* భూ అక్రమాలపై రాష్ట్ర అసెంబ్లీ నిర్ణయం
* భూముల దొంగలందరినీ బయటపెడదామన్న సీఎం కేసీఆర్
* సభాసంఘం ఏర్పాటుకు అన్నిపక్షాల ఏకాభిప్రాయం
* విచారణ పరిధిలోకి భూదాన్, దేవాలయ, వక్ఫ్, చర్చి భూములు..
* వచ్చే సమావేశాల నాటికి సభకు నివేదిక అందించాలని గడువు
* రాష్ట్రంలో 1.90 లక్షల ఎకరాలు అన్యాక్రాంతమయ్యాయన్న సీఎం
* వాటిని తిరిగి పేదలకే కట్టబెడతామని అసెంబ్లీలో ప్రకటన
* పొన్నాలకు భూ కేటాయింపులపై సభలో దుమారం
* చట్ట విరుద్ధంగా భూములు పొందారన్న మంత్రి హరీశ్
* అధికారం అండతో చట్టాన్ని చుట్టాలుగా చేసుకున్నారని వ్యాఖ్య
సాక్షి, హైదరాబాద్: అసైన్డ్ భూముల పంపిణీ, కేటాయింపుల్లో జరిగిన అక్రమాలపై విచారణ జరిపించాలని రాష్ర్ట అసెంబ్లీ నిర్ణయించింది. ఇందులో భాగంగా ఈ వ్యవహారాన్ని పరిశీలించేందుకు సభాసంఘాన్ని ఏర్పాటు చేసింది. ఈ మేరకు స్పీకర్ మధుసూదనాచారి బుధవారం శాసనసభలో ప్రకటన చేశారు. దీనిప్రకారం రాష్ట్రం లో దళిత, గిరిజనులు సహా ఇతర వర్గాల వారికి ఇప్పటివరకు పంపిణీ చేసిన అసైన్డ్ భూములతో పాటు పది జిల్లాల్లో అసైన్‌మెంట్ పరిధిలోకి వచ్చే భూదాన్, దేవాలయ, వక్ఫ్, చర్చి వంటి అన్ని రకాల భూములపై సభాసంఘం విచారణ జరపనుంది. ఇది అన్ని జిల్లాల్లో పర్యటించి భూ అక్రమాలపై నివేదికను వచ్చే సమావేశాల నాటికి సభ ముందు పెట్టాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సూచించారు.
సభాసంఘం చేసే సిఫార్సులు, సూచనలను అమలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుందని ప్రకటించారు. నివేదిక సమర్పణకు, దాని అమలుకు నిర్దిష్ట కాలపరిమితిని మరోమారు సభలో చర్చించి నిర్ణయిద్దామన్నారు. వరంగల్ జిల్లా ధర్మసాగర్ మండలంలోని రాంపూర్ గ్రామంలో పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యకు జరిపిన 8.39 ఎకరాల భూ కేటాయింపులపై బుధవారం టీఆర్‌ఎస్ సభ్యుడు ఇంద్రకరణ్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ సభ్యుడు తాటి వెంకటేశ్వర్లు సహా ఇతర సభ్యులు ఇచ్చిన సావధాన తీర్మానంపై శాసనసభలో వాడివేడిగా చర్చ జరిగింది.
ఈ సందర్భంగా అన్ని పక్షాల నేతలు మాట్లాడారు. అన్యాకాంత్ర భూములపై సభాసంఘం వేయాలని, ఒక్క ధర్మసాగర్ భూములే కాకుండా, కబ్జాలకు గురైన అన్ని రకాల భూములను సభాసంఘం పరిధిలోకి తీసుకొచ్చి విచారణ జరపాలని గట్టిగా కోరారు. దీనిపై కాంగ్రెస్ కొన్ని అభ్యంతరాలను లేవనెత్తే ప్రయత్నం చేసినా, మిగిలిన పక్షాలన్నీ సభాసంఘం ఏర్పాటుకు అంగీకరించడంతో ఆ పార్టీ కూడా అందుకు సమ్మతించింది.
అధికారంతో యథేచ్ఛగా అక్రమాలు
సభ్యుల సావధాన తీర్మానంపై మంత్రి హరీశ్‌రావు సమాధానమిచ్చారు. ‘1971లో దళితులకు కేటాయించిన భూములను తర్వాతి కాలంలో పొన్నాల లక్ష్మయ్య, పొన్నాల రామ్మోహన్‌లు కబ్జా చేశారు. దీనిపై 2001లో వేసిన రిట్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. 2002లో అప్పీల్‌కు వెళ్లగా సమయం వృథా చేశారంటూ కోర్టు చీవాట్లు పెట్టింది. అనంతరం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక దళితులకు చెందిన 81.13 ఎకరాల భూమిని ఏపీఐఐసీకి, మరో 8.39 ఎకరాల భూమిని పొన్నాల లక్ష్మయ్యకు ఏపీఐఐసీ ద్వారా కట్టబెడుతూ జీవో ఇచ్చింది. అయితే ఈ భూమిలో పరిశ్రమలను నెలకొల్పకపోవడంతో 2009 నుంచి వరుసగా నోటీసులు కూడా జారీ అయ్యాయి.
పొన్నాలకు ఇచ్చిన భూమిని వెనక్కి తీసుకోవాలని 2013లో ఏపీఐఐసీని ఆదేశించినా అది అమలు కాలేదు. పొన్నాలకు భూ కేటాయింపుల విషయంలోనూ ఉదారంగా వ్యవహరించారు. వరంగల్ పట్టణానికి అతి సమీపంలో జాతీయ రహదారిపై ఉన్న భూమిని ఎకరం కేవలం రూ. 25,500 చొప్పున ఇచ్చారు. ఇదీగాక ఈ భూమిని ఇవ్వడం వల్ల ఏపీఐఐసీకి చెందిన మరో మూడెకరాలకు దారి లేకుండా పోయింది. భూ కేటాయింపుల్లో అన్ని చట్టాలను ఉల్లంఘించారు. చట్టాలను చుట్టాలుగా చేసుకుంటూ, అధికారం అండతో యథేచ్ఛగా భూ అక్రమాలకు పాల్పడ్డారు. దీనికి ఎలాంటి శిక్ష విధించాలో కాంగ్రెస్ పార్టీనే చెప్పాలి’ అని హరీశ్ వ్యాఖ్యానించారు.
ఇదే సమయంలో కాంగ్రెస్ సభ్యుడు భట్టి విక్రమార్క పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తారు. సభలో లేని వ్యక్తిని కించపరుస్తూ మాట్లాడటాన్ని సభా నిబంధనలు ఒప్పుకోవని అన్నారు. దీనిపై ప్రతిపక్ష నేత జానారెడ్డి సైతం అభ్యంతరం తెలిపారు. మంత్రి వ్యాఖ్యలు కేవలం వ్యక్తిని ఎండగట్టేందుకు ఉద్దేశించినవిగా ఉన్నాయన్నారు. అయినా హరీశ్ కొనసాగిస్తూ.. ‘ఇడుపులపాయలో భూ ఆక్రమణలపై గతంలో అసెంబ్లీలో చర్చ సందర్భంగా నాటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి స్పందించి.. దళితులకు చెందిన భూములను ఎవరైనా తిరిగిచ్చేయాలన్నారు. ఆయన స్వయంగా భూములివ్వడమే కాకుండా ఆ మేర కు చట్టాన్ని కూడా తెచ్చారు. దాన్ని కూడా పొన్నాల పట్టిం చుకోలేదు’ అని వ్యాఖ్యానించారు.
మరోవైపు హరీశ్ మాట్లాడుతున్నంతసేపు కాంగ్రెస్ సభ్యు లు తీవ్ర అభ్యంతరం తెలపడంతో సభలో గందరగోళ వాతావరణం నెలకొంది. మరోవైపు అధికారపక్షం వాదనతో పార్టీలన్నీ ఏకీభవించాయి. దళితుల భూ కబ్జాలపై వెంటనే సభా సంఘాన్ని వేయాలని, దీంతో పాటే హన్మకొండ మండలంలోని తిమ్మాపూర్‌లో కబ్జాకు గురైన 200 ఎకరాలను స్వాధీనం చేసుకోవాలని వైఎస్సార్‌సీపీ సభ్యుడు తాటి వెంకటేశ్వర్లు కోరారు. టీడీపీ తరఫున ఎర్రబెల్లి దయాకర్‌రావు, బీజేపీ తరఫున రాంచంద్రారావు, ఎంఐ ఎం సభ్యుడు పాషా ఖాద్రి, సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య తది తరులు సైతం సభాసంఘం వేయాలని డిమాం డ్ చేశారు. రాష్ట్రంలో అసైన్డ్ అక్రమాలన్నింటిపైనా విచారణ చేయాలని కోరారు. కాంగ్రెస్ తరఫున సంపత్‌కుమార్ మాట్లాడుతూ.. ఓ వ్యక్తిని లక్ష్యంగా చేసుకునేందుకు దళితులను వాడుకోరాదని హితవు పలికారు.
భూములిచ్చినా.. అభివృద్ధిలేదు..
సభాసంఘం ఏర్పాటుపై సభలో ఏకాభిప్రాయం వ్యక్తమవడంతో దీనిపై సీఎం కేసీఆర్ స్పందించారు. పొన్నాలకు భూ కేటాయింపులు చట్టవిరుద్ధమని రాష్ట్ర హైకోర్టు పేర్కొన్నప్పటికీ అప్పటి ప్రభుత్వం ఏపీఐఐసీ ద్వారా భూములను కట్టబెట్టిందని, అది పద్ధతి కాదని ముఖ్యమంత్రి అన్నారు. దళితులకు భూ కేటాయింపులు చేసినా అభివృద్ధి జరగలేదని, ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉందని పేర్కొన్నారు.
‘దళితులకు, గిరిజనులకు ప్రభుత్వం ఇచ్చిన భూములపై రెవెన్యూ అధికారులతో సర్వే చేయిస్తే 1.90 లక్షల ఎకరాల భూమి ఆక్రమణలకు గురైందని తేలింది. ఇక్కడ ఓ వ్యక్తిని లక్ష్యం చేసుకోవడం కాదు. పొన్నాలకు కేటాయించిన భూమిని స్వాధీనం చేసుకోవాలని ఏపీఐఐసీకి, దాని స్థానిక జోనల్ మేనేజర్‌ను ప్రభుత్వం ఆదేశించినా అది జరగలేదు. దానిపై చర్యలు తీసుకుందాం’ అని సీఎం అన్నారు.
దీంతో ప్రతిపక్ష నేత జానారెడ్డి జోక్యం చేసుకుంటూ.. అన్యాక్రాంతమైన భూముల విషయంలో సభాసంఘం వేయడం మంచిదేనని, ఇలాంటి భూములు ఎవరి అధీనంలో ఉన్నా పరిశీలించి అందరికీ న్యాయం చేయాలని సూచించారు. అయితే పొన్నాలకు భూ కేటాయింపుల విషయంలో ప్రభుత్వమే దళితుల భూమిని కొనుగోలు చేసి ఏపీఐఐసీకి ఇచ్చింద ని, భూముల కొనుగోలులో గత ప్రభుత్వం తప్పు చేసి ఉంటే ఈ ప్రభుత్వం దాన్ని సవరిం చాలని అన్నారు.
దొంగలందరినీ బయటపెడదాం..
అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ మళ్లీ కొనసాగించారు. ‘అసైన్డ్ భూములు అన్యాక్రాంతం కారాదు. భూదాన్‌తోపాటు లక్షల కోట్ల విలువైన వక్ఫ్ భూములు సహా అన్ని రకాల భూములను ఇందులో చేర్చి దొంగలందరినీ బయటపెడదాం. పేదల నోటికాడి భూములు కొట్టేసిన వారంతా శిక్షార్హులే. సభాసంఘం విషయంలో ఏకాభిప్రాయం ఉన్నందున అది జిల్లాలన్నీ తిరిగి అన్ని భూములపై విచారణ జరిపి వచ్చే సమావేశాల నాటికి సభ ముందు పెట్టాలి. ఆ సిఫారసుల మేరకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.
అసైన్డ్ భూములను ఎవరి దగ్గరి నుంచి తీసుకున్నారో తిరిగి ఆ పేదలకే భూములు దక్కేలా నిర్ణయం చేద్దామ’ని సీఎం అన్నారు. దీనిపై ఎంఐఎం నేత అక్బరుద్దీన్ మాట్లాడుతూ గతంలో వక్ఫ్ భూముల ఆక్రమణలపై సభాసంఘం వేసినా.. దానికి నిర్దిష్ట గడువు లేకపోవ డంతో నివేదిక ఆలస్యమైందని గుర్తు చేశారు. ఈ దృష్ట్యా ప్రస్తుత సభాసంఘానికి గడువు విధించి, నిర్దిష్ట సమయంలో చర్యలు చేపట్టాలని సూచించారు.
'అసైన్డ్'పై సభాసంఘం
Published Thu, Nov 27 2014 12:30 AM | Last Updated on Tue, Aug 14 2018 10:51 AM
Advertisement
Advertisement