Regularization process
-
గందరగోళం ఉంది గడువు ఇవ్వండి.. టైమ్ ప్లీజ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రభుత్వ భూములు/స్థలాల క్రమబద్ధీకరణపై గందరగోళం నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వం జీవో 58, 59ల అమలును పొడిగించినా.. దరఖాస్తుల స్వీకరణలో ఇబ్బందులు, ఇప్పటికీ మార్గదర్శకాల అంశం తేల్చకపోవడం, రెవెన్యూ అధికారులకు లాగిన్ ఇవ్వకపోవడం, గతంలో పెండింగ్‌లో పడ్డ దరఖాస్తుల విషయంగా స్పష్టత రాకపోవడం వంటివి సమస్యగా మారాయి. ఇవేవీ తేలకుండానే దరఖాస్తుల గడువు ముగుస్తుండటంపై ఆందోళన వ్యక్తమవుతోంది. క్రమబద్ధీకరణ దరఖాస్తుల గడువును పెంచాలని.. మార్గదర్శకాలు ఇచ్చి, ఇతర సమస్యలను సరిదిద్దాలని విజ్ఞప్తులు వస్తున్నాయి. దరఖాస్తుల స్వీకరణ చేపట్టినా.. రాష్ట్రంలో పేదలు ఆక్రమించుకుని, నివాసముంటున్న ప్రభుత్వ స్థలాల క్రమబద్ధీకరణ కోసం ప్రభుత్వం గతంలోనే జీవో 58, 59లను జారీ చేసింది. అప్పట్లో మూడున్నర లక్షల మంది వరకు దరఖాస్తు చేసుకోగా.. రెండు లక్షలకుపైగా దరఖాస్తులు పరిష్కారమయ్యాయి. మిగతావి వివిధ కారణాలతో పెండింగ్‌లో పడ్డాయి. ఈ క్రమంలో ప్రభుత్వం ఇటీవలే మరోసారి క్రమబద్ధీకరణ దరఖాస్తులకు అవకాశమిచ్చింది. ఫిబ్రవరి 22 నుంచి మార్చి 31 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని ప్రకటించింది. ఈ గడువు గురువారంతో ముగిసిపోతోంది. 50 రోజులకుపైగా అవకాశమిచ్చినా 1.47 లక్షల దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. దీనికి పలు సమస్యలు, ఇబ్బందులకు తోడు ప్రభుత్వం మార్గదర్శకాలపై స్పష్టత ఇవ్వకపోవడం కూడా కారణమని విమర్శలు వస్తున్నాయి. గడువు ఇవ్వాల్సిందే.. భూముల క్రమబద్ధీకరణకు ఇది చివరి అవకాశమని, మరోమారు అవకాశం ఇచ్చేది లేదని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో జనంలో ఆందోళన వ్యక్తమవుతోంది. అన్ని సందేహాలను నివృత్తి చేస్తూ మార్గదర్శకాలు విడుదల చేయాలని, ఆ మార్గదర్శకాలకు అనుగుణంగా దరఖాస్తు చేసుకునేందుకు మరికొంత సమయం ఇవ్వాలని డిమాండ్ వస్తోంది. ఈ సమస్యలు తేలేదెలా? కేవలం మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలోనే.. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో భూముల క్రమబద్ధీకరణ కోసం జీవో 58, 59లను విడుదల చేశారు. ఆ జీవోలకు అనుగుణంగా 2014లో దరఖాస్తులు స్వీకరించినప్పడు.. పట్టణాలతోపాటు గ్రామీణ ప్రాంతాల్లోని భూములకూ వర్తింపజేశారు. కానీ ఈసారి దరఖాస్తులను కేవలం పట్టణ ప్రాంతాలకే పరిమితం చేశారు. గ్రామాల పరిధిలోని భూముల క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తు చేసుకునేందుకు ప్రయత్నిస్తే.. పోర్టల్‌లో ఆ ఆప్షనే కనిపించడం లేదు. కేవలం మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో ఆప్షన్ మాత్రమే చూపిస్తోంది. దీంతో గ్రామీణ ప్రాంతాల్లోని వారెవరూ తాజాగా క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసుకోలేకపోయినట్టు రెవెన్యూ వర్గాలే చెప్తున్నాయి. అధికారులకు లాగిన్ ఏదీ? దరఖాస్తుల స్వీకరణ గడువు ముగింపునకు వచ్చినా.. రెవెన్యూ వర్గాలకు ఇంతవరకు లాగిన్ అధికారం ఇవ్వలేదు. ఏదైనా మండలంలో ఎన్ని దరఖాస్తులు వచ్చాయనే వివరాలు కూడా రెవెన్యూ వర్గాలకు తెలియడం లేదు. ఇక అందిన దరఖాస్తులను పరిశీలించి, తగిన విధంగా లేకుంటే మార్చుకునేలా ప్రజలకు సూచనలు చేసే అవకాశం లేకుండా పోయిందని అధికారులు చెప్తున్నారు. దీనివల్ల ఏవైనా పొరపాట్లు ఉన్న దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. మార్గదర్శకాలపై స్పష్టత లేక.. క్రమబద్ధీకరణ దరఖాస్తులను ఎవరు పరిశీలించాలి? ఎవరు పరిష్కరించాలనే విషయంలోనూ స్పష్టత లేదు. దీనిపై గతంలో ఉన్న మార్గదర్శకాలను అనుసరిస్తారా, లేక కొత్త మార్గదర్శకాలు ఇస్తారా అన్నది ఇప్పటికీ తేలలేదు. ‘పెండింగ్’ సందేహాలు తీర్చేదెవరు? 2014లో చేసుకున్న దరఖాస్తుల్లో లక్షన్నర వరకు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి. అందులో కొందరు దరఖాస్తులు మాత్రమే చేసుకోగా, మరికొందరు మొదటి, రెండో పేమెంట్ కూడా చెల్లించి ఉన్నారు. ఇప్పుడు వారంతా మళ్లీ దరఖాస్తు చేసుకోవాలా? పాతవాటినే పరిగణనలోకి తీసుకుంటారా అన్నది తేలలేదు. ఇక ప్రభుత్వం ఇటీవల రెండుసార్లు భూముల ధరలను సవరించింది. ఈ క్రమంలో పాత దరఖాస్తులకు కొత్త ధరలు వర్తింపజేస్తారా, పాత రేట్లతోనే క్రమబద్ధీకరిస్తారా అన్నదానిపైనా స్పష్టత రావాల్సి ఉంది. బుధవారం నాటికి వచ్చిన దరఖాస్తులివీ.. జీవో 58 కింద అందినవి 87,520 జీవో 59 కింద అందినవి 59,748 మొత్తం దరఖాస్తులు 1,47,268 -
ఇక ‘అసైన్డ్’ వంతు!
రాష్ట్రంలో నెలకొన్న భూముల సమస్యలు, వివాదాలను ఒక్కొక్కటిగా పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచీ పెండింగ్‌లో ఉన్న భూ సంబంధిత సమస్యలను పేద, మధ్యతరగతి వర్గాలకు అనుకూలంగా పరిష్కరించడంతో పాటు ప్రభుత్వానికి ఆదాయం వచ్చేలా ప్రణాళికలు రూపొందిస్తోంది. ప్రభుత్వ స్థలాల క్రమబద్ధీకరణకు మరోమారు అవకాశం కల్పిస్తూ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం.. తాజాగా అసైన్డ్ భూములు, నోటరీ స్థలాలు, లే అవుట్ల రెగ్యులరైజేషన్ సంబంధిత అంశాలపై దృష్టి సారించింది. దీంతో ఈ అంశాలకు కూడా త్వరలోనే పరిష్కారం లభించే అవకాశం ఉందని రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి. సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని అసైన్డ్ భూములతో పాటు నోటరీ స్థలాలు, లే అవుట్ల రెగ్యులరైజేషన్‌పై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ముఖ్యంగా కీలకమైన అసైన్డ్ భూముల సమస్య పరిష్కారానికి కసరత్తు ప్రారంభించింది. రాష్ట్ర వ్యాప్తంగా 24 లక్షల ఎకరాల భూమిని 14 లక్షల మందికి అసైన్ చేశారు. అయితే ఈ భూములపై అసైనీలకు ఎలాంటి యాజమాన్య హక్కులు కల్పించలేదు. భూబదలాయింపు నిషేధ చట్టం (పీవోటీ) కారణంగా ఈ భూములపై అసైనీలకు హక్కులు కల్పించే అవకాశం లేకుండా పోయింది. దీంతో కేవలం వారసత్వ బదిలీకి మాత్రమే ఈ భూములు పరిమితం అయ్యాయి. ఇప్పుడు ధరణి పోర్టల్‌లో చాలా అసైన్డ్ భూములు నిషేధిత భూముల జాబితాలో ఉండడంతో ఈ లావాదేవీలు కూడా జరగడం లేదు. అయితే ఓ కటాఫ్ తేదీని నిర్ధారించి ఈ కటాఫ్ తేదీ కంటే ముందు పేదలకు అసైన్ చేసిన భూములపై పీవోటీ చట్టాన్ని సవరించడం ద్వారా అసైనీలకు సర్వహక్కులు కల్పించాలనే ప్రతిపాదన చాలా కాలంగా పెండింగ్‌లో ఉంది. అయితే అసైన్డ్ భూములు అన్యాక్రాంతమయ్యాయన్న ఆరోపణల నేపథ్యంలో జిల్లాల వారీగా ఎన్ని ఎకరాల అసైన్డ్ భూములున్నాయి? అందులో ఎన్ని అసైనీల చేతిలో ఉన్నాయి? ఎన్ని థర్డ్ పార్టీల చేతుల్లో ఉన్నాయి? ఎన్ని ఎకరాల్లో వెంచర్లు వేసి అక్రమంగా అమ్మకాలు జరిగాయి? థర్డ్ పార్టీల సామాజిక, ఆర్థిక స్థితిగతులేంటి ? అనే వివరాలను ప్రభుత్వం ఇప్పటికే సేకరించింది. ఈ వివరాల ఆధారంగా అసైన్డ్ భూముల విషయంలో నిర్ణయం తీసుకునేందుకు మంత్రి కేటీఆర్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం కూడా కొంత కసరత్తు జరిపింది. అయితే ఈ హక్కుల కల్పనకు గాను పీవోటీ చట్టాన్ని సవరించాల్సి ఉండడంతో త్వరలో ప్రారంభం కానున్న బడ్జెట్ సమావేశాల్లో సవరణ బిల్లు సభ ముందుకు తెస్తారా లేదా అనేది ఇంకా నిర్ణయించలేదని రెవెన్యూ వర్గాలు చెపుతున్నాయి. ఒకవేళ ఈసారి వాయిదా పడితే వర్షాకాల సమావేశాల్లో మాత్రం ఖచ్చితంగా సభ ముందుకు బిల్లు వస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వెంచర్లకు మార్గదర్శకాలు సిద్ధం మరోవైపు అనువుగా ఉన్న చోట్ల అసైన్డ్ భూముల్లో ప్రభుత్వమే వెంచర్లు వేసేందుకు ప్రణాళిక రూపొందిస్తోంది. ముఖ్యంగా కొత్తగా ఏర్పాటు చేసిన పట్టణాభివృద్ధి సంస్థల్లో అసైన్డ్ భూముల్లో వెంచర్లు వేసేందుకు మార్గదర్శకాలు కూడా సిద్ధమయ్యాయి. ల్యాండ్ పూలింగ్‌లో భాగంగా పట్టాదారు రైతులు ఎకరం భూమి ఇస్తే ప్రభుత్వ నిబంధనల ప్రకారం మౌలిక సదుపాయాల కోసం మినహాయించగా మిగిలే 2,800 గజాల్లో సగం భూమిపై రైతుకు యాజమాన్య హక్కు ఇవ్వాలని, లావుణి భూములయితే 600 గజాలపై హక్కు ఇవ్వాలని, అదే అసైన్డ్ భూమి అయితే సదరు అసైనీకి 25 శాతం (700 గజాలు) హక్కులు ఇవ్వాలని నిర్ణయించింది. ఇదే పద్ధతిని హైదరాబాద్ శివార్లలోని కొన్ని గ్రామాల్లో ఉన్న అసైన్డ్ భూముల విషయంలో అవలంబించాలన్న ప్రతిపాదన కూడా పెండింగ్‌లో ఉంది. అయితే ఈ భూముల విషయంలో హక్కు ఇవ్వడం కన్నా పరిహారం చెల్లించి స్వాధీనం చేసుకుని ఆ తర్వాత వాటిని అమ్మాలనే ప్రతిపాదనల వైపే ప్రభుత్వం మొగ్గుచూపుతోంది. ఈ నేపథ్యంలో త్వరలోనే అసైన్డ్ భూములకు పరిష్కారం లభిస్తుందని రెవెన్యూ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఎల్ఆర్ఎస్ కూడా కొలిక్కి! పనిలో పనిగా లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీం(ఎల్ఆర్ఎస్)ను కూడా ఓ కొలిక్కి తేవాలనే దిశలో ప్రభుత్వ వర్గాలు కసరత్తు చేస్తున్నాయి. ఈ స్కీం కింద పెద్ద ఎత్తున దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుంటే పెద్ద ఎత్తున ఆదాయం కూడా వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్, హెచ్ఎండీఏ పరిధిలోని అక్రమ లేఅవుట్లలోని ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేస్తే చాలా వరకు భూ సమస్యలు తీరిపోనున్నాయి. ఈ నేపథ్యంలో ఎల్ఆర్ఎస్పై కూడా ప్రభుత్వం త్వరలోనే నిర్ణయాన్ని ప్రకటిస్తుందని అంటున్నారు. నోటరీ స్థలాలకు ఒకసారి రిజిస్ట్రేషన్‌కు అవకాశం కల్పిస్తామని సీఎం కేసీఆర్ అసెంబ్లీలోనే చెప్పిన నేపథ్యంలో దీనిపై కూడా త్వరలోనే ప్రకటన వస్తుందనే అభిప్రాయాన్ని రెవెన్యూ వర్గాలు వ్యక్తం చేశాయి. -
క్రమబద్ధీకరణపై ఎందుకింత ఆలస్యం?
* కాంట్రాక్టు ఉద్యోగాల క్రమబద్ధీకరణ జాప్యంపై సీఎస్ ఆగ్రహం * 20 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులకు 4 వేల ప్రతిపాదనలేనా? * వారానికోసారి పురోగతిని సమీక్షించాలని నిర్ణయం సాక్షి, హైదరాబాద్: కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ ప్రక్రియలో జరుగుతున్న జాప్యంపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్హులను నిబంధనల ప్రకారం క్రమబద్ధీకరిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని ఆయా శాఖలకు సూచించారు. సచివాలయంలో గురువారం కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ పురోగతిపై సీఎస్ అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులతో సమీక్షించారు. ఇప్పటివరకు 12 శాఖల నుంచి కేవలం 4 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగుల ప్రతిపాదనలు మాత్రమే తమకు అందాయని ఆర్థిక శాఖ అధికారులు సీఎస్‌కు నివేదించారు. రాష్ట్రంలో 20 వేలకు పైగా కాంట్రాక్టు ఉద్యోగులున్నట్లుగా ప్రాథమికంగా అంచనా వేయగా, ఇప్పటివరకు అందులో నాలుగో వంతు ప్రతిపాదనలు కూడా ఎందుకు రాలేదని సీఎస్ ముఖ్య కార్యదర్శులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫిబ్రవరిలోనే స్పష్టమైన మార్గదర్శకాలు, నియమ నిబంధనలు రూపొందించి ఉత్తర్వులు విడుదల చేసినప్పటికీ ఇప్పటివరకు వివరాలు ఇవ్వకపోవటంపట్ల అసహనం వ్యక్తం చేశారు. వైద్య, ఆరోగ్య శాఖ, విద్యాశాఖల పరిధిలో ఎక్కువ మంది కాంట్రాక్టు ఉద్యోగులున్నారని, కానీ వీరిని క్రమబద్ధీకరించేందుకు రకరకాల అడ్డంకులున్నాయని అధికారులు సీఎస్ దృష్టికి తీసుకెళ్లారు. వీటన్నింటినీ ఒక్కటొక్కటిగా పరిష్కరించాల్సిన అవసరముందని, అందుకే ఆలస్యమవుతోందని గుర్తించారు. మరోవైపు ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లు, సొసైటీల కింద పని చేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించాలా.. లేదా అనే అంశంపై ప్రధానంగా చర్చ జరిగింది. మార్గదర్శకాలకు భిన్నమైన సమస్యలు, ప్రత్యేకమైన కేసులేమైనా ఉంటే, వాటిని ప్రత్యేకంగానే పరిగణించాలని సీఎస్ అధికారులకు సూచించినట్లు తెలిసింది. క్రమబద్ధీకరణ పురోగతిని వారం రోజులకోసారి సమీక్షించాలని సీఎస్ అధికారులకు సూచించారు. 18న కాంట్రాక్టు ఉద్యోగుల భేటీ మరోవైపు క్రమబద్ధీకరణపై ప్రభుత్వం మరింత జాప్యం చేస్తుండటంపట్ల కాంట్రాక్టు ఉద్యోగులు, సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 18న హైదరాబాద్‌లో సమావేశమై కార్యాచరణ రూపొం దించేందుకు సిద్ధమవుతున్నారు. క్రమబద్ధీకరణ ప్రక్రియ వేగవంతానికి ముఖ్యమంత్రి కేసీఆర్ జోక్యం చేసుకోవాలని కాంట్రాక్టు లెక్చరర్ల సంఘం ప్రధాన కార్యదర్శి కొప్పిశెట్టి సురేష్ డిమాండ్ చేశారు.