ఫారెస్ట్ అధికారులు స్వాధీనం చేసుకున్న జేసీబీ, ట్రాక్టర్లు
- ఒక జేసీబీ, డోజర్, 10 ట్రాక్టర్లు సీజ్
- బర్లగూడెం వద్ద ఇసుకర్యాంపునకు దారి వేస్తుండగా దాడులు
- ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు..
- లక్ష్మణ్‌రంజిత్‌నాయక్, ట్రైనీ ఐఎఫ్‌ఎస్
పినపాక : అటవీ భూముల నుంచి నిబంధనలకు విరుద్ధంగా గ్రావెల్ తవ్వకాలు జరుపుతున్న వాహనాలను శుక్రవారం రాత్రి ఏడూళ్లబయ్యారం అటవీ క్షేత్ర కార్యాలయ అధికారులు దాడులు చేసి పట్టుకున్నారు. ట్రైనీ ఐఎఫ్‌ఎస్, రేంజర్ లక్ష్మణ్‌రంజి™Œ నాయక్ తెలిపిన వివరాల ప్రకారం... మండల పరిధిలోని పద్మాపురం పంచాయతీ బర్లగూడెం–అల్లేరుగూడెం గ్రామాల మధ్య గల అటవీ భూముల నుంచి నిబంధనలకు విరుద్ధంగా గ్రావెల్ క్వారీ ఏర్పాటు చేసి అక్రమంగా ట్రాక్టర్ల ద్వారా గ్రావెల్‌ను తరలిస్తున్నారు. స్థానికులు అందించిన సమాచారం మేరకు రేంజర్ తన సిబ్బందితో పాటు కరకగూడెం పోలీసుల సహకారంతో అల్లేరుగూడెం అడువుల్లో ఏర్పాటు చేసిన గ్రావెల్ క్వారీ వద్దకు చేరుకున్నారు. కాగా ముందుగానే అధికారులు వస్తున్నారన్న సమాచారం అందుకున్న వాహనాల యజమానులు అక్కడి నుంచి వాహనాలను అటవీ ప్రాంతంలోకి తీసుకవెళ్లి దాచి ఉంచారు. ఈ క్రమంలో రేంజర్ ఆధ్వర్యంలో అటవీ ప్రాంతంలో తనిఖీలు నిర్వహించగా దాచి ఉంచిన ఒక జేసీబీ, ఒక డోజర్ ట్రాక్టర్, 10 ట్రాక్టర్లను అధికారులు గుర్తించారు. అనంతరం వాటిని స్వాధీనం చేసుకొని ఏడూళ్లబయ్యారం రేంజ్ కార్యాలయానికి తరలించారు.
అల్లేరుగూడెం వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన ఇసుక క్వారీకి రోడ్డు నిర్మాణం చేపట్టేందుకు గ్రావెల్‌ను తోలుతున్నట్లు తమ విచారణలో తేలింది. అక్రమంగా తరలించిన గ్రావెల్ విలువ సుమారు రూ.4 లక్షలు ఉంటుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు డీఎఫ్‌ఓకు నివేదించాం. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటాం.