‘టాక్స్’ఫోర్స్!
► రాజకీయ కక్ష సాధిస్తున్న అధికార పార్టీ నేతలు
► జీ హుజూర్ అంటున్న పోలీసు యంత్రాంగం
► చేతివాటం ప్రదర్శిస్తున్న అధికారులు
► ఎర్రచందనం అక్రమ రవాణాను అరికట్టడంలో విఫలం
► అమాయకులపై స్మగ్లింగ్ పేరుతో కేసులు
► రైల్వేకోడూరు, రాజంపేటలో చెలరేగుతున్న తెలుగుతమ్ముళ్లు
సి...నాయుడు, పి...నాయుడు, వీఎస్...నాయుడు.. వీరందరూ ఎర్రచందనం స్మగ్లింగ్‌లో ఆరితేరిన వ్యక్తులు. వీరందరిదీ రాజంపేట నియోజక వర్గంలోని సిద్దవటం మండలం. ఏడాది క్రితం పీడీ యాక్టుపై జైలుకు వెళ్లి వచ్చారు. ఈ ముగ్గురు ఓ ఎంపీకి సన్నిహితులు. పెపైచ్చు అధికార పార్టీకి చెందిన ఓ ప్రజాప్రతినిధి మద్దతు ఉంది. ఇంకేముంది.. అడవులను విచ్చలవిడిగా ధ్వంసం చేయసాగారు. దీపం ఉండగానే ఇళ్లు చక్కబెట్టుకోవాలనే తలంపుతో ఇబ్బడి ముబ్బడిగా ఎర్రచందనం అక్రమ రవాణా కొనసాగిస్తున్నారు. విచిత్రమేమిటంటే వారి డంప్‌లు పట్టుబడితే వేరేవ్యక్తులపై కేసులు బనాయిస్తున్నారు.
రైల్వేకోడూరుకు చెందిన రాజగోపాల్ ఫ్యాన్సీ దుకాణం నిర్వాహకుడు. మిత్రులు సుధాకర్, గిరి(కానిస్టేబుల్)తో కలిసి రెడ్డిపల్లెలోని ఓ వివాహనికి బైక్‌లో పయనమయ్యారు. మార్గమధ్యంలో టాస్క్‌ఫోర్స్ పోలీసులు అటకాయించారు. బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. ఎర్రచందనంను అక్రమంగా రవాణా చేస్తున్నారంటూ అక్రమ కేసు నమోదు చేశారు. తప్పును కప్పిపుచ్చుకునేందుకు ఆ కేసులో మరికొందరిని చేర్చి మరో తప్పు చేశారు.
పై రెండు ఘటనలు పరిశీలిస్తే పోలీసు వ్యవస్థ వ్యవహరిస్తున్న తీరు ప్రస్ఫుటం అవుతోంది. ఓవైపు ఇతర రాష్ట్రాల కూలీలతో ఎర్రచందనం స్మగ్లర్లు ప్రకృతి సంపదను నాశనం చేస్తున్నారు. అడ్డుకుంటున్న అటవీ సిబ్బందిని కిరాతకంగా నరికేస్తున్నారు. ఇలాంటి తరుణంలో స్మగ్లర్ల ఆట కట్టించాల్సిన టాస్క్‌ఫోర్స్ పోలీసు యంత్రాంగం తద్భిన్నంగా వ్యవహరిస్తోంది. అధికార పార్టీ నేతలకు తాము దాసులమనే చెప్పకనే చెప్పుకొస్తున్నారు. టీడీపీ నేతల మెప్పుకోసం స్మగ్లర్లను గౌరవస్థులుగా, అమాయకులను నేరస్థులుగా మారుస్తున్నారు.
కళంకితులకు బాధ్యతలా..!
నీతి, నిజాయితీ ఉన్న అధికారులకు టాస్క్‌ఫోర్స్ విభాగంలో బాధ్యతలు అప్పగిస్తే అనుకున్న లక్ష్యం సాధించే అవకాశం ఉంది. తిరుపతి కేంద్రంగా పనిచేస్తున్న టాస్క్‌ఫోర్స్ రైల్వేకోడూరు,రాజంపేట, రాయచోటి నియోజకవర్గాల పరిధిలోని స్మగ్లర్లపై నిఘా ఉంచింది. అక్కడ విధులు నిర్వర్తిస్తున్న ఓ అధికారి జిల్లాలోని పలు ప్రాంతాల్లో సివిల్ ఎస్‌ఐగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన పనిచేసిన పోలీస్ స్టేషన్లలో ‘మూడు పువ్వులు ఆరుకాయలు’గా అసాంఘీక కార్యక్రమాలు చెలరేగిపోయాయి. రైల్వేకోడూరులో పనిచేస్తున్న సమయంలో ఎర్రచందనం స్మగ్లర్లతో సంబంధాల నేపధ్యంలో కేవలం 9నెలల వ్యవధిలోనే బదిలీ అయ్యారు. వేంపల్లెలో పనిచేస్తున్న సమయంలో సివిల్ పంచాయితీల దందా నేపధ్యంలో అక్కడి నుంచి సైతం బదిలీ అయ్యారు. అలాంటి అధికారికి టాస్క్‌ఫోర్స్ వింగ్‌లో అవకాశం దక్కింది. ఇంకేముంది అధికారపార్టీ నేతలతో టాక్స్(మాటలు) నిర్వహించడం, ప్రత్యర్థులను కేసుల్లో ఇరికించడం చేస్తున్నారు. రైల్వేకోడూరు, రాజంపేట నియోజకవర్గాల పరిధిలో ఈతరహా వ్యవహరం ప్రస్తుతం నడుస్తోంది. కొత్తగా విధుల్లో చేరిన అధికారులకు టాస్క్‌ఫోర్స్ వింగ్‌లో బాధ్యతలు అప్పగిస్తే ఫలితాలు మెరుగ్గా ఉండే అవకాశం ఉంది. అలా కాకుండా అవినీతి ఆరోపణలు ఉన్న వారికి బాధ్యతలు అప్పగిస్తే టాస్క్‌ఫోర్స్ స్థానంలో ‘టాక్స్’ఫోర్స్ ఏర్పడక తప్పదని పలువురు భావిస్తున్నారు.