ఎర్రచందనం స్మగ్లింగ్‌పై టాస్క్‌ఫోర్స్ ఏర్పాటైన తర్వాత జరిగిన తొలి ‘ఎన్‌కౌంటర్’ ఇది. ఎర్రచందనం స్మగ్లింగ్‌ను అరికట్టటంలో.. ‘బడా స్మగ్లర్ల’ ఆటకట్టించటంలో విఫలమవుతున్న పోలీసు యంత్రాంగం.. కూలీలపై ప్రతాపం చూపి, వారిని తీవ్ర భయాందోళనలకు గురిచేసి, చెట్ల నరికివేతకు కూలీలుగా రాకుండా అడ్డుకోవాలని భావించినట్లు కనిపిస్తోందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. అందుకే.. తమ చేతికి చిక్కిన కూలీలను పట్టుకెళ్లి కాల్చిచంపి ఎదురు కాల్పుల్లో చనిపోయారని చెప్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. తమిళనాడులోని రాజకీయ పార్టీలు, పలు ప్రజా సంఘాలు సైతం పోలీసులే కూలీలను పట్టుకెళ్లి కాల్చిచంపారని ఆరోపిస్తున్నాయి. వామపక్ష నేతలు సైతం నిష్పక్షపాతంగా విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు.
అనుమానాలకు బలమిస్తున్న బస్సు టికెట్లు?
శ్రీవారిమెట్టు వద్ద జరిగిన ఎన్‌కౌంటర్‌పై అనుమానాలకు బలమిచ్చేలా బస్సు టికెట్లు లభించినట్లు విశ్వసనీయ సమాచారం. వేలూరు నుంచి తిరుపతికి సోమవారం సాయంత్రం 7 గంటలకు వచ్చిన ఎర్రకూలీలు శేషాచలం అడవుల్లోకి వెళ్లినట్టు సమాచారం రావడంతో టాస్క్‌ఫోర్స్ టీం కూంబింగ్ వెళ్లిందని అధికారులు చెప్తున్నారు. అలా అయితే రాత్రికి రాత్రే ఎర్రచందనం దుంగలను నరికి ఎలా తీసుకురాగలరు? అనేది కూడా అనుమానాలను బలపరుస్తోంది.