
సాక్షి, హైదరాబాద్: త‍్వరలో లక్షా 12 వేల ఉద్యోగాలు 100 శాతం భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. సోమవారం ఉదయం శాసనసభలో అంబేద్కర్ ఓవర్‌సీస్ పథకం, గ్రూప్-2 పై అడిగిన ప్రశ్నలపై సీఎం మాట్లాడారు. అంబేద్కర్ ఓవర్‌సీస్ పథకానికి పరిమితి లేదన్నారు. అర్హులందరికీ ఈ పథకం వర్తింప చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. బలహీన వర్గాల కోసం అనేక పథకాలు తీసుకొచ్చామని ఈ సందర్భంగా తెలియజేశారు.
ఉద్యోగుల సంఖ్యకు అనుగుణంగా భర్తీ ఉంటుందన్నారు. టీఎస్‌పీఎస్సీలో అనేక సంస్కరణలు చేపట్టిన ఘంటా చక్రపాణిని యూపీఎస్సీ అభినందించిందని ముఖ్యమంత్రి కేసీఆర్ గుర్తు చేశారు. నిర్మాణాత్మక సలహాలిస్తే స్వీకరిస్తాం కానీ.. అడ్డగోలుగా మాట్లాడితే గౌరవం ఉండదని ఆయన హెచ్చరించారు. చెప్పిన దానికంటే వెయ్యి ఉద్యోగాలు ఎక్కువగానే ఇస్తామని అన్నారు. ఉద్యోగుల సంఖ్యకు అనుగుణంగానే భర్తీ ఉంటుందని సీఎం అన్నారు.