సూత్రధారులకు పసుపు ముసుగు
చివరికి డ్రైవర్ బలిపశువయ్యాడు
కేసు మాఫీకి రాజకీయ పైరవీలు
అతీగతీ లేని గంజాయి రవాణా కేసు
అధికార పార్టీలోకి వెళ్లగానే తప్పులు ఒప్పులవుతాయా?.. అదేలా.. తప్పు తప్పే కదా!.. ఎక్కడున్నా కేసు కేసే కదా!! అంటారా.. అరకులో ఇటీవల పార్టీలు జంప్ చేసిన నేతలను అడగాల్సిందే. అప్పుడుగానీ.. ఎప్పుడు తప్పో.. ఎప్పుడు ఒప్పో.. మీకు తెలిసిరాదు.. లేదంటే ఈ కథనం చదవండి.. మీకే అర్థం అవుతుంది. దాదాపు రెండేళ్ల క్రితం గంజాయి తరలిస్తూ పట్టుబడిన కేసులో సూత్రధారులుగా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధితో పాటు మరో ఇద్దరు నేతలు ఉన్నారు. వీరంతా ఇటీవల తెలుగుదేశం పార్టీలోకి వెళ్లగానే ఆ కేసును ఎక్సైజ్ పోలీసులు అటకెక్కించేశారు. గంజాయి తరలిస్తున్న వాహనం డ్రైవర్‌ను మాత్రం బలి చేసి కేసును నిర్వీర్యం చేసేశారు. అసలేం జరిగిందో మీరే చూడండి.
విశాఖపట్నం: విశాఖ ఏజెన్సీలో గంజాయి సాగు, అక్రమ రవాణాలో కొంతమంది తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులే కీలకంగా మారారు. పెదబయలు మండలంలోని మారుమూల ప్రాంతం నుంచి మైదాన ప్రాంతాలకు గుట్టుచప్పుడు కాకుండా గంజాయి రవాణా చేస్తున్న ముఠాలకు టీడీపీ నేతలే అండదండలు అందిస్తున్నారు. పొరపాటున పోలీసుల దాడుల్లో పట్టుబడితే చిన్న చేపలను బలిచేసి కేసులను నీరుగార్చేస్తున్నారు. 2014 ఆగస్టు 10న నమోదైన గంజాయి రవాణా కేసును పరిశీలిస్తే.. మన్యంలో ఏం జరుగుతుందో అర్ధం చేసుకోవచ్చు. పెదబయలు మండలం గోమంగి ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చెందిన అంబులెన్స్‌లో సుమారు 350 కిలోల గంజాయిని జి.మాడుగుల-పాడేరు ప్రధాన మార్గంలో రాత్రి వేళ తరలించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు, ఎక్సైజ్ అధికారులు వేర్వేరుగా ఆ రోడ్డులో మాటు వేశారు. పోలీసులను చూసి ఆగకుండా వేగంగా వెళ్లిపోయిన అంబులెన్స్‌ను ఎట్టకేలకు పాడేరు- సుండ్రుపుట్టు రోడ్డులో పట్టుకున్నారు.
డ్రైవర్ పరారు కాగా, సుమారు 350 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఇంత పెద్దమొత్తంలో గంజాయి తరలింపు వెనుక స్థానిక సంస్థల ప్రజాప్రతినిధి, మరో ఇద్దరు దళారుల హస్తం ఉందన్న వాదనలు వినిపించాయి. ఈ మేరకు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ముందుగా అంబులెన్స్ డ్రైవర్ సీదరి మత్స్యరాజును అరెస్ట్ చేశారు. ఆ తర్వాతే కథ అడ్డం తిరిగింది. సూత్రధారులు తమ నాయకుడైన ఓ ప్రజాప్రతినిధితో ఒత్తిడి తేవడంతో పోలీసులు కేసును పట్టించుకోవడం మానివేశారు. గంజాయి ఎక్కడ నుంచి వచ్చింది.. ఎవరు ఎక్కడికి పంపిస్తున్నారు.. అసలేం జరుగుతోంది.. అన్న కోణంలో అధికారుల దర్యాప్తు సాగలేదు. పట్టుబడిన అంబులెన్స్‌కు ముందు పెలైట్‌గా వెళుతున్న బైక్‌ను అప్పట్లో జి.మాడుగుల పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాహనాన్ని నడిపిన వ్యక్తి మాత్రం పరారయ్యాడు. ఇప్పటికీ ఆ నిందితుడు ఎవరనేది పోలీసులు కనిపెట్టలేదు. బైక్ మాత్రం నేటికీ జి.మాడుగుల స్టేషన్‌లోనే ఉంది. స్థానికసంస్థల ప్రజాప్రతినిధి ఇటీవల తెలుగుదేశం పార్టీలో చేరి నేతగా హల్‌చల్ చేస్తుండటంతో ఇక ఆ కేసు ఊసు కూడా పోలీసులు ఎత్తడం లేదు. గంజాయి రవాణా వ్యవహారంలో ఒక్క డ్రైవర్‌ను మాత్రమే బలిచేసి కేసును దాదాపుగా మూసేశారు.
అసలు నిందితులు తప్పించుకున్నారు.. -డ్రైవర్ మత్స్యరాజు ఆరోపణ
ఈ కేసులో తనను అన్యాయంగా ఇరికించారని గోమంగి ఆస్పత్రి అంబులెన్స్ డ్రైవర్ మత్స్యరాజు ఆవేదన వ్యక్తం చేశాడు. ఆ రోజు ఉదయం ఆస్పత్రిలో అంబులెన్స్‌ను ఉంచి పాడేరులోని తమఇంటికి వెళ్లిపోయాయనని.. అయితే మరుసటి రోజు అంబులెన్స్ గంజాయితో దొరికిందంటూ తనపై కేసు పెట్టారని చెప్పారు. తాను గంజాయి లోడ్‌తో అంబులెన్స్‌ను నడపలేదని చెప్పినప్పటికీ పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారని పేర్కొన్నాడు. జైలుకు వెళ్లడంతో ఉద్యోగం కూడా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అసలు నిందితులు తప్పించుకొని, తాననొక్కడినే బలి చేశారని చెప్పారు. ఆ కేసులో వాస్తవంగా ఎవరెవరు ఉన్నారనేది పోలీసులకు తెలుసునని వ్యాఖ్యానించాడు.
ఆరోపణలు వచ్చాయి.. కానీ..: ఎక్సైజ్ సీఐ ఉపేంద్ర
అప్పట్లో ఆ వాహనాన్ని తానే పట్టుకున్నానని ప్రస్తుతం గాజువాకలో ఎక్సైజ్ సీఐగా పని చేస్తున్న ఉపేంద్ర చెప్పారు. ‘ఇప్పటివరకు డ్రైవర్ ఒక్కరినే అరెస్టు చేశాం. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధితో పాటు కొంతమంది దీని వెనుక సూత్రధారులని ఆరోపణలు వచ్చాయి. కానీ.. పక్కా ఆధారాలు లభించలేదు. మరో ముగ్గురు నిందితులపై కేసు కట్టి దర్యాప్తు చేస్తున్నాం’.. అని ఆయన చెప్పారు. కేసును ఉద్దేశపూర్వకంగా నిర్వీర్యం చేశారన్న వాదనలపై మాట్లాడుతూ తాను అప్పట్లో పాడేరులో మొబైల్ పార్టీ సీఐగా మాత్రమే పనిచేశానన్నారు. నిందితులను పట్టుకుని అప్పజెప్పడం మినహా దర్యాప్తులో తమ పాత్ర ఉండదన్నారు. ఈ కేసు విషయమై ప్రస్తుత పాడేరు ఎక్సైజ్ సీఐ కె.రాజారావుతో ‘సాక్షి’ మాట్లాడగా, తాను ఇటీవలే బదలీపై వచ్చానన్నారు. అసలేం జరిగిందో తెలుసుకుని నిష్పక్షపాతంగా విచారణ చేపడతానని చెప్పారు. దోషులు అధికార పార్టీకి చెందిన వారైనా వదిలేది లేదన్నారు.
ఎమ్మెల్యే రాజీనామాకు సీపీఎం డిమాండ్
ఆనంతగిరి: అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు తక్షణం తన పదవికి రాజీనామా చేయాలని అనంతగిరి ఎంపీటీసీ సభ్యుడు, సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు డి.గంగరాజు, సీపీఎం మండల కార్యదర్శి మొస్యాలు డిమాండ్ చేశారు. వారు బుధవారం ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ, మండలంలో డీ ఫాం భూముల కొనుగోలు విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన నైతిక బాధ్యతగా రాజీనామా చేయాలన్నారు. పాడేరు సబ్ కలెక్టర్ మంగళవారం బహిరంగ విచారణ చేసిన సమయంలో నడిమివలస, పందిరివలసకు చెందిన బాధితులు ఎమ్మెల్యే అనుచరులు వచ్చి డబ్బులు ఇచ్చి తమ పట్టాలు తీసుకున్నారని తమ దృష్టికి తీసుకుని వచ్చారన్నారు. ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం కాకుండా రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.
గంజాయి కేసూ గల్లంతే
Published Thu, Jul 14 2016 2:39 AM | Last Updated on Fri, Aug 10 2018 8:16 PM
Advertisement
Advertisement