తెలుగు తమ్ముళ్ల ‘ఎర్ర’దందా
తిరుపతి : జిల్లాలో ఎర్ర స్మగ్లింగ్ యథేచ్ఛగా సాగుతోంది. చంద్రగిరి, కుప్పం, శ్రీకాళహస్తి, సత్యవేడు నియోజకవర్గాలను కేంద్రాలుగా చేసుకుని స్మగ్లర్లు రెచ్చిపోతున్నారు. నిత్యం వందల టన్నుల ఎర్రబంగారాన్ని గుట్టుచప్పుడు కాకుండా సరిహద్దులు దాటిస్తూ జేబులు నింపుకుంటున్నారు. టీడీపీ ద్వితీయశ్రేణి నాయకులే కీలకం ఎర్రచందనం స్మగ్లింగ్‌లో టీడీపీకి చెందిన ద్వితీయశ్రేణి నేతలే కీలకంగా వ్యవహరిస్తున్నట్టు స్పష్టమవుతోంది. ప్రధానంగా ముఖ్యమంత్రి, మంత్రి ఇలాకాల్లోని ఆ పార్టీనేతలు కొందరు కూలీలను సమకూర్చుకుని ఎర్రబంగారాన్ని తరలించేపనిలో నిమగ్నమైనట్టు స్పష్టమవుతోంది.
టాస్క్‌ఫార్స్ ఎర్రచందనం అక్రమరవాణాకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా టాస్క్‌ఫోర్స్ టీంను ఏర్పాటు చేసింది. మొదట్లో ఈ బృందం హడావిడి చేసినా ఆపై ఉన్నతాధికారులు, రాజకీయ నాయకుల ఒత్తిడితో కొంత మెత్తబడినట్టు తెలుస్తోంది. లారీ దుంగలు పట్టుబడితే ఆ దుంగలనే రోజూ ఏదో ఒకచోట పట్టుబడినట్లు ఫొటోలకు ఫోజులిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనికితోడు ఇక్కడ ఎర్రస్మగ్లింగ్‌లో కీలకపాత్ర పోషిస్తున్న వారిని వదిలి వేరే రా ష్ట్రాలకెళ్లి కొంత మందిని తీసుకొచ్చి బడా స్మగ్లర్లంటూ ప్రచారం చేసుకోవడం రివాజుగా మారుతోంది. రూటు మార్చిన ఎర్ర దొంగలు.
ప్రధాన స్మగర్లపైనే పోలీసులు దృష్టి సారించడంతో వారి కదలికలు కొంతవరకు తగ్గుముఖం పట్టా యి. వారి స్థానంలో ఇంతకు మునుపు గ్రామాల్లో ఎర్రస్మగ్లర్లకు ఇన్‌ఫార్మర్లుగా, డ్రైవర్లుగా, కీలకపాత్ర పోషించిన యువకులు ఇప్పుడు రెచ్చిపోతున్నారు. ఓ ప్రధాన స్మగ్లర్ స్థానంలో పది మంది ద్వితీయశ్రేణి స్మగర్లు పుట్టకొచ్చినట్లు చర్చ సాగుతోంది. పెద్ద మొద్దులను చిన్నచిన్న దుంగలుగా కట్‌చేసి బ్యాగుల్లో పార్సిల్‌చేసి ఖరీదైన కార్లలో తరలిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై నిఘా ఉంచాల్సిన అధికారులు నిద్దరోవడం విమర్శలకు తావిస్తోంది