ఒత్తిళ్లకు గురవుతున్న అధికారులు
అర్ధరాత్రుళ్లు జోరుగా అక్రమ రవాణా
ఇసుక క్వారీల వద్దనే కోడిపందేలు, పేకాటలు
అండగా బడా నాయకులు
విజయవాడ : జిల్లాలోని ఇసుక కార్వీలలో దందాలు చేసి తెలుగుదేశం పార్టీ నాయకులు కోట్లు గడిస్తున్నారు. అడ్డుకున్న వారిపై దౌర్జన్యానికి దిగుతున్నారు. ప్రభుత్వం నీరు-చెట్టు కార్యక్రమం ద్వారా చెరువులు, కుంటల్లోని మట్టిని తవ్వి అమ్ముకుని దోచుకునేందుకు లెసైన్స్ ఇవ్వడంతో ఇసుకతోపాటు మట్టి దందా కూడా సాగిస్తున్నారు. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్న ముసునూరు తహశీల్దార్ వనజాక్షిపై ఎమ్మెల్యే చింతమనేని అనుచరులు దాడి చేయడంతో జిల్లాలో జరుగుతున్న ఇసుక అక్రమ రవాణా రాష్ట్ర స్థాయిలో చర్చనీయాశంగా మారింది. ఇసుక క్వారీలను డ్వాక్రా గ్రూపులకు ఇచ్చినప్పటికీ వాస్తవంగా తెలుగుదేశం నేతల కనుసన్నల్లోనే నడుస్తున్నాయి. కొన్ని చోట్ల నేతల అనుచరులు ఇసుక అక్రమ రవాణా చేయడమే కాకుండా అక్కడే కోడిపందేలు, పేకాటలు కూడా ఆడుతూ అధికారులకు సవాలు విసురుతున్నారు. జిల్లాలో జరుగుతున్న ఇసుక దందాను పరిశీలిస్తే..
నూజివీడు నియోజకవర్గంలోని ముసునూరు మండలంలో ఉన్న తమ్మిలేరు వాగు నుంచి ఇసుకను దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గత కొన్ని సంవత్సరాలుగా యథేచ్ఛగా పశ్చిమగోదావరి జిల్లాకు తరలించుకుపోతున్నారు. బలివే, రంగంపేట ప్రాంతాల్లో నుంచి ట్రాక్టర్‌లలో ఇసుకను తీసుకుపోతున్నారు. రాత్రిపూట అయితే ఇతని అనుచరుల ఆగడాలకు అంతే ఉండదు. ఇసుక దందాతోపాటు భారీ ఎత్తున పేకాట, కోడిపందేలు నిర్వహిస్తున్నారు. వీరికి ముసునూరు మండలంలోని టీడీపీ నాయకులతో సత్సంబంధాలు ఉన్నాయి. ఇదేమని ప్రశ్నించిన తహశీల్దార్ వనజాక్షి, ఆమె సిబ్బందిపై, అక్కడికి వెళ్లిన సాక్షి విలేకరిపై దాడులకు తెగబడటం చర్చనీయాంశంగా మారింది.
ఉద్యోగాలు ఊడగొట్టించుకుని..
జగ్గయ్యపేట మండలం వేదాద్రి ఇసుక క్వారీ అనుమతి వచ్చినప్పటికి రహదారి లేకపోవడంతో అధికార పార్టీ నాయకులు రిజర్వు ఫారెస్ట్ సర్వే నంబరు 124 భూమిని 200ల మీటర్ల మేర ధ్వంసం చేసి రోడ్డు నిర్మించారు. వత్సవాయి మండలం ఆళ్లూరుపాడులో ఇసుక క్వారీలో డ్వాక్రా మహిళల చాటున అధికార పార్టీ నాయకులు ఇసుక అక్రమ రవాణా చేస్తుండటంతో వారికి సహకరించిన ఐకేపీ సీసీ నాగరాజు, ఏపీఎం చంద్రశేఖర్‌లను ఉన్నతాధికారులు సస్పెండ్ చేసి ఇంటికి పంపి క్వారీ నిలిపివేశారు. అదే విధంగా పెనుగంచిప్రోలు మండలం శనగపాడు ఇసుక క్వారీ నుంచి కూడా తెలుగు తమ్ముళ్లు ఇసుకను అక్రమంగా రవాణా చేయటంతో ఐకేపీ సీసీని సస్పెండ్ చేయటంతో అక్కడ క్వారీ కూడా నిలిచిపోయింది. రీచ్‌లు మూత పడటంతో తెలుగు తమ్ముళ్లు రాత్రుళ్లు ఇసుకను రహస్య ప్రాంతాల్లో డంప్ చేసి ట్రాక్టర్ల ద్వారా ఇతర ప్రాంతాలకు రవాణా చేస్తున్నారు. ఇక గుంటుపల్లి రేవును మూసివేయడంతో ఫెర్రి క్వారీకి విపరీతమైన డిమాండ్ పెరిగి లారీలను సీరియల్‌లో పెడుతున్నారు. టీడీపీ నాయకుల లారీలకు మాత్రం సీరియల్‌తో పనిలేకుండా నేరుగా ఇసుక క్వారీకి పంపుతున్నారు. లారీ కార్మికులకు టీడీపీ నేతల మధ్య నిత్యం వివాదాలు తలెత్తుతున్నాయి.
పక్క రాష్ట్రానికి ఇసుక తరలింపు..
గంపలగూడెం మండలంలో రాత్రుళ్లు ఇసుక అక్రమ రవాణా చేస్తూ అక్కడ నుంచి తెలంగాణా రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాకు తరలిస్తున్నారు. అక్కడ నుంచి సురక్షితంగా హైదరాబాద్‌కు చేర్చి సొమ్ము చేసుకుంటున్నారు. తిరువూరు మండలంలోని గానుగపాడు, రోలుపడి, చింతలపాడు, అక్కపాలెం గ్రామాల పరిధిలో వాగుల నుంచి ఇసుక అక్రమ రవాణా జరుగుతోంది. మండల పరిషత్ కార్యాలయం నుంచి జారీ చేస్తున్న ఇసుక కూపన్లను చేతుల్లో పెట్టుకొని గ్రామ కమిటీలు ఇసుక సీనరేజీ వసూలు చేస్తున్నాయి.
అధికార తెలుగుదేశం పార్టీ నాయకులు ఇసుక సిండికేట్లను నిర్వహిస్తూ పోలీసు, రెవెన్యూ అధికారులను నియంత్రిస్తున్నారు. పెడన ఎమ్మెల్యే కాగిత వెంకట్రావ్ అనుచరులు సిండికేట్‌గా ఏర్పడి అక్రమ మైనింగ్‌కు పాల్పడుతున్నారు. పెడన మండలం మడక, బల్లిపర్రు, కొంకేపూడి, కట్లపల్లి ప్రాంతాల్లో ఇసుక దందా జోరుగా సాగిస్తున్నారు. ఇక్కడ నుంచి ట్రక్కు రూ. 500 చొప్పున బందరు మండలానికి తరలించి విక్రయిస్తున్నారు.
ఇసుక రీచ్‌ల్లో టీడీపీ దందా!
Published Fri, Jul 10 2015 12:57 AM | Last Updated on Sun, Sep 3 2017 5:11 AM
Advertisement