ఇక ‘అసైన్డ్‌’ వంతు! | Telangana: Govt Focus On Assigned Notary Layout Land Regularization | Sakshi
Sakshi News home page

ఇక ‘అసైన్డ్‌’ వంతు!

Published Thu, Feb 17 2022 1:40 AM | Last Updated on Thu, Feb 17 2022 4:31 AM

Telangana: Govt Focus On Assigned Notary Layout Land Regularization - Sakshi

రాష్ట్రంలో నెలకొన్న భూముల సమస్యలు, వివాదాలను ఒక్కొక్కటిగా పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచీ పెండింగ్‌లో ఉన్న భూ సంబంధిత సమస్యలను పేద, మధ్యతరగతి వర్గాలకు అనుకూలంగా పరిష్కరించడంతో పాటు ప్రభుత్వానికి ఆదాయం వచ్చేలా ప్రణాళికలు రూపొందిస్తోంది.

ప్రభుత్వ స్థలాల క్రమబద్ధీకరణకు మరోమారు అవకాశం కల్పిస్తూ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం.. తాజాగా అసైన్డ్‌ భూములు, నోటరీ స్థలాలు, లే అవుట్‌ల రెగ్యులరైజేషన్‌  సంబంధిత అంశాలపై దృష్టి సారించింది. దీంతో ఈ అంశాలకు కూడా త్వరలోనే పరిష్కారం లభించే అవకాశం ఉందని రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి.

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని అసైన్డ్‌ భూములతో పాటు నోటరీ స్థలాలు, లే అవుట్‌ల రెగ్యులరైజేషన్‌పై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ముఖ్యంగా కీలకమైన అసైన్డ్‌ భూముల సమస్య పరిష్కారానికి కసరత్తు ప్రారంభించింది. రాష్ట్ర వ్యాప్తంగా 24 లక్షల ఎకరాల భూమిని 14 లక్షల మందికి అసైన్‌ చేశారు. అయితే ఈ భూములపై అసైనీలకు ఎలాంటి యాజమాన్య హక్కులు కల్పించలేదు. భూబదలాయింపు నిషేధ చట్టం (పీవోటీ) కారణంగా ఈ భూములపై అసైనీలకు హక్కులు కల్పించే అవకాశం లేకుండా పోయింది. దీంతో కేవలం వారసత్వ బదిలీకి మాత్రమే ఈ భూములు పరిమితం అయ్యాయి.

ఇప్పుడు ధరణి పోర్టల్‌లో చాలా అసైన్డ్‌ భూములు నిషేధిత భూముల జాబితాలో ఉండడంతో ఈ లావాదేవీలు కూడా జరగడం లేదు. అయితే ఓ కటాఫ్‌ తేదీని నిర్ధారించి ఈ కటాఫ్‌ తేదీ కంటే ముందు పేదలకు అసైన్‌ చేసిన భూములపై పీవోటీ చట్టాన్ని సవరించడం ద్వారా అసైనీలకు సర్వహక్కులు కల్పించాలనే ప్రతిపాదన చాలా కాలంగా పెండింగ్‌లో ఉంది. అయితే అసైన్డ్‌ భూములు అన్యాక్రాంతమయ్యాయన్న ఆరోపణల నేపథ్యంలో జిల్లాల వారీగా ఎన్ని ఎకరాల అసైన్డ్‌ భూములున్నాయి? అందులో ఎన్ని అసైనీల చేతిలో ఉన్నాయి? ఎన్ని థర్డ్‌ పార్టీల చేతుల్లో ఉన్నాయి? ఎన్ని ఎకరాల్లో వెంచర్లు వేసి అక్రమంగా అమ్మకాలు జరిగాయి? థర్డ్‌ పార్టీల సామాజిక, ఆర్థిక స్థితిగతులేంటి ? అనే వివరాలను ప్రభుత్వం ఇప్పటికే సేకరించింది.

