కూలీలను కాల్చేశారు | 20 red sanders smugglers shot dead in hill ranges near Tirupati | Sakshi
Sakshi News home page

కూలీలను కాల్చేశారు

Published Wed, Apr 8 2015 1:25 AM | Last Updated on Sat, Jul 28 2018 3:23 PM

మంగళవారం చిత్తూరు జిల్లా సచ్చినోడి బండ వద్ద జరిగిన పోలీసు కాల్పుల్లో మరణించిన ఎర్రచందనం కూలీలు - Sakshi

మంగళవారం చిత్తూరు జిల్లా సచ్చినోడి బండ వద్ద జరిగిన పోలీసు కాల్పుల్లో మరణించిన ఎర్రచందనం కూలీలు

11 మంది  సచ్చినోడి బండలో..
 
9 మంది  చీకటీగల కోనలో..    
 
ఎర్రచందనం చెట్లు నరికేందుకు స్మగ్లర్లు తెచ్చిన 20 మంది కూలీలను కాల్చి చంపిన పోలీసులు
 
శేషాచలం కొండల్లో  తెల్లవారుజామున 2 చోట్ల భారీ ‘ఎన్‌కౌంటర్’

 

మృతులు తమిళనాడు కూలీలు కూంబింగ్ సందర్భంగా ఎన్‌కౌంటర్ జరిగింది: టాస్క్‌ఫోర్స్
రాళ్లు, గొడ్డళ్లతో దాడికి దిగితే.. ఎదురు కాల్పులు జరిగాయన్న డీఐజీ
కూలీలను పట్టుకొచ్చి కాల్చి చంపారంటూ ఆరోపణల వెల్లువ
మృతుల పక్కన పడివున్న పెయింట్ మార్కుల ఎర్రదుంగలు ఎక్కడివి?
మిగతా వారు దుంగలతోనే పారిపోయారా?
{పజాసంఘాలు, హక్కుల వేదికలు, పార్టీల మండిపాటు
ఏపీ సర్కారుకు వ్యతిరేకంగా తమిళనాడులో ఆందోళనలు
చంద్రబాబుకు ఘాటుగా లేఖ రాసిన తమిళనాడు సీఎం పన్నీర్ సెల్వం

 
 
చిత్తూరు జిల్లాలోని శేషాచలం అడవులు రక్తమోడాయి. పొట్టకూటికోసం తమిళనాడు నుంచి వచ్చిన ఎర్రచందనం కూలీలు 20 మంది పోలీసుల తుపాకుల తూటాల బలయ్యారు. ఎర్రచందనం స్మగ్లింగ్‌ను అరికట్టడంలో చేష్టలుడిగిన ప్రభుత్వం కూలీలపై ప్రతాపం చూపిందనే విమర్శలు వెల్లువెత్తాయి. ఆత్మరక్షణలో భాగంగా జరిగిన ఎదురు కాల్పుల్లో ఈ 20 మంది కూలీలు చనిపోయారని పోలీసులు చెప్తున్నా.. అక్కడ అలాంటి ఆనవాళ్లు ఏవీ కనిపించకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. రెండు టాస్క్‌ఫోర్స్ బృందాలు గాలింపు చేపడుతున్నాయి. జరిపిన ‘రెండు ఎన్‌కౌంటర్ల’లో ఒక్క కూలీని కూడా గాయాలతో కానీ ప్రాణాలతో కానీ పట్టుకోకపోవడం అనుమానాలకు బలం చేకూరుస్తోంది. ఘటనా ప్రాంతా ల్లో మృతదేహాలు పడివున్న తీరు, వారిపక్కన పేర్చినట్లు ఉన్న ఎర్రచందనం దుంగలు, ఆ దుంగలపై పోలీసులకు పట్టుబడిన దుంగలపై వేసే పెయింట్ గుర్తులు ఉండటం వంటి పరిస్థితులు ఈ అనుమానాలను మరింత బలపరుస్తోంది. పోలీసులు అదుపులోకి తీసుకున్న కూలీలను పట్టుకెళ్లి అక్కడ కాల్చిచంపి.. ఎదురు కాల్పులని చిత్రీకరిస్తున్నారన్న ఆరోపణలు ప్రజా సంఘాల నుంచి వెల్లువెత్తుతున్నాయి. ఇది బూటకపు ఎన్‌కౌంటర్ అంటూ పలు రాజకీయ పక్షాలు తీవ్రంగా స్పందించాయి. ఈ ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ డిమాండ్ చేసింది. మానవహక్కుల సంఘాలు కూడా ఇది మానవ హక్కుల ఉల్లంఘనేనని నినదించాయి. చనిపోయిన వారంతా తమిళనాడుకు చెందినవారే కావడంతో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ఘాటుగా లేఖరాశారు. తమిళనాడు ప్రజలు రోడ్లపైకి వచ్చి ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మరోపక్క కేంద్ర ప్రభుత్వం కూడా ‘ఎన్‌కౌంటర్’ ఘటనపై ఆరా తీసింది.
 
తిరుపతి: చిత్తూరు జిల్లాలోని శేషాచలం కొండలు పోలీసుల తుపాకుల మోతతో దద్దరిల్లాయి. చంద్రగిరి మండ లం శ్రీవారిమెట్టు సమీపంలోని రెండు ప్రాంతాల్లో మంగళవారం ఉదయం జరిగిన భారీ ‘ఎన్‌కౌంటర్’లో 20 మంది ఎర్రచందనం కూలీలు మృతి చెందారు. పోలీసులు చెప్తున్న కథనం ప్రకారం.. ‘‘ఎర్రచందనం చెట్లు నరి కేందుకు స్మగ్లర్లు తీసుకొచ్చిన కూలీల కదలికలపై అటవీ  అధికారులు, టాస్క్‌ఫోర్స్ సిబ్బందికి సోమవారం రాత్రి 7 గంటల సమయంలో సమాచారం అందింది. దీం తో.. ఒక్కో బృందంలో 12 మంది టాస్క్‌ఫోర్స్, ముగ్గురు అటవీ సిబ్బంది చొప్పున రెండు బృందాలు కూంబింగ్ చేపట్టాయి. ఈ బృందాలకు ఉదయం 5 నుంచి 6 గంటల ప్రాంతంలో వంద మందికి పైగా కూలీలు తారసపడ్డారు. ఎర్రచందనం కూలీలు పోలీసు బృందాలపైకి రాళ్లు రువ్వారు. గొడ్డళ్లతో దాడులకు దిగారు. అప్రమత్తమైన పోలీసులు లొంగిపోవాలని కూలీలను హెచ్చరిం చారు. గాల్లోకి కాల్పులు జరిపారు. చివరకు ఆత్మరక్షణార్థం పోలీసులు జరిపిన కాల్పుల్లో ఆ కూలీలు చనిపోయారు. సచ్చినోడి బండ ప్రాంతంలో 11 మంది, ఈతగుంట సమీపంలోని చీకటీగల కోనలో 9 మంది మృతిచెందారు. మిగతా కూలీలు శేషాచలం అడవిలోకి పారిపోయారు. కూలీలు రాళ్లు రువ్వడంతో ఎనిమిది మంది పోలీసులకు గాయాలయ్యాయి.’’ అడవుల్లోకి పారిపోయినవారి కోసం టాస్క్‌ఫోర్స్, పోలీసులు, అట వీ శాఖ ఆధ్యర్యంలో భారీగా సిబ్బందిని మోహరించి గాలింపు కొనసాగిస్తున్నామని పోలీసుఅధికారులు తెలిపారు. కడప, తిరుపతి, రేణిగుంట, చిత్తూరు ప్రాంతాల్లో పోలీసులను అప్రమత్తం చేసినట్లు చెప్పారు. గాయపడిన పోలీసులు తిరుపతి రుయా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఘటనాస్థలంలో మూడు గొడ్డళ్లు, రెండు నాటు తుపాకులను పోలీసులు స్వాధీ నం చేసుకున్నారు. మృతి చెందిన వారంతా తమిళనాడుకు చెందిన కూలీలే అని భావిస్తున్నారు. మృతదేహాలకు పంచనామా చేసిన అనంతరం పోస్టుమార్టం నిమిత్తం రుయా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై చిత్తూరు జిల్లా కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్ విచారణకు ఆదేశించారు.  
 
ఎన్‌కౌంటర్‌పై అనుమానాలెన్నో?
 
తిరుపతి: శేషాచల అడవుల్లో ఎర్ర కూలీలపై మంగళవారం తెల్లవారుజామున జరిగిన ఎన్‌కౌంటర్‌పై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రోడ్డు నుంచి 6.5 కిలోమీటర్ల దూ రంలో ‘ఎన్‌కౌంటర్’ ప్రదేశాలున్నాయి. రెం డు ప్రదేశాలకు మధ్య దాదాపు కిలోమీటరు దూరం ఉంది. రెండు చోట్లా మృతదేహాలు పడివున్న తీరు, వారిపక్కన ఉన్న దుంగలను పరిశీలిస్తే.. ‘ఎన్‌కౌంటర్’పై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రెండు టాస్క్‌ఫోర్స్ బృం దాలకు.. రెండు ప్రాంతాల్లో.. ఒకే సమయం లో ఎర్రచందనం కూలీలు తారసపడ్డారని.. రెండు చోట్లా కూలీలు దాడికి దిగటంతో.. లొంగిపోవాలని హెచ్చరించి, గాలిలోకి కాల్పులు జరిపి, ఆపై ఆత్మరక్షణార్థం ఎదురు కాల్పులు జరిపామని పోలీసులు చెప్తున్నారు.  కిలోమీటరు దూరంలోని రెండు ప్రదేశాల్లో ఒకేసారి ‘ఎదురు కాల్పులు’ జరగటం సందేహాస్పదమని పరిశీలకులు అంటున్నారు. వారు లేవనెత్తుతున్న ప్రశ్నలేమిటంటే...

⇒  రెండుచోట్లా పోలీసు కాల్పుల్లో మృతి చెం దినవారి మృతదేహాలు.. కేవలం పది మీటర్ల విస్తీర్ణంలోపలే.. పక్కపక్కనే, చుట్టూ పేర్చినట్లుగా, గుంపుగా పడి కనిపిస్తున్నాయి. ఒక చోట 11, మరొక చోట 9 మృతదేహాలు పడివున్నాయి. ఎక్కువమందికి కడుపు, ఛాతీ, తల భాగాల్లో తూటా గాయాలు తగిలినట్లు కని పిస్తున్నాయి. ఎదురు కాల్పుల్లో ఇలా గుం పుగా పక్కపక్కనే చనిపోవటం సాధ్యమా?

  ఒక్కో కూలీ మృతదేహం పక్కనే ఒక్కో ఎర్రచందనం దుంగ ఉంది. కొందరు దానిపై చేయి వేసినట్లు, కాలు వేసినట్లు, దానిపై పడి ఉన్నట్లు ఉన్నారు. కానీ.. మృతదేహాల మధ్య కానీ.. ఒక్కో మృతదేహానికి, దానిపక్కనే పడివున్న దుంగకు కానీ పెద్దగా ఎడం లేదు. ఎర్రచందనం దుంగలు మోస్తున్న వారు.. మోస్తున్నట్లే కాల్పుల్లో చనిపోయారా? కూలీలు నిజంగా దుంగలు మోస్తూ టాస్క్‌ఫోర్సుపై దాడులకు దిగడం సాధ్యమేనా?

⇒  మృతదేహాల పక్కన ఉన్న దుంగలు పాతబడిన దుంగలని స్పష్టంగా తెలుస్తోంది. వాటిపై ఎర్ర రంగు పెయింట్ గుర్తుల ఆనవాళ్లు, ఆ గుర్తులను గీరి చెరిపివేసేందుకు ప్రయత్నించిన ఆనవాళ్లు ఉన్నాయి. ఎర్రచందనం స్మగ్లర్లపై దాడిలో అటవీ సిబ్బంది స్వాధీనం చేసుకున్న దుంగలపై ఇలా పెయింట్‌తో గుర్తు వేసి పక్కనపెడతారు. కూలీలు అడవుల్లో నరికిన దుంగలను పట్టుకెళతారు కానీ.. వాటికి రంగులతో గుర్తులు వేసి పట్టుకెళ్లరు. దీనినిబట్టే.. పోలీసులు గతంలో తాము స్వాధీనం చేసుకుని పెయింట్ మా ర్కులు వేసిన దుంగలను తెచ్చి కూలీల మృతదేహాల వద్ద పడేసినట్లు స్పష్టమవటం లేదా?

⇒  వంద మంది కూలీలు దుంగలు మోస్తూ ఎదురుపడ్డారని టాస్క్‌ఫోర్సు అధికారులు చెప్తున్నారు. పోలీసుల ‘ఎన్‌కౌంటర్’లో 20 మంది చనిపోతే.. మిగతా వారంతా పారిపోయారని అంటున్నారు. కానీ.. చనిపోయిన కూలీల దగ్గర మాత్రమే ఎర్రచందనం దుంగలు పడి ఉన్నాయి. అంటే.. మిగతా 80 మంది కూలీలు ఎర్ర చందనం దుంగలను పడేయకుండా.. వాటిని మోసుకుంటూనే.. పోలీసులకు, వారి తూటాలకు చిక్కకుండా పారిపోయారా?
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement