సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో ఇటీవల కురిసిన అకాల వర్షాలకు నష్టపోయిన పత్తి రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. మంగళవారం ఉదయం శాసనసభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. పత్తికి కనీస మద్దతు ధర కంటే ఎక్కువ ఇచ్చి కొనుగోలు చేసేందుకు చర్యలు చేపట్టామని తెలిపారు. ఈ సారి పత్తి రైతులకు మంచి మద్దతు ధర వస్తుందని ఆశిస్తున్నామని సీఎం చెప్పారు. 48 లక్షల ఎకరాల్లో పత్తిని సాగు చేశారని తెలిపారు. ఇప్పటికీ 5 శాతం లోపే పత్తి మార్కెట్‌లోకి వచ్చిందన్నారు. కొన్ని చోట్ల మంచి పత్తికి కనీస మద్దతు ధర కంటే ఎక్కువనే ఇచ్చి కొనుగోలు చేస్తున్నారని వెల్లడించారు. మద్దతు ధర కోసమే రైతు సమన్వయ సమితులు ఏర్పాటు చేస్తున్నామని సీఎం పేర్కొన్నారు.
పంట కాలనీలు వేసి.. పంటలకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. కొన్ని చోట్ల కాంగ్రెస్ నేతలే పంటలను తగులబెట్టే కార్యక్రమం చేపడుతున్నారని సీఎం పేర్కొన్నారు. రైతులకు నష్టపరిహారం ఇవ్వాలంటే నాలుగు సంవత్సరాల బడ్జెట్ కూడా సరిపోదని సీఎం తెలిపారు. రైతులకు సకాలంలో ఎరువులు, విత్తనాలు అందించాం. నాణ్యమైన కరెంట్‌ను అందిస్తున్నాం. రుణాలు మాఫీ చేయడంలో విజయం సాధించామని సీఎం తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment