అన్ని మాటలన్నాక.. అసెంబ్లీకి అవసరమా?
హైదరాబాద్: టీఆర్ఎస్ ఆవిర్భావ సభలో కాంగ్రెస్ పార్టీ నాయకులను ఉద్దేశించి సీఎం కేసీఆర్ చేసిన తీవ్ర విమర్శలు అసెంబ్లీ సమావేశాలపై ప్రభావం చూపేలాఉంది. దద్దమ్మలు, సన్నాసులు, చవటలు అని తిట్టిన తర్వాత కూడా ఎల్లుండి జరిగే శాసనసభలో ప్రభుత్వానికి సహకరించాలా? అసలు అసెంబ్లీకి వెళ్లడం అవసరమా? అని కాంగ్రెస్ పార్టీలో చర్చ జరుగుతున్నట్లు ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి చెప్పారు. శుక్రవారం హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన ఆయన.. కేసీఆర్ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేశారు.
'కేవలం కాంగ్రవరంగల్‌లో టీఆర్‌ఎస్ సభ కాంగ్రెస్‌ను తిట్టడానికి పెట్టినట్లు ఉందని ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి అన్నారు.
'టీఆర్‌ఎస్ ప్రగతి నివేదన సభలో ప్రభుత్వం ఇప్పటిదాకా సాధించిన ప్రగతి, భవిష్యత్ ప్రణాళికలు, వాగ్దానాల అమలు లాంటి విషయాలు చెబుతారని ఆశించాం. కానీ అలా జరగలేదు. కాంగ్రెస్ పార్టీని నోటికొచ్చినట్లు తిట్టడానికి మాత్రమే టీఆర్ఎస్ సభను నిర్వహించినట్లుంది. ముఖ్యమంత్రి వ్యాఖ్యలతో ప్రగతి నివేదన పక్కకు పోయింది. సంస్కృతి గురించి మాట్లాడే కేసీఆర్.. సన్నాసుల, దద్దమ్మల భాషను ఎంచుకున్నారు' అని సుధాకర్ రెడ్డి మండిపడ్డారు.
(30న తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం)
సీఎం చేస్తోన్న పనుల్లో మంచిని కాంగ్రెస్ పార్టీగా స్వాగతిస్తూ సంస్కారవంతంగా వ్యవహరిస్తున్నామని, కేసీఆర్ వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని సుధాకర్ రెడ్డి అన్నారు. 'ఇలాంటి పరిస్థితుల్లో రేపు బీఏసీ, ఎల్లుండి అసెంబ్లీ సమావేశం పెట్టారు. వీటికి హాజరుకావాలా వద్దా అనే ఆలోచనలో ఉన్నాం. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌ను దద్దమ్మలు, చవటలు అన్న తర్వాత కూడా అసెంబ్లీకి వెళ్లాలా? నచ్చినట్లు అసెంబ్లీ నడుపుతుంటే.. మేం వెళ్లడం అవసరమా?' అని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాహుబలి-2 సినిమా పేరుతో విపరీత దోపిడీ జరుగుతున్నదన్న పొంగులేటి.. దీనిపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
(కాంగ్రెస్ నేతలకు బుద్ధి చెప్పాలి: వరంగల్ సభలో కేసీఆర్)