కొల్లగొడుతున్నారు! | sand mafia in new capital of ap | Sakshi
Sakshi News home page

కొల్లగొడుతున్నారు!

Published Fri, Jan 30 2015 2:44 AM | Last Updated on Sat, Sep 2 2017 8:29 PM

కొల్లగొడుతున్నారు!

కొల్లగొడుతున్నారు!

తవ్వుకున్నోళ్లకు తవ్వుకున్నంత!
నదులను లూఠీ చేస్తున్న తెలుగుతమ్ముళ్లు
రాత్రిళ్లు పొక్లెయిన్‌లతో తోడేస్తున్నారు
బెంగుళూరు, చెన్నైలకు యథేచ్ఛగా ఎగుమతి
రాళ్లు తేలి రోదిస్తున్న పాపాఘ్ని, పెన్నానదులు

 
కడప: ‘దీపం ఉండగానే ఇళ్లు చక్కబెట్టుకోవాలనే’ తలంపు తెలుగు తమ్ముళ్లల్లో బలపడింది. అందుకు ప్రకృతి సంపదను టార్గెట్‌గా ఎంచుకున్నారు. ఒక్కరోజులో లక్షలు పోగుచేసుకునే ఎత్తుగడలకు పాల్పడుతున్నారు. తొలుత ఎర్రచందనం దృష్టి సారించి సఫలీకృతులయ్యారు. ప్రస్తుతం ఎర్రచందనం అక్రమ రవాణాపై నిఘా తీవ్రతరం కావడంతో, ఇసుక వైపు వారి దృష్టి మళ్లింది. నదుల్నీ కొల్లగొట్టుతున్నారు. పోటీలు పడి ఇసుక తోడేస్తుండడంతో పాపాఘ్ని, పెన్నా నదుల్లో రాళ్లు తేలియాయి. రాత్రి సమయంలో యంత్రాలతో ఇసుకను తరలిస్తున్న ఘటనలు జిల్లాలో విచ్చలవిడి అయ్యాయి. అధికారపార్టీ నేతల్లో కొందరికి ప్రస్తుతం ఇసుక అక్రమరవాణే అక్రమార్జన అయింది. పొద్దుగూటికి చేరగానే నదుల్లో వీరి విజృంభణ మొదలై పొద్దుపొడిచే సమయానికి ముగిస్తుంది. సమీప గ్రామాల్లో మిషన్లను, లారీలను అందుబాటులో ఉంచుకుని రాత్రి కాగానే నదుల్లోకి ప్రవేశించి ఇసుకను తోడేస్తున్నారు. స్థానికులకు తెలిసినా నిశ్చేష్ట్రులై చూస్తుండిపోవడం మినహా  ఏమీచేయలేని స్థితి. అధికారులకు  సమాచారం అందించినా పేర్లు తెలుస్తున్నాయని మిన్నకుండిపోతున్నారు.

పాపాఘ్ని... పెన్నా లూఠీ....

జిల్లాలో పాపాఘ్ని, పెన్నా నదులు లూఠీ అవుతున్నాయి. తర్వాత స్థానాన్ని చెయ్యేరు నది ఆక్రమించింది. పాపాఘ్ని నదిలో వేంపల్లె నుంచి కమలాపురం వరకూ అంచెలంచెలుగా నదిలోని ఇసుకను తోడేస్తున్నారు. వేంపల్లె, తంగేడుపల్లె, నందిమండలం, పైడికాల్వ, కమలాపురం తదితర పల్లెల్లో ఇసుక అక్రమరవాణాను అలుపెరగకుండా చేస్తున్నారు. పైడికాల్వ సమీపంలో పాపాఘ్ని నదిలో విందు ఏర్పాటు చేసుకుని ఇసుక అక్రమ రవాణాలకు తెలుగుతమ్ముళ్లు రక్షణగా నిలుస్తున్నారు. నదిలో యంత్రాలతో లారీలకు ఇసుకను నింపడమే కాకుండా జిల్లా హద్దులు దాటేంతవరకూ ఎస్కార్టుగా తరలివెళ్తున్నట్లు తెలుస్తోంది. ఇంత తతంగం నిర్వహిస్తున్నా అధికారులు అటువైపు కన్నెత్తి చూసే సాహసం చేయలేకున్నారు. అందుకు కారణం అధికారపార్టీ నేతల బెదిరింపులేనన్నది సుస్పష్టం. అలాగే పెన్నా నదిలో కొండాపురం నుంచి చెన్నూరు వరకూ ఆయా ప్రాంతాల్లోని అధికారపార్టీ నేతల అనుచరులు ఇసుక అక్రమ రవాణా అక్రమాధాయంగా ఎంచుకున్నారు. కొండాపురం, ప్రొద్దుటూరుల నుంచి నిత్యం బెంగుళూరుకు ఇసుక తరలివెళ్తోంది.   తెలుగుతమ్ముళ్లు కాకుండా ఇతరులు నదిలోకి దిగితే వెంటనే అధికారులకు ఫోన్లు చేసి పట్టిస్తూ పోటీ లేకుండా చూసుకుంటున్నారు. అధికార పార్టీ నేతల ఫిర్యాదులకు మాత్రమే అధికారులు సైతం స్పందిస్తున్నట్లు తెలుస్తోంది.  

ప్రత్యేక టీం ఏర్పాటైనా....

ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు జిల్లా వ్యాప్తంగా కలెక్టర్ ఆరు ప్రత్యేక టీంలు ఏర్పాటు చేశారు. ఒక్కో ఆర్డీఓ పరిధిలో రెండు టీంలు పనిచేస్తున్నారుు. ఈ టీంలో రెవిన్యూ, ఫారెస్టు, మైనింగ్, పోలీసు శాఖలకు చెందిన సభ్యులు ఉంటారు. ఇసుక డంప్‌లు, ఇసుక అక్రమరవాణా అరికట్టడంలో వీరు విఫలం అవుతున్నారు. అందుకు కారణం ఈ టీంలు ఆర్డీఓల పర్యవేక్షణలో ఉండడమేనని తెలుస్తోంది. కలెక్టర్ కంట్రోల్‌లోనే స్పెషల్ టీంలు ఉంటే తప్ప అక్రమరవాణా నియంత్రించడం సాధ్యం కాదని తెలుస్తోంది.
 
‘ఎర’గా డంప్‌లు....

అధికారుల దాడులకు ఎరగా డంప్‌లను చూపిస్తున్నట్లు తెలుస్తోంది. అనువైన ప్రాంతానికి ఇసుకను చేర్చడం అధికారులకు చెప్పి సీజ్ చేయించడం, ఆపై దానిని వేలంలో దక్కించుకోవడం లాంటి ఎత్తుగడలను అధికారపార్టీ నేతలు కొన్ని ప్రాంతాలల్లో చేస్తున్నట్లు తెలుస్తోంది. వేలంలో దక్కించుకున్న ఇసుకకు యంత్రాంగంచే అనుమతి పొంది, ఆ అనుమతితో నదుల్లోని ఇసుకను తరలిస్తున్నారు. అందుకు ప్రత్యక్ష ఉదాహరణగా నందిమండలం, పెద్దచెప్పలి, పైడికాల్వ సమీపంలో పట్టుబడ్డ ఇసుక డంప్‌లు నిలుస్తున్నాయి. వాటిని సీజ్ చేయించడం, ఆ ఇసుకను తరలించేందుకు అనుమతి దక్కించుకోవడం, అక్రమంగా కొల్లగొట్టడం తంతు యధేచ్ఛగా నడుస్తోంది. ఇలాంటి వ్యవహారాలకు ఆర్డీఓ కార్యాలయాలే వేదికగా నిలుస్తుండడం విశేషం.

పీడీ యాక్టు ప్రయోగిస్తేనే....

ఇసుక అక్రమరవాణా అరికట్టాలంటే పీడీ యాక్టు ప్రయోగిస్తే మినహా సాధ్యం కాదనేది నిర్వివాదాంశం. జిల్లా ఎస్పీ నవీన్‌గులాఠీ, కలెక్టర్ కేవీ రమణ ఇసుక అక్రమ రవాణాపై కఠినంగా స్పందిస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement