టర్లు పెద్దమొత్తంలో మట్టిని కొల్లగొడుతున్నారు. రామాపురం,వరికుంటపాడు,చింతలగుంట, దుత్తలూరు, వేంపాడు తదితర ప్రాం తాల్లో పెద్దఎత్తున అక్రమంగా గ్రావెల్ తరలించి రోడ్డు పనులకు వినియోగిస్తున్నారు.
కాంట్రాక్టర్లు ఆయా ప్రాం తాల్లోని అధికారులకు ముడుపులు అప్పజెప్పి తమ పని సులువుగా కానిస్తున్నారు. ఆయా గ్రామాల్లో అభ్యంతరాలు వచ్చినప్పటికీ అధికారుల నుంచి ఉలుకు పలుకు లేకపోవడంతో స్థానికులు ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారు. కొన్నిచోట్ల కాంట్రాక్టర్లతో గ్రామస్థాయి రాజకీయ నేతలు అవగాహనకు వచ్చి తామే దగ్గరుండి గ్రావెల్‌ను తరలిస్తున్నారు. వాస్తవంగా రోడ్డుకు గ్రావెల్ తరలించాలంటే ముందు గా గనుల శాఖ నుంచి అనుమతి తీసుకొని లీడ్ పొం దాలి. కానీ ఈ వ్యవహారం పాక్షికంగానే జరిగింది.
ప్రభుత్వ పథకాలకూ ఇదే తంతు
ప్రభుత్వం ఇటీవల మంజూరు చేసిన పలు అభివృద్ధి పనులకు సంబంధించి రోడ్ల కోసం గ్రావెల్ తరలిస్తున్నారు. ఇటీవల నియోజకవర్గంలో రూ.10 కోట్లతో పంచాయతీల్లో సిమెంటు రోడ్ల పనులు జరిగాయి. ఈ రోడ్ల మార్జిన్లలో మట్టి నింపేందుకు ఆయా ప్రాంతాల్లో భారీగా గ్రావెల్ తరలించారు. జెడ్పీ నిధులతో జరిగే ఈ రోడ్డు పనులకు కూడా పెద్ద ఎత్తున అక్రమంగా గ్రావెల్ తవ్వకాలు జరిగాయి. ఇటీవల నియోజకవర్గంలో పలు మార్గాల్లో తారురోడ్లు వేశారు.
వీటి మార్జిన్లు నింపేం దుకు గ్రావెల్ తవ్వకాలు జరిగాయి. సోమవారం విం జమూరులోని మల్లపరాజు చెరువు నుంచి భారీ ఎత్తున ప్రొక్లెయిన్ ద్వారా గ్రావెల్ తరలించారు. దీనిపై కొంతమంది స్థానికులు అధికారులకు ఫిర్యాదు చేసినా తమకేమీ తెలియదన్నట్లుగానే తప్పించుకున్నారు. మొత్తమ్మీద నియోజకవర్గంలో ఈ అక్రమ గ్రావెల్ తవ్వకాలు భారీ ఎత్తున జరుగుతున్నాయి. ఎక్కువ లోతుతో గుం తలు తీసినందున వర్షాకాలంలో వాటిలోకి నీరు చేరి కొ న్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇంత జరుగుతున్నా అధికారులు మాత్రం కాంట్రాక్టర్లు ఇచ్చే పర్సంటేజీలకు జైకొడుతూ ప్రజాసంక్షేమాన్ని విస్మరిస్తున్నారు.