land expats
-
భూ నిర్వాసితుల పిటిషన్‌పై హైకోర్టులో విచారణ
సాక్షి, రాజన్న సిరిసిల్ల: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన సిరిసిల్ల జిల్లా అనంతగిరి రిజర్వాయర్ ప్రాజెక్టు భూ నిర్వాసితుల పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ చేపట్టింది. అనంతగిరి ప్రాజెక్ట్ భూ నిర్వాసితులకు పరిహారం ఇవ్వకుండా నీటిని విడుదల చేసారని పిటిషనర్ రచనారెడ్డి కోర్టుకు వివరించారు. కరోనా నేపథ్యంలో లాక్డౌన్ అమలు సమయంలో అనంతగిరికి నీళ్లు విడుదల చేస్తున్నారని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. వాదనలు విన్న ధర్మాసనం అనంతగిరి ప్రాజెక్టు భూ నిర్వాసితుల పరిహారానికి సంబంధించిన పూర్తి వివరాలు కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను హైకోర్టు రెండు వారాలకు వాయిదా వేసింది. -
చివరి రూపాయి ఇచ్చేదాకా అడుగుపెట్టొద్దు
సాక్షి, హైదరాబాద్: మల్లన్నసాగర్ రిజర్వాయర్ కోసం చేపట్టిన భూసేకరణలో భూములు కోల్పోయిన ఏటిగడ్డ కిష్టాపూర్ గ్రామస్తులకు అందాల్సిన పరిహారం చివరి రూపాయి అందేంత వరకు వారి భూముల్లో అడుగుపెట్టొద్దని ప్రభుత్వానికి హైకోర్టు తేల్చిచెప్పింది. పునరావాసం, పునర్నిర్మాణ ప్రయోజనాలను అందించకుండానే ఆ భూములను స్వాధీనం చేసుకొని వాటిని భారీ యంత్రాల సాయంతో చదువును చేస్తున్నారనేందుకు ఆధారాలున్నాయని తెలిపింది. అందువల్ల ఏటిగడ్డ కిష్టాపూర్ గ్రామంలో ఏ ఒక్క అధికారి ఉండటానికి వీల్లేదని స్పష్టం చేసింది. బాధితులకు పునరావాస, పునర్నిర్మాణ ప్రయోజనాలను వర్తింపజేయాలంటూ గతంలో ఇచ్చిన ఆదేశాలపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలంటూ తదుపరి విచారణను ఈ నెల 15కు వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ ఎ. రాజశేఖర్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ అంశంపై హైకోర్టు ఉత్తర్వులను ధిక్కరించిన అధికారులపై కోర్టు ధిక్కారం కింద చర్యలు తీసుకోవాలంటూ దాఖలైన పిటిషన్‌పై ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది. పోలీసుల సాయంతో ఖాళీ చేయిస్తున్నారు... భూ నిర్వాసితులకు కల్పించాల్సిన ప్రయోజనాలను కల్పించకుండానే అధికారులు వారి భూములను స్వాధీనం చేసుకొని ఖాళీ చేయిస్తున్నారని పిటిషనర్లు కోర్టుకు చెప్పారు. పోలీసులను సైతం ఉపయోగిస్తూ బాధితులపై బలప్రయోగం చేస్తున్నారని నివేదించారు. బాధితుల భూముల్లోకి భారీ యంత్రాలను తీసుకొచ్చి చదును చేస్తున్నారని తెలిపారు. ఈ పనులకు సంబంధించిన ఫొటోలను న్యాయవాది ధర్మాసనానికి సమర్పించారు. ఫొటోలను పరిశీలించిన ధర్మాసనం ఆ భూముల్లోంచి అధికారులందరినీ బయటకు పంపేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ సమయంలో ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) జె. రామచంద్రరావు జోక్యం చేసుకుంటూ బాధితులకు ఇప్పటికే రూ. 500 కోట్లు ఇచ్చామని, మరో రూ. 350 కోట్లకు చెక్కులు సిద్ధం చేశామని, పట్టాలు కూడా ఇచ్చామన్నారు. చట్టం చెబుతున్న దానికన్నా ఎక్కువ ఇస్తున్నామన్నారు. లక్ష్మీదేవి వస్తుంటే ఎవరైనా వద్దంటారా? ప్రభుత్వం చెబుతున్న దానిని గుడ్డిగా నమ్మడం సాధ్యం కాదన్న హైకోర్టు... బాధితులకు చేసిన సాయంపై పూర్తి ఆధారాలను సమర్పించాలని ఆదేశించింది. కొందరు బాధితులు ఏఏజీ తీసుకోకుండా రాజకీయ కారణాలతో ప్రాజెక్టులను అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నారంటూ ఏఏజీ చేసిన వాదనతో ధర్మాసనం విభేదించింది. ‘లక్ష్మీదేవి వస్తుంటే ఎవరైనా వద్దంటారా? మీరు ఎవరికి పరిహారం ఇవ్వాలనుకుంటున్నారో వారిని మా సమక్షానికి తీసుకొచ్చి ఇవ్వండి. వారు ఎందుకు తీసుకోరో మేమూ చూస్తాం. కోర్టు ధిక్కారణ ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులను సమర్థించొద్దు. ఇది వారికి సమస్యలు సృష్టిస్తుంది’అని వ్యాఖ్యానిస్తూ కేసు తదుపరి విచారణను వాయిదా వేసింది. -
‘జగన్ సీఎం అయితేనే మాకు న్యాయం జరుగుతుంది’
సాక్షి, విజయనగరం : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితేనే తమకు న్యాయం జరుగుతుందని విజయనగరం జిల్లా సారిపల్లి గ్రామానికి చెందిన తారకరామతీర్థసాగర్ ప్రాజెక్టు భూ నిర్వాసితులు విశ్వాసం వ్యక్తం చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ప్రారంభమైన తారకరామతీర్థసాగర్ ప్రాజెక్టు జగన్మోహన్ రెడ్డి సీఎం అయితేనే పూర్తవుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం జగన్మోహన్ రెడ్డిని కలిసిన భూ నిర్వాసితులు తమ గోడును ఆయన ముందు వెల్లబోసుకున్నారు. రెండు పంటలు పండే 1400 ఎకరాల భూమిని సేకరించిన ప్రభుత్వం పరిహారం మాత్రం చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతి రాజు తమ గ్రామాన్ని దత్తత తీసుకుని, పరిహారం ఇప్పిస్తానని చెప్పి మాటిచ్చి నాలుగున్నరేళ్లు కావస్తున్నా న్యాయం జరగటంలేదని వాపోయారు. మమ్మల్నికూడా ఆదుకోవాలన్నా! స్వర్ణ కారులకు హామీ ఇచ్చినట్టే తమను కూడా ఆదుకోవాలని విశ్వ బ్రాహ్మణ సంఘం ప్రతినిధులు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వినతిపత్రం సమర్పించారు. ఆదివారం విశ్వ బ్రాహ్మణ సంఘం ప్రతినిధులు జగన్మోహన్ రెడ్డిని కలిశారు. విశ్వ బ్రాహ్మణుల్లో కార్పెంటర్లు, శిల్పం, కంచర, కమ్మర ఈ నాలుగు ఉపకులాలను ఆదుకోవాలని విజ్ణప్తి చేశారు. కార్పెంటర్లకు ప్రభుత్వ టింబర్ డిపోలనుంచి రాయితీ, సబ్సీడీతో కలప సరఫరా చేయాలని కోరారు. -
‘చెన్నారెడ్డినే తరిమిన ఘనత మాది’
సాక్షి, తాడేపల్లిగూడెం: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు మండిపడ్డారు. విమానాశ్రయ భూముల నిర్వాసితులకు పట్టాలు ఇవ్వడంలో టీడీపీ ప్రభుత్వం మాట తప్పిందని ఆరోపించారు. వారికి మద్దతుగా తాడేపల్లి గూడెంలో శుక్రవారం ఆయన నిరసన దీక్ష చేపట్టారు. భూ నిర్వాసితులకు పట్టాలు అందజేయాలని డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేని చంద్రబాబు శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తమను రెచ్చగొడితే తిరగబడతామని హెచ్చరించారు. అవసరమైతే కర్రలు చేతబట్టి ప్రభుత్వంపై పోరాడుతామని స్పష్టం చేశారు. ‘మర్రి చెన్నారెడ్డినే తరిమిన ఘనత మాది. ఆఫ్ట్రాల్ చంద్రబాబును తరిమికొట్టడం పెద్ద కష్టం కాదు. దమ్ముంటే మా నిరసన దీక్షని అడ్డుకోండి’ అని సవాల్ చేశారు. నిట్ ప్రారంభోత్సవంలో బాబు ఇచ్చిన 56 హామీలకు కూడా అతీగతీ లేదని మండిపడ్డారు. -
భూ నిర్వాసితులకు న్యాయం
వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అక్కెనపెల్లి కుమార్ తిమ్మాపూర్ : జిల్లాలో ప్రాజెక్టుల కోసం భూములు ఇచ్చిన నిర్వాసితులకు ప్రభుత్వం న్యాయం చేయాలని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అక్కెనపెల్లి కుమార్ డిమాండ్‌చేశారు. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు కింద వెల్గటూర్ మండలం తాళ్లకొత్తపేటకు చెందిన నిర్వాసితులకు పరిహారం అందక రెండేళ్లుగా ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై ఎల్ఎండీలోని ఎస్డీసీని కలిసేందుకు వచ్చిన ఆయన నిర్వాసితులతో కలిసి డెప్యుటీ తహసీల్దార్‌కు మంగళవారం వినతిపత్రం అందజేశారు. ఆయన మాట్లాడుతూ దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో చేపట్టిన శ్రీపాదఎల్లంపల్లి ప్రాజెక్టు ఇప్పుడు నిండుకుండలా కనిపిస్తుందని, ఆయన కల నెరవేరిందన్నారు. నిర్వాసితులు ఇప్పటికే గ్రామాలు ఖాళీ చేసినా వారికి ప్రస్తుత ప్రభుత్వం పరిహారం అందించడంలో జాప్యం చేస్తూ అన్యాయం చేసిందన్నారు. నిర్వాసితులు భూములు, గ్రామాలను వదిలి వెళ్లి రెండేళ్లు గడుస్తున్నా పరిహారం ఇప్పటికీ అందకపోవడంతో ఆందోళన చెందుతున్నారని, కొందరు డబ్బులు రావనే బెంగతో చనిపోయారని తెలిపారు. నిర్వాసితులకు ఇప్పటికైనా పరిహారం పూర్తిస్థాయిలో చెల్లించి, అన్నీ ప్యాకేజీలు వర్తించేలా చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం జాప్యం చేస్తేనిర్వాసితులతో కలిసి పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. నిర్వాసితులకు అండగా వైఎస్సార్సీపీ ఉంటుందని చెప్పారు. ఆయన వెంట వైఎస్సార్ సీపీ యూత్ జిల్లా అధ్యక్షుడు కంది వెంకటరమణారెడ్డి, మండల అధ్యక్షుడు రేషవేణి వేణుయాదవ్, నాయకులు సురేందర్, జాప సతీష్‌రెడ్డి, తిరుపతి, నిర్వాసితులు లక్ష్మి, బొందమ్మ, సత్తయ్య ఉన్నారు. -
ఎత్తిపోతల పనులు అడ్డగింత
చింతలపూడి : పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి ఎత్తిపోతల పథకం పనులను రైతులు అడ్డుకున్నారు. ఎత్తిపోతల పథకం నిర్మాణంలో భాగంగా భూములు కోల్పోయిన రైతులు పట్టిసీమ తరహాలో తమకు కూడా ఎకరాకు రూ.30 లక్షల నష్టపరిహారం చెల్లించాలని ఈ నెల 23 నుంచి రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. మంగళవారం శిబిరం వద్దకు చేరుకున్న పోలీసులు ఆరుగురిని అరెస్ట్ చేశారు. దీంతో భూ నిర్వాసితులు పనులు జరగకుండా ప్రొక్లెయినర్లను అడ్డుకుని ఆందోళనకు దిగారు. -
పరిహారం ఇవ్వలేదని..
శ్రీరాంపూర్: పరిహారం చెల్లింపులో జాప్యం చేస్తున్నారంటూ భూ నిర్వాసితులు సింగరేణి సంస్థకు చెందిన వాహనాలను ధ్వంసం చేశారు. శుక్రవారం ఉదయం ఆదిలాబాద్ జిల్లా శ్రీరాంపూర్ మండలం సింగపూర్ గ్రామంలో చోటు చేసుకుందీ ఘటన. గ్రామానికి చెందిన ఓపెన్ కాస్ట్ భూ నిర్వాసితులకు సింగరేణి సంస్థ పరిహారం చెల్లించలేదు. దీనికి తోడు అధికారులు గ్రామ సమీపంలో రోజుకొక చోట క్యాంపులు పెడుతూ ఓపెన్ కాస్ట్ తవ్వకాల కోసం సర్వేలు చేపడుతున్నారు. ఈ చర్యలతో ఆగ్రహం చెందిన గ్రామస్తులు ఈరోజు ఉదయం అక్కడికి వచ్చిన అధికారులకు చెందిన 5 వాహనాలను రాళ్లతో దాడి చేసి ధ్వంసం చేశారు. పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని సద్దుమణిగించారు. గ్రామస్తులతో చర్చలు ప్రారంభించారు. -
పనులు అడ్డుకున్న భూ నిర్వాసితులు
నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ శ్రీరాంపూర్ : శ్రీరాంపూర్ ఓసీపీలో ముంపునకు గురైన సింగపూర్ గ్రామ భూ నిర్వాసితులు గురువారం ఆందోళన చేపట్టారు. తమకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఓబీ వాహనాలను అడ్డుకుని ఆందోళన చేశారు. క్వారీ నుంచి డంప్‌యార్డుకు వెళ్లే మార్గంలో మట్టి టిప్పర్లకు అడ్డంగా బైఠాయించి ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా నిర్వాసితులు మాట్లాడుతూ సింగరేణి యాజమాన్యం, రెవెన్యూ అధికారులు కలిసి తమకు అన్యాయం చేస్తున్నారని వాపోయారు. గ్రామంలో 312 ఎకరాల అసైన్డ్ భూమిని ఓసీీపీ క్రింద తీసుకున్నారని తెలిపారు. 205 ఎకరాలకు డబ్బులు ఇవ్వాలని అవి ఈ నెల 2న ఇస్తామని నాడు రెవెన్యూ అధికారులు హామీ ఇచ్చారని తెలిపారు. నష్టపరిహారాలు చెల్లించేంత వరకు పనులు నడవనివ్వమని భీష్మించుకు కూర్చున్నారు. ఘటనా స్థలానికి ఎస్సై మసూద్ చేరుకుని ఆందోళన విరమింపజేశారు. కార్యక్రమంలో నిర్వాసిత కమిటీ నాయకులు గుంట జెగ్గయ్య, రంగ రమేశ్, ఐత శంకరయ్య, మల్లమ్మ, బుచ్చయ్య, బానేశ్, తిరుపతి, బానేశ్‌లు పాల్గొన్నారు. -
‘కంతనపల్లి’కి గ్రహణం
- కేసీఆర్.. నిర్వాసితులను అనుగ్రహించకపోవడమే కారణం - అడుగడుగునా పనులు అడ్డుకుంటున్న స్థానికులు - నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ - నెల రోజులుగా నిలిచిన భూసార పరీక్షలు ఏటూరునాగారం : కంతనపల్లి ప్రాజెక్టు గ్రహణం పట్టుకుంది. మార్చి 29న సీఎం కేసీఆర్ వచ్చి ఒక్క మాట కూడా మాట్లాడలేదని ఆగ్రహించిన భూ నిర్వాసితులు భూసార పరీక్షలను అడ్డుకున్నారు. ఇటీవల బ్యారేజీ నిర్మాణ పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్లు ఇసుక తీస్తుండగా గ్రామస్తులు అడ్డుకుని ఆందోళనకు దిగారు. సీఎం కేసీఆర్ ప్రాజెక్టు ప్రాంతానికి వచ్చి వెళ్లినప్పటి నుంచి తట్టెడు మట్టిని కూడా తీయనివ్వడం లేదు. ముఖ్యమంత్రి పర్యటన తర్వాత పనులు ఊపందుకుంటాయని భావించగా ఇక్కడ సీన్ రివర్స అయ్యింది. దీనికంతటికి కారణం నిర్వాసితులకు నమ్మకం కలిగేలా సరైన హామీ ఇవ్వకపోవడమే. ఆదుకుంటారని ఆశతో ఎదురు చూసిన కంతనపల్లి ముంపు బాధితులకు సీఎం నిరాశే మిగిల్చారు. దీంతో ఆగ్రహించిన బాధితులు ఒక్క పనికూడా సాగనివ్వమని, ప్రభుత్వం నుంచి స్పష్టమైన, సముచితమైన హామీ వచ్చే వరకు పనులు కొనసాగించేది లేదని ఆ రోజే ప్రకటించిన విషయం తెలిసిందే. కంతనపల్లి వద్ద గోదావరి నదిపై మొదటి దశలో రూ.1609 కోట్లతో నిర్మించతలపెట్టిన బ్యారేజ్ నిర్మాణం పనుల కోసం సేకరించిన భూమికి ఎలాంటి నష్టపరిహారం ఇవ్వలేదు. గోదావరి నదిపై 3.5 కిలోమీటర్ల పొడవు, 172 గేట్ల నిర్మాణంతో చేపట్టనున్న పనుల కోసం యంత్రాలను ఏర్పాటు చేసుకునేందుకు ఏజెన్సీ రిత్విక్, ఎస్ఈడబ్ల్యూ కంపెనీలు కార్యాలయాలను ఏర్పాటు చేసుకున్నాయి. యంత్రాలు, ఇతర సామగ్రిని నిల్వ చేసుకునేందుకు తీసుకున్న భూములకు ఎలాంటి లీజు(కిరాయి) కానీ, నష్టపరిహారం ఇవ్వలేదు. వ్యవసాయం చేసుకునే భూముల్లో కంపెనీ వారు యంత్రాలు ఏర్పాటు చేసుకున్నారేగానీ ఇంత వరకు ఒక్క పైసా కూడా ఇవ్వలేదని భూ నిర్వాసితులు వాపోయారు. కాగా కంతనపల్లి గ్రామంలోని 1400 ఎకరాల భూములు బ్యాక్ వాటర్‌లో కలిసిపోతాయని అంచనా. కానీ అక్కడ ఉన్న రైతులకు కేవలం 777 ఎకరాల అసైన్డ భూమిలో కేవలం 335 ఎకరాలకు మాత్రమే రైతుల పేర పట్టాలు ఉన్నాయి. పట్టాలు ఉన్న వారికి పరిహారం ఇప్పిస్తామని చెప్పడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం స్పందించి పట్టాలు లేని రైతులు పట్టాలు ఇప్పించి ఆదుకోవాలని వేడుకుంటున్నారు. -
భూ నిర్వాసితుల దండయాత్ర
ఆర్టీపీపీ ముట్టడి ఎర్రగుంట్ల: రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్ట్(ఆర్టీపీపీ) ముట్టడి తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ప్రాజెక్ట్ నిర్మాణం కోసం భూములిచ్చిన తమకు ఉద్యోగావకాశాలు కల్పించడంలో విఫలమైన ఆర్టీపీపీ యాజమాన్యం వైఖరిని తప్పుబడుతూ భూ నిర్వాసితులు శుక్రవారం దండయాత్ర చేశారు. ఇక్కడి 600 మెగావాట్ల ప్రాజెక్ట్ గేట్లు తోసుకుని లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించిన ఆందోళనకారులను పోలీసులు, ఎస్పీఎఫ్ సిబ్బంది అడ్డుకున్నారు. వారి మధ్య వాగ్వాదం చెలరేగింది. ఒక దశలో తోపులాట జరగడంతో ఏం జరుగుతోందోనని అందరూ ఆందోళనకు గురయ్యారు. న్యాయం చేయమంటే కేసులా? ఆర్టీపీపీలో 600 మెగావాట్ల ప్రాజెక్ట్ నిర్మాణానికి అవసరమైన భూములను ఇచ్చినందుకు ప్రతిఫలంతో పాటు నిర్వాసిత కుటుంబం నుంచి ఒకరికి ఉద్యోగం ఇస్తామని గతంలో ఒప్పందం చేసుకున్నట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు డాక్టర్ మైసూరారెడ్డి సోదరుడి కుమారుడు డాక్టర్ సుధీర్‌రెడ్డి గుర్తు చేశారు. ఇచ్చిన మాట ప్రకారం ఉద్యోగావకాశాలు కల్పించాలని కోరితే కేసులు పెడతామంటూ యాజమాన్యం బెదిరింపులకు దిగుతోందని మండిపడ్డారు. నిర్వాసితులకు న్యాయం చేయాలని కోరుతూ గేటు తాళాలు వేసి లోపలికి ఎవరూ పోకుండా అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, ఎస్పీఎఫ్ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. ఆందోళనకారులను అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో తోపులాట జరిగింది. పరిస్థితి చేయి దాటుతోందని గ్రహించిన ఆర్టీపీపీ సీఈ కుమారుబాబు ఎస్ఈ శేషారెడ్డిని ఆందోళనకారుల వద్దకు చర్చల కోసం పంపారు. ఆయన సుధీర్‌రెడ్డి సమక్షంలో రైతులతో చర్చించారు. రైతుల డిమాండ్ల పరిష్కారం విషయంలో ఏపీ జెన్కో సానుకూలంగా ఉందన్నారు. ఏపీ జెన్కో డెరైక్టర్ వచ్చి రైతులతో మాట్లాడుతారని హామీ ఇచ్చారు. దీంతో వారు ఆందోళనను విరమించారు. కలమల్ల గ్రామ సర్పంచ్ నారాయణ, మాజీ సర్పంచ్ పద్మనాభయ్య, ఎమ్మర్పీఎస్ నాయకుడు వెంకటేశ్, వైఎస్సార్ విద్యుత్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర నాయకులు గుగ్గల మహేశ్వరరెడ్డి, పులి సుధాక ర్‌రెడ్డి, బీఎంఎస్ నాయకుడు గంగయ్య, ఏఐటీయూసీ నాయకులు పొన్న శివయ్య, సీఐటీయూ నాయకులు రామ్మోహన్, ఎంపీటీసీ సభ్యులు ప్రతాప్, ఎస్.ముస్తాఫ్, 1104 యూనియన్ నాయకుడు మల్లేశ్వరరెడ్డి పాల్గొన్నారు.