ఈ వివరాల ఆధారంగా అసైన్డ్‌ భూముల విషయంలో నిర్ణయం తీసుకునేందుకు మంత్రి కేటీఆర్‌ నేతృత్వంలో ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం కూడా కొంత కసరత్తు జరిపింది. అయితే ఈ హక్కుల కల్పనకు గాను పీవోటీ చట్టాన్ని సవరించాల్సి ఉండడంతో త్వరలో ప్రారంభం కానున్న బడ్జెట్‌ సమావేశాల్లో సవరణ బిల్లు సభ ముందుకు తెస్తారా లేదా అనేది ఇంకా నిర్ణయించలేదని రెవెన్యూ వర్గాలు చెపుతున్నాయి. ఒకవేళ ఈసారి వాయిదా పడితే వర్షాకాల సమావేశాల్లో మాత్రం ఖచ్చితంగా సభ ముందుకు బిల్లు వస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

వెంచర్లకు మార్గదర్శకాలు సిద్ధం
మరోవైపు అనువుగా ఉన్న చోట్ల అసైన్డ్‌ భూముల్లో ప్రభుత్వమే వెంచర్లు వేసేందుకు ప్రణాళిక రూపొందిస్తోంది. ముఖ్యంగా కొత్తగా ఏర్పాటు చేసిన పట్టణాభివృద్ధి సంస్థల్లో అసైన్డ్‌ భూముల్లో వెంచర్లు వేసేందుకు మార్గదర్శకాలు కూడా సిద్ధమయ్యాయి. ల్యాండ్‌ పూలింగ్‌లో భాగంగా పట్టాదారు రైతులు ఎకరం భూమి ఇస్తే ప్రభుత్వ నిబంధనల ప్రకారం మౌలిక సదుపాయాల కోసం మినహాయించగా మిగిలే 2,800 గజాల్లో సగం భూమిపై రైతుకు యాజమాన్య హక్కు ఇవ్వాలని, లావుణి భూములయితే 600 గజాలపై హక్కు ఇవ్వాలని, అదే అసైన్డ్‌ భూమి అయితే సదరు అసైనీకి 25 శాతం (700 గజాలు) హక్కులు ఇవ్వాలని నిర్ణయించింది. ఇదే పద్ధతిని హైదరాబాద్‌ శివార్లలోని కొన్ని గ్రామాల్లో ఉన్న అసైన్డ్‌ భూముల విషయంలో అవలంబించాలన్న ప్రతిపాదన కూడా పెండింగ్‌లో ఉంది. అయితే ఈ భూముల విషయంలో హక్కు ఇవ్వడం కన్నా పరిహారం చెల్లించి స్వాధీనం చేసుకుని ఆ తర్వాత వాటిని అమ్మాలనే ప్రతిపాదనల వైపే ప్రభుత్వం మొగ్గుచూపుతోంది. ఈ నేపథ్యంలో త్వరలోనే అసైన్డ్‌ భూములకు పరిష్కారం లభిస్తుందని రెవెన్యూ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. 

ఎల్‌ఆర్‌ఎస్‌ కూడా కొలిక్కి!
పనిలో పనిగా లేఅవుట్‌ రెగ్యులరైజేషన్‌ స్కీం(ఎల్‌ఆర్‌ఎస్‌)ను కూడా ఓ కొలిక్కి తేవాలనే దిశలో ప్రభుత్వ వర్గాలు కసరత్తు చేస్తున్నాయి. ఈ స్కీం కింద పెద్ద ఎత్తున దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుంటే పెద్ద ఎత్తున ఆదాయం కూడా వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా గ్రేటర్‌ హైదరాబాద్, హెచ్‌ఎండీఏ పరిధిలోని అక్రమ లేఅవుట్లలోని ప్లాట్లను రిజిస్ట్రేషన్‌ చేస్తే చాలా వరకు భూ సమస్యలు తీరిపోనున్నాయి. ఈ నేపథ్యంలో ఎల్‌ఆర్‌ఎస్‌పై కూడా ప్రభుత్వం త్వరలోనే నిర్ణయాన్ని ప్రకటిస్తుందని అంటున్నారు. నోటరీ స్థలాలకు ఒకసారి రిజిస్ట్రేషన్‌కు అవకాశం కల్పిస్తామని సీఎం కేసీఆర్‌ అసెంబ్లీలోనే చెప్పిన నేపథ్యంలో దీనిపై కూడా త్వరలోనే ప్రకటన వస్తుందనే అభిప్రాయాన్ని రెవెన్యూ వర్గాలు వ్యక్తం చేశాయి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement