పనులు అడ్డుకున్న భూ నిర్వాసితులు
నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్
శ్రీరాంపూర్ : శ్రీరాంపూర్ ఓసీపీలో ముంపునకు గురైన సింగపూర్ గ్రామ భూ నిర్వాసితులు గురువారం ఆందోళన చేపట్టారు. తమకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఓబీ వాహనాలను అడ్డుకుని ఆందోళన చేశారు. క్వారీ నుంచి డంప్‌యార్డుకు వెళ్లే మార్గంలో మట్టి టిప్పర్లకు అడ్డంగా బైఠాయించి ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా నిర్వాసితులు మాట్లాడుతూ సింగరేణి యాజమాన్యం, రెవెన్యూ అధికారులు కలిసి తమకు అన్యాయం చేస్తున్నారని వాపోయారు. గ్రామంలో 312 ఎకరాల అసైన్డ్ భూమిని ఓసీీపీ క్రింద తీసుకున్నారని తెలిపారు. 205 ఎకరాలకు డబ్బులు ఇవ్వాలని అవి ఈ నెల 2న ఇస్తామని నాడు రెవెన్యూ అధికారులు హామీ ఇచ్చారని తెలిపారు. నష్టపరిహారాలు చెల్లించేంత వరకు పనులు నడవనివ్వమని భీష్మించుకు కూర్చున్నారు. ఘటనా స్థలానికి ఎస్సై మసూద్ చేరుకుని ఆందోళన విరమింపజేశారు. కార్యక్రమంలో నిర్వాసిత కమిటీ నాయకులు గుంట జెగ్గయ్య, రంగ రమేశ్, ఐత శంకరయ్య, మల్లమ్మ, బుచ్చయ్య, బానేశ్, తిరుపతి, బానేశ్‌లు పాల్గొన్నారు.