నిగ్గు తేల్చేనా? | cb cid enquiry Illegal mining in andhra pradesh | Sakshi
Sakshi News home page

నిగ్గు తేల్చేనా?

Published Sat, Aug 18 2018 2:49 PM | Last Updated on Sat, Aug 18 2018 2:49 PM

cb cid enquiry Illegal mining in andhra pradesh - Sakshi

అక్రమ మైనింగ్‌ విచారణపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారంలో ఇంటి దొంగలను రక్షించేందుకు అధికార పార్టీ శతవిధాలా ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో విచారణ బాధ్యతలను సీబీఐకి అప్పగిస్తే ఎక్కడ గుట్టురట్టవుతుందోననే భయంతో.. తమ చెప్పుచేతల్లో ఉండే సీబీ సీఐడీకి ఇచ్చినట్టు సమాచారం. ఇప్పటి వరకు మైనింగ్‌ అధికారులు చేపట్టిన విచారణ నివేదిక ఆధారంగానే సీబీసీఐడీ దర్యాప్తు చేయనుంది. అయితే ఇప్పటి వరకు జరిగిన విచారణలో మైనింగ్‌ తిమింగలంపై కాకుండా.. కేవలం అమాయకపు చేప పిల్లలపైనే కేసులు నమోదు చేశారు.  

సాక్షి, గుంటూరు:  ఏ రోజుకారోజు కొత్త పాత్రలు ప్రవేశిస్తూ అధికార పార్టీ ఎమ్మెల్యే అక్రమ మైనింగ్‌ వ్యవహారం ఊహించని మలుపులు తిరుగుతోంది. అక్రమ మైనింగ్‌లో ప్రత్యక్ష, పరోక్షంగా సంబంధాలు ఉన్న అధికార పార్టీ ఎమ్మెల్యే, ఆయనకు మద్దతుగా నిలిచిన ప్రభుత్వ పెద్దల వివరాలు బయటపడకుండా ఉండేందుకు జాగ్రత్త పడుతున్నారు. వాస్తవానికి హైకోర్టు ఆగ్రహంతో పల్నాడు ప్రాంతంలోని పిడుగురాళ్ల మండలం కేసానుపల్లి, దాచేపల్లి మండలం నడికుడి, కోనంకి గ్రామాల్లో  నాలుగేళ్లుగా అధికార పార్టీ ఎమ్మెల్యే కనుసన్నల్లో జరుగుతున్న అక్రమ మైనింగ్‌పై ప్రభుత్వం విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. 

అయితే విచారణ చేపట్టిన మైనింగ్‌ అధికారులు అక్రమ మైనింగ్‌కు సూత్రధారులైన అధికార పార్టీ ఎమ్మెల్యే, మైనింగ్‌ మాఫియాను రక్షించడంలో భాగంగా వారి వద్ద పనిచేసే కూలీలు, ట్రాక్టర్‌ డ్రైవర్లు, సూపర్‌వైజర్లను బలిపశువులను చేస్తున్నారు. ఈ క్రమంలో రూ.వందల కోట్ల విలువ చేసే తెల్లరాయిని దోచేశారంటూ 17 మందిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు వారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేశారు. కథ ఇక్కడితో ఆగలేదు.. 13న పిడుగురాళ్ల, దాచేపల్లి మండలాల్లో పనిచేసిన తహసీల్దార్లు, వీఆర్వోలు, గ్రామ కార్యదర్శులు, మైనింగ్‌ అధికారులకు షోకాజ్‌ నోటీసులు జారీ చేసి మైనింగ్‌ డీడీ, ఏడీపై సస్పెన్షన్‌ వేటు వేయడం, అక్రమ మైనింగ్‌ వ్యవహారాన్ని సీబీసీఐడీకి అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం అక్రమార్కులను తప్పించేందుకనే విమర్శలు వినిపిస్తున్నాయి.

 ఇందులో భాగంగా శుక్రవారం లా అండ్‌ ఆర్డర్‌ పోలీసులు సీబీసీఐడీ అధికారులకు అక్రమ మైనింగ్‌ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు చేసిన దర్యాప్తు వివరాలను అప్పగించినట్టు తెలుస్తోంది. ïసీబీసీఐడీ ఏడీజీ అమిత్‌ గార్గ్‌ నేతృత్వంలో, డీఐజీ కాలిదాసు రంగారావు పర్యవేక్షణలో ఎనిమిది మంది డీఎస్పీలు, 14 మంది సీఐలు ఎనిమిది బృందాలుగా ఏర్పడి అక్రమ మైనింగ్‌పై విచారణ చేపట్టనున్నట్లు సమాచారం.

20 ప్రశ్నలు సంధించిన పోలీస్‌ శాఖ.. 
హైకోర్టు ఆదేశాల మేరకు అక్రమ మైనింగ్‌పై సర్వే నిర్వహించిన మైనింగ్‌ అధికారులు 31 లక్షల మెట్రిక్‌ టన్నులు తెల్లరాయిని అక్రమంగా తవ్వి దోచేశారంటూ 17 మందిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీరిపై కేసు నమోదు చేసిన పోలీస్‌ శాఖ మైనింగ్‌ అధికారులకు 20 ప్రశ్నలు సంధించింది. అయితే వీటికి మైనింగ్‌ అధికారులు ఇప్పటి వరకు సమాధానం ఇవ్వలేదు. ఆ ప్రశ్నలతో సహా ఇప్పటి వరకూ జరిగిన మొత్తం విచారణను నివేదిక రూపంలో సీబీసీఐడీ అధికారులకు అందజేసినట్లు తెలుస్తోంది.    

మైనింగ్‌ అ«ధికారులు పెట్టిన కేసులపైనే విచారణ..
అధికార పార్టీ ఎమ్మెల్యే కనుసన్నల్లో నాలుగేళ్లుగా జరుగుతున్న అక్రమ మైనింగ్‌పై విచారణకు సిద్ధమైన సీబీసీఐడీ నిజాలను నిగ్గు తేలుస్తుందా అనే అనుమానాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ అనుమానాలను బలపరుస్తూ సీబీసీఐడీ అక్రమ మైనింగ్‌పై మొదటి నుంచి కొత్తగా దర్యాప్తు చేపట్టకుండా మైనింగ్‌ అధికా>రులు ఎమ్మెల్యే, మైనింగ్‌ మాఫియాను రక్షించడంలో భాగంగా అమయాకులపై పెట్టిన కేసుల విచారణను కొనసాగించనునన్నట్లు విశ్వసనీయ సమాచారం. అక్రమ మైనింగ్‌లో ఆరోపణలు ఎదుర్కొంటూ సస్పెండ్‌ అయిన మైనింగ్‌ డీడీ, ఏడీలు ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా పెట్టిన కేసులపై దర్యాప్తు కొనసాగిస్తే అసలు నేరస్థులు బయట వచ్చే పరిస్థితి ఉంటుందా అనేది పెద్ద ప్రశ్నగా కనిపిస్తోంది.

అసలు దొంగలు బయటపడతారా..?
పల్నాడు ప్రాంతంలో అక్రమ మైనింగ్‌ వ్యవహారం నుంచి ఎమ్మెల్యే, అతని ముఖ్య అనుచరులను తప్పించడంలో భాగంగా ప్రభుత్వం ఇప్పటి వరకు శతవిధాల ప్రయత్నించింది. అక్రమ మైనింగ్‌ వ్యవహారంలో మైనింగ్‌ అధికారులు, ఐఏఎస్, ఐపీఎస్‌ల పాత్ర ఉన్నట్టు బయటపడుతుండటంతో సీబీఐకు విచారణ అప్పగిస్తే నిజాలు నిగ్గుతేలుతాయనే భయంతో రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న సీబీసీఐడీకు విచారణ బాధ్యతలు అప్పగించారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఓ వైపు అధికార పార్టీ ఒత్తిళ్లు, పోలీస్‌ శాఖలోని కొంత మంది అధికారుల పాత్ర అక్రమ మైనింగ్‌ వ్యవహారాన్ని నీరుగార్చేందకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సీబీసీఐడీ అయినా నిజాలు నిగ్గు తేల్చి అసలు దొంగలను పట్టుకుంటుందా అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